ETV Bharat / sports

క్లీన్​స్వీప్​పై టీమ్ఇండియా కన్ను, రాహుల్ లయ అందుకునేనా

author img

By

Published : Aug 21, 2022, 4:32 PM IST

రెండు వన్డేల్లో జింబాబ్వేను చిత్తుగా ఓడించిన భారత్, ఆ జట్టుతో మూడో మ్యాచ్​కు సిద్ధమైంది. ఈ మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయాలని భావిస్తోంది. అన్ని విభాగాల్లో బలహీనంగా కనిపిస్తున్న జింబాబ్వే ఈ మ్యాచ్​లో భారత్ జోరును తట్టుకొని నిలవాలంటే ఏదైనా మేజిక్ చేయాల్సి ఉంటుంది.

INDIA VS ZIMBABWE 3RD ODI
INDIA VS ZIMBABWE 3RD ODI

INDIA VS ZIMBABWE 3RD ODI: భారత్, జింబాబ్వే మధ్య మూడో వన్డేకు సర్వం సిద్ధమైంది. దూకుడు మీద ఉన్న టీమ్ఇండియా.. సోమవారం జింబాబ్వేను ఢీకొననుంది. అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న రాహుల్ సేనకు ఈ మ్యాచ్​లోనూ విజయం నల్లేరుపై నడకే కానుంది. అయితే, ఆటగాళ్లంతా రాణించినా.. రాహుల్ ఫామ్​పైనే సందేహాలు నెలకొన్నాయి. తొలి మ్యాచ్​లో బ్యాటింగ్​ అవకాశం రాకపోగా.. రెండో వన్డేలో బరిలోకి దిగినప్పటికీ ఒక్కపరుగుకే వెనుదిరిగాడు రాహుల్. దీంతో మూడో వన్డేలో ఎలా అడతాడా అనేది కీలకం కానుంది.

మరోవైపు, ప్రత్యర్థి జట్టు అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. తొలి వన్డేలో 191 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే.. బౌలింగ్​లోనూ రాణించలేకపోయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్​మన్​ గిల్ లక్ష్యాన్ని వికెట్ పోగొట్టుకోకుండా ఛేదించారు. రెండో వన్డేలో జింబాబ్వే బ్యాటింగ్​ మెరుగుపడకపోగా.. మరింత దిగజారింది. 161 రన్స్​కే చాపచుట్టేసింది. అయితే, బౌలింగ్​లో భారత్​ను కాస్త ఇబ్బంది పెట్టింది. మెరుగ్గా బంతులేస్తూ వికెట్లు పడగొట్టింది. అయినప్పటికీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకొని భారత్​ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం.

రాహుల్ లయ అందుకుంటాడా?
కెప్టెన్సీ విషయంలో కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూ అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన అతడు.. బ్యాటింగ్​లో మాత్రం తేలిపోయాడు. తొలి వన్డేలో ధావన్, గిల్ రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. రెండో వన్డేలో రాహుల్ తనను తాను ఓపెనర్​గా ప్రమోట్ చేసుకున్నాడు. ఈ నిర్ణయం బెడిసికొట్టింది. అయినప్పటికీ మూడో మ్యాచ్​లో రాహుల్ ఓపెనింగ్ స్థానంలోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే, రాహుల్ తన మునుపటి ఫామ్​ను అందుకొనేందుకు ఎంత సమయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. ఆసియా కప్​ టోర్నీకి వారం రోజులే ఉన్న నేపథ్యంలో అతడి ఫామ్.. టీమ్ఇండియాకు కీలకం.

ఇక బ్యాటర్లలో ఇషాన్ కిషన్ మరో అవకాశం వస్తే రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్​లో సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు. ఫ్రంట్​లైన్ బౌలర్లు లేనప్పటికీ దీపక్ చాహర్, సిరాజ్, శార్దూల్, ప్రసిద్ధ్, అక్షర్​లతో కూడిన బౌలింగ్ దళం.. ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలోనూ ఫలితం భారత్​కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది.

జట్లు
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్.

జింబాబ్వే:
రెగిస్ చకబ్వా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇనోసెంట్ కైయా, టకుడ్జ్వానాషే కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమాని, జాన్ మసారా, టోనీ మునియోంగా, రిచర్డ్ న్గార్వా, వీ మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.