ETV Bharat / sports

కోల్​కతా నైట్​రైడర్స్​పై కోహ్లీసేన ఘనవిజయం

author img

By

Published : Oct 12, 2020, 11:37 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో 82 పరుగులు తేడాతో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. టోర్నీలో ఐదో గెలుపును అందుకున్న కోహ్లీసేన పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరింది.

RCB vs KKR: Royal Challengers Bangalore crush Kolkata Knight Riders by 82 runs
కోల్​కతా నైట్​రైడర్స్​పై కోహ్లీసేన ఘనవిజయం

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఆల్‌రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటు, బంతితో ఆధిపత్యం చెలాయించి ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు రెండు వికెట్లకు 194 పరుగులు చేసింది. డివిలియర్స్ (73*) విధ్వంసం సృష్టించాడు. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా తొమ్మిది వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. కోహ్లీసేనకు ఇది అయిదో విజయం.

ఛేదనకు దిగిన కోల్‌కతా ఏ దశలోనూ సత్తాచాటలేదు. బెంగళూరు బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను నియంత్రించారు. 23 పరుగులకు టామ్‌ బాంటన్‌ (8) పెవిలియన్‌కు చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాణా (9)తో కలిసి గిల్‌ (34) కొద్దిసేపు వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. కానీ రాణాను సుందర్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. ఉడానా బౌలింగ్‌లో రస్సెల్‌ (16) మెరుపులు మెరిపించినా.. అదే ఓవర్‌లో ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్లలో సుందర్‌, మోరిస్ చెరో రెండు వికెట్లు, సైని, సిరాజ్‌, ఉదాన, చాహల్ తలో వికెట్ తీశారు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో మోర్గాన్‌ (8), దినేశ్‌ కార్తిక్‌ (1), త్రిపాఠి (16), కమిన్స్‌ (1), నాగర్‌కోటి (4), చక్రవర్తి (7*), ప్రసిధ్‌ కృష్ణ (2*) పరుగులు చేశారు.

డివిలియర్స్‌ విధ్వంసం

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. ఆది నుంచి పడిక్కల్‌ (32), ఫించ్‌ (47) దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే పడిక్కల్‌ పెవిలియన్‌కు చేరిన తర్వాత బెంగళూరు ఇన్నింగ్స్‌ నిదానంగా సాగింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడటానికి యత్నించి ఫించ్‌.. ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం డివిలియర్స్‌ వచ్చిన తర్వాత ఇన్నింగ్స్‌ స్వరూపం మారిపోయింది. వరుసగా సిక్సర్ల మోత మోగించాడు. నాగర్‌కోటి బౌలింగ్‌లో రెండు సిక్సర్లను స్టేడియం అవతలకు తరలించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న కోహ్లీ (33*) 19వ ఓవర్‌లో తన తొలి బౌండరీ బాదాడు. ఆఖరి అయిదు ఓవర్లలో బెంగళూరు 83 పరుగులు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.