ETV Bharat / sports

అమ్మాయిలు అదుర్స్.. ఆస్ట్రేలియాపై 'సూపర్' విక్టరీ.. అదరగొట్టిన స్మృతి, రిచా

author img

By

Published : Dec 12, 2022, 6:45 AM IST

భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. ఆదివారం నాటకీయ మలుపులు తిరుగుతూ.. ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాను సూపర్‌ ఓవర్లో ఓడించింది. మహిళల క్రికెట్లో ఓ సూపర్‌ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్‌.. వెస్టిండీస్‌ (18)ను వెనక్కినెట్టి రికార్డు సృష్టించింది.

india vs australia women's cricket match
స్మృతి(79), షెఫాలి(34)

భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. ఆదివారం నాటకీయ మలుపులు తిరుగుతూ.. ఉత్కంఠ రేపిన రెండో టీ20లో ఆస్ట్రేలియాను సూపర్‌ ఓవర్లో ఓడించింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' స్మృతి మంధాన (79; 49 బంతుల్లో 9×4, 4×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మొదట మ్యాచ్‌లో, ఆ తర్వాత సూపర్‌ ఓవర్లో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20 ఓవర్లలో ఓ వికెట్‌ కోల్పోయి 187 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (82 నాటౌట్‌; 54 బంతుల్లో 13×4), తాలియా మెక్‌గ్రాత్‌ (70 నాటౌట్‌; 51 బంతుల్లో 10×4, 1×6) రెండో వికెట్‌కు అభేద్యంగా 158 పరుగులు జోడించారు.

అనంతరం ఛేదనలో భారత్‌ కూడా 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులే చేసింది. స్మృతి, షెఫాలి (34) తొలి వికెట్‌కు 76 పరుగులు జతచేసి బలమైన పునాది వేశారు. కానీ వరుస ఓవర్లలో షెఫాలి, జెమీమా (4) ఔటవడంతో ఇన్నింగ్స్‌ కుదుపునకు గురైంది. ఆ దశలో కెప్టెన్‌ హర్మన్‌ (22 బంతుల్లో 21) నిలబడగా.. మంధాన బౌండరీలతో చెలరేగింది. ఫోర్లు, సిక్సర్లతో లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చింది. నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ పెవిలియన్‌ చేరడంతో 16 ఓవర్లకు జట్టు 142/3తో నిలిచింది. విజయానికి 4 ఓవర్లలో 46 పరుగులు కావాల్సి వచ్చాయి.

india vs australia women's cricket match
స్మృతి

ఆ తర్వాతి ఓవర్లో ఓ సిక్సర్‌ కొట్టిన వెంటనే మంధాన బౌల్డయింది. దీంతో మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి. కానీ రిచా ఘోష్‌ (26 నాటౌట్‌; 13 బంతుల్లో 3×6) సిక్సర్లతో విరుచుకుపడి జట్టును రేసులో నిలిపింది. 18వ ఓవర్లో ఆమె రెండు సిక్సర్లు కొట్టడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 18గా మారింది. కానీ 19వ ఓవర్లో గొప్పగా బౌలింగ్‌ చేసిన హీదర్‌ (3/22).. దీప్తి (2)ని ఔట్‌ చేయడంతో పాటు కేవలం నాలుగు పరుగులే ఇచ్చింది. దీంతో టీమ్‌ఇండియా విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. యువ ఆల్‌రౌండర్‌ దేవిక (11 నాటౌట్‌; 5 బంతుల్లో 2×4) తీవ్ర ఒత్తిడిలోనూ ఉత్తమంగా బ్యాటింగ్‌ చేసింది. తొలి బంతికి రిచా సింగిల్‌ తీయగా.. రెండో బంతికి దేవిక ఫోర్‌ కొట్టింది. ఆ తర్వాత మూడు బంతుల్లో నాలుగు పరుగులే రావడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాలి. ఆ బంతిని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఫోర్‌గా మలచిన దేవిక మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు మళ్లించింది.

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..:
హెదర్‌ బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్‌తో సూపర్‌ ఓవర్‌ను రిచా ఘనంగా మొదలెట్టింది. రెండో బంతికి ఆమె ఔటైంది. మూడో బంతికి హర్మన్‌.. సింగిల్‌ తీసి స్మృతికి స్ట్రైక్‌ ఇచ్చింది. దూకుడు కొనసాగిస్తూ ఆమె వరుసగా 4, 6 కొట్టేసింది. చివరి బంతికి 3 పరుగులు వచ్చాయి. ఆసీస్‌ ముందు 21 పరుగుల లక్ష్యం నిలిచింది. పేసర్‌ రేణుక తొలి బంతినే హీలీ ఫోర్‌గా మలిచింది. రెండో బంతికి సింగిల్‌ వచ్చింది. మూడో బంతికి బౌండరీ లైన్‌ దగ్గర రాధ పట్టిన చక్కటి క్యాచ్‌కు గార్డ్‌నర్‌ పెవిలియన్‌ చేరింది. ఆసీస్‌ విజయానికి 3 బంతుల్లో 16 పరుగులు కావాలి. నాలుగో బంతికి సింగిలే రావడంతో భారత విజయం ఖాయమైంది. చివరి రెండు బంతులకు హీలీ వరుసగా 4, 6 కొట్టినా ప్రమాదమేమీ లేకుండా పోయింది. ఈ ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాకిదే తొలి ఓటమి. 5 టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది.

సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా: 187/1 (బెత్‌ మూనీ 82 నాటౌట్‌; తాలియా మెక్‌గ్రాత్‌ 70 నాటౌట్‌; దీప్తి శర్మ 1/31);

భారత్‌: 187/5 (స్మృతి మంధాన 79, షెఫాలి 34, రిచా ఘోష్‌ 26 నాటౌట్‌, హెదర్‌ గ్రాహమ్‌ 3/22)

సూపర్‌ ఓవర్లో భారత్‌ చేసిన స్కోరిది. మహిళల క్రికెట్లో ఓ సూపర్‌ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్‌.. వెస్టిండీస్‌ (18)ను వెనక్కినెట్టి రికార్డు సృష్టించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.