INDvsENG: భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టు రద్దు

author img

By

Published : Sep 10, 2021, 12:45 PM IST

Updated : Sep 10, 2021, 2:04 PM IST

INDvsENG

12:38 September 10

భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు చివరి నిమిషంలో రద్దయ్యింది. ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత జట్టు శిక్షణ బృందంలోని సభ్యులకు కరోనా వైరస్‌ సోకడం వల్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్​లో 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. మరో సమయంలో ఈ టెస్టును ఆడే వీలుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

దాదా ముందే చెప్పారు

నాలుగో టెస్టు సమయంలో రవిశాస్త్రితో పాటు మరో ముగ్గురు సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది. తాజాగా ఐదో టెస్టుకు ముందు మరొకరికి వైరస్ సోకింది. దీంతో ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దయింది. అప్పుడే ఐదో టెస్టు జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా మ్యాచ్​పై అనుమానాలు వ్యక్తం చేశారు. మ్యాచ్ జరిగే అవకాశం చాలా తక్కువ అంటూ వెల్లడించారు.

ఐపీఎల్ కారణమా? 

మరో కొద్ది రోజుల్లో ఐపీఎల్​ 13వ సీజన్​ రెండో దశ ప్రారంభం కాబోతుంది. దుబాయ్ వేదికగా జరగబోయే ఈ లీగ్ కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్ ముగిశాక సీనియర్ ఆటగాళ్లు కూడా వారితో కలవాల్సి ఉంది. అయితే ఒకవేళ ఐదో టెస్టు సమయంలో ఏ ఆటగాడికైనా కరోనా పాజిటివ్​గా తేలితే కనీసం 10 రోజులు క్వారంటైన్​లో ఉండాల్సిన పరిస్థితి. ఇదే జరిగితే ఐపీఎల్​ నిర్వహణపై ప్రభావం పడుతుంది. అందుకే ముందుగానే ఈ పరిస్థితిని గమనించిన బీసీసీఐ.. మ్యాచ్​ను రద్దు చేసుకోవడమే మంచిదని భావించినట్లు సమాచారం.

Last Updated :Sep 10, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.