ETV Bharat / sports

IND VS SA: కేఎల్​ రాహుల్​.. అంచనాలను అందుకుంటాడా?

author img

By

Published : Jun 8, 2022, 6:49 AM IST

kl rahul
కేఎల్​ రాహుల్​

IND VS SA KL Rahul: టీమ్​ఇండియాలో కోహ్లీ, రోహిత్​ తర్వాత గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్న కేఎల్​ రాహుల్​ ఇంకా పూర్తి స్థాయి మ్యాచ్‌ విన్నర్‌గా మారలేదన్నది విశ్లేషకుల మాట. ఇప్పటికే అతడు కెప్టెన్​గా దక్కిన అవకాశాలను కూడా ఉపయోగించుకోలేదు. ఇప్పుడతడిని దక్షిణాఫ్రికాతో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు కెప్టెన్​గా ఎంపిక చేశారు. మరి అతడు ఈ ఛాన్స్​ను ఉపయోగించి బలమైన ముద్ర వేస్తాడో లేదో చూడాలి.

IND VS SA KL Rahul: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల తర్వాత ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో ఆ స్థాయి బ్యాటర్​గా, మూడు ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించి, గొప్ప ఆటగాళ్ల జాబితాలో చేరగల సామర్థ్యం ఉన్నవాడిగా పేరుంది కేఎల్‌ రాహుల్‌కు. అయితే ప్రతిభ విషయంలో ఏ లోటూ లేకపోయినా.. ఇంకా రాహుల్‌ పూర్తి స్థాయి మ్యాచ్‌ విన్నర్‌గా మారలేదన్నది విశ్లేషకుల మాట. ఇటు ఐపీఎల్‌లో, అటు అంతర్జాతీయ క్రికెట్లో అతను కెప్టెన్‌గా లభించిన అవకాశాలను కూడా ఉపయోగించుకోలేకపోయాడు. అయితే దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌లో కుర్రాళ్లతో నిండిన భారత జట్టును నడిపించే బాధ్యతను సెలక్టర్లు అతడికే అప్పగించారు. బ్యాటర్​గా, కెప్టెన్‌గా బలమైన ముద్ర వేయడానికి రాహుల్‌కిది చక్కటి అవకాశమే.

2014లో అంతర్జాతీయ అరంగేట్రం టెస్టులతో చేసి, కెరీర్‌ ఆరంభంలోనే సెంచరీల మోత మోగించి అందరి దృష్టిలో పడ్డ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. సాంకేతికంగా సమకాలీన ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లో ఎవరికీ తీసిపోని ఆట అతడిది. తన టెక్నిక్‌, దృక్పథం గురించి దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తుంటారు. అలవోకగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యంతో చాలా వేగంగా టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన కేఎల్‌.. తర్వాత వన్డేలు, టీ20ల్లోకి కూడా అడుగు పెట్టాడు. ఆ జట్లలోనూ స్థానం సుస్థిరం చేసుకున్నాడు. కాకపోతే తన ప్రతిభకు పూర్తి స్థాయిలో న్యాయం చేయట్లేదనే విమర్శ అతడి మీద ఎప్పట్నుంచో ఉంది. సామర్థ్యానికి తగ్గట్లు ఆడి ఉంటే, నిలకడ సాధించి ఉంటే కోహ్లి, రోహిత్‌ల స్థాయిని అందుకుని ఉండేవాడంటారు విశ్లేషకులు. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడడం, ఇంకో మ్యాచ్‌లో తేలిపోవడం.. జట్టు కష్టాల్లో ఉన్న సమయాల్లో, తన మీద ఆశలు పెట్టుకున్నపుడు విఫలమవడం అతడికి ప్రతికూలంగా మారింది. ఎనిమిదేళ్ల రాహుల్‌ అంతర్జాతీయ కెరీర్లో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచి ఆడిన భారీ ఇన్నింగ్స్‌ తక్కువే కనిపిస్తాయి. వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లోనూ అతను తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే టెస్టుల్లో మినహా అతడి గణాంకాలు మెరుగ్గా ఉండడం (43 టెస్టుల్లో 35.37 సగటుతో 2547 పరుగులు, 42 వన్డేల్లో 46.68 సగటుతో 1634 పరుగులు, 56 టీ20ల్లో 40.68 సగటుతో 1831 పరుగులు)తో అతడి స్థానానికి ఢోకా లేకుండా పోతోంది. కానీ రాహుల్‌ నిలకడ అందుకోవాలని, గొప్ప ఇన్నింగ్స్‌ మరిన్ని ఆడాలని, ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకోవాలని, అలాగే భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌ కావాలని తన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ దిశగా తనేంటో రుజువు చేసుకోవడానికి దక్షిణాఫ్రికా సిరీస్‌ మంచి అవకాశంలా కనిపిస్తోంది.

పక్కలోనే పోటీ..: కోహ్లి మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి దూరమయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లోనూ రోహిత్‌ను వన్డేలు, టీ20లతో పాటు టెస్టుల్లోనూ కెప్టెన్‌గా నియమించాల్సి వచ్చింది. మెరుగైన ప్రత్యామ్నాయం మరొకటి కనిపిస్తే కచ్చితంగా అటు వైపు చూసేవారు. రాహుల్‌ ఇంకా బ్యాట్స్‌మన్‌గా కోహ్లి, రోహిత్‌ల స్థాయిని అందుకోలేదు. భారత టీ20 లీగ్‌లో అతడి కెప్టెన్సీ రికార్డేమీ బాగా లేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో అతడికి ఒక టెస్టు మ్యాచ్‌లో, అలాగే మూడు టీ20ల సిరీస్‌లో పగ్గాలప్పగిస్తే అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓడింది. దక్షిణాఫ్రికాలో పరిస్థితులు చాలా కఠినం కాబట్టి.. వెంటనే రాహుల్‌ మీద ఒక అంచనాకు వచ్చేయలేం. ఇప్పుడు అదే ప్రత్యర్థితో సొంతగడ్డపై సిరీస్‌లో రాహుల్‌కు మరో అవకాశం కల్పించారు సెలక్టర్లు. రోహిత్‌ మీద కెప్టెన్సీ భారాన్ని తగ్గించడానికి త్వరలోనే టెస్టుల వరకైనా వేరే కెప్టెన్‌ను చూడాల్సిందే. రోహిత్‌కు వయసు కూడా మీద పడుతోంది కాబట్టి టీ20 ప్రపంచకప్‌ అయ్యాక ఆ ఫార్మాట్లోనూ కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాను బాధ్యతలకు సిద్ధమని రాహుల్‌ చాటుకోవాల్సిన తరుణమిది. టీ20 లీగ్‌లో కెప్టెన్లుగా రుజువు చేసుకున్న హార్దిక్‌ పాండ్య, రిషబ్‌ పంత్‌లతో అతడికి పోటీ తప్పదు. వాళ్లిద్దరూ దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టులో సభ్యులుగా ఉన్నారు. మరోవైపు కోహ్లి, రోహిత్‌, షమి, బుమ్రా లాంటి సీనియర్లు దూరమై, ఎక్కువగా కుర్రాళ్లతో నిండిన జట్టును రాహుల్‌ ఎలా నడిపిస్తాడు.. బ్యాట్స్‌మన్‌గా ఎలా రాణిస్తాడు, నాయకత్వ లక్షణాలను ఎంత మేర ప్రదర్శిస్తాడు అన్నది ఆసక్తికరం. యువ బౌలర్లకు అతను అండగా ఉండి ఉత్తమ ప్రదర్శనను రాబట్టుకోవడం కూడా కీలకం. ఇటీవల టీ20 లీగ్‌లో అతడి జట్టు లఖ్‌నవూ బాగానే ఆడినా.. రాహుల్‌ కూడా రాణించినా.. కెప్టెన్‌ బాధ్యతతో ఆడాలన్న ఆలోచనతో అతి జాగ్రత్తకు పోవడం, స్ట్రైక్‌ రేట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా తరఫున అలాంటి విమర్శలకు తావివ్వకూడదు. వికెట్‌ కాపాడుకుంటూ ఎక్కువ సేపు క్రీజులో నిలవడమే కాక.. తన సహజ శైలిలో చెలరేగాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఏం చేస్తాడో చూడాలి.

ఇదీ చూడండి: చాహల్​ అందుకే నవ్వుతూ ఉంటాడు.. నేనతడి ఫస్ట్​ లవ్​ కాదు: ధనశ్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.