Gill Double century: ఆ విషయం గురించి రోహిత్​ అప్పుడే చెప్పాడట!

author img

By

Published : Jan 19, 2023, 1:00 PM IST

Updated : Jan 19, 2023, 1:20 PM IST

Rohith sharma praises Subhman gill

న్యూజిలాండ్​తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ముఖ్యంగా డబుల్​ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న గిల్​ను ప్రశంసించాడు. అలానే తన ద్విశత్వంపై స్పందించాడు గిల్​. వీరిద్దరు ఏం మాట్లాడారంటే..

తొలి వన్డేలో బ్రాస్‌వెల్‌ బ్యాటింగ్‌ చేసిన విధానం ఎంతో బాగుందని ప్రశంసించాడు కెప్టెన్​ రోహిత్ శర్మ. అలాగే డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్, అద్భుతంగా బౌలింగ్​ చేసిన సిరాజ్​ను పొగడ్తలతో ముంచెత్తాడు.

"శుబ్‌మన్ గిల్ డబుల్‌ సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా ఆడాడు. అతడు గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంక సిరీస్‌లో అతడికి మద్దతుగా నిలవడానికి ప్రధానం కారణం కూడా అదే. స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసే గిల్ విధానం సూపర్. సిరాజ్ తన సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకొన్నాడు. గతంలో టీ20లు, టెస్టు క్రికెట్‌లోనూ చూశాం. ఇప్పుడు వన్డేల్లో అదరగొట్టేస్తున్నాడు. అతడు తన ప్రణాళికలకు అనుగుణంగానే బంతులను సంధించి ఫలితం రాబడుతున్నాడు. ఇకపోతే బ్రాస్‌వెల్‌ బ్యాటింగ్‌ చేసిన విధానం బాగుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే, మేం బౌలింగ్‌ బాగా చేస్తే మాత్రం తప్పకుండా విజయం సాధించగలమని, బంతితో రాణించకపోతే గెలవడం కష్టమే అవుతుందని మాకు తెలుసు. దురదృష్టవశాత్తూ మ్యాచ్‌లో అలా కాసేపు జరిగింది. టాస్‌ సమయంలోనూ ఇదే విషయం చెప్పా. సవాల్‌తో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సహచరులకు సూచించా. నేను ఊహించినట్లు పరిస్థితులు లేవు. కానీ, బ్రేస్‌వెల్, సాంట్నర్ బాగా పోరాడారు. అయితే కీలకమైన సమయంలో బౌలర్లు అద్భుతంగా పుంజుకొని జట్టును విజయతీరాలకు చేర్చారు." అని రోహిత్ పేర్కొన్నాడు.

తాను ద్విశతకం బాదడంపై స్పందించాడు గిల్​. "ఎక్కువగా డాట్‌ బాల్స్‌ లేకుండా ఉండేందుకు స్ట్రైకింగ్‌ను రొటేట్ చేయడానికి ప్రయత్నించా. అందుకోసం ఖాళీల్లో బంతిని పంపించాలనే ఉద్దేశంతో ఆరంభంలో నిదానంగా ఆడాను. వికెట్లు పడుతున్నప్పుడు చివరి వరకు క్రీజ్‌లో ఉండాలని భావించా. అంతేకానీ డబుల్‌ సెంచరీ గురించి ఆలోచించలేదు. ప్రత్యర్థి బౌలర్లు పైచేయిగా ఉన్న సమయంలో.. వారిని ఒత్తిడికి గురిచేసేలా ఆడాలని అనుకొన్నా. ఎప్పుడైతే 47వ ఓవర్‌లో సిక్స్‌లు కొట్టానో.. అప్పుడే ద్విశతకం సాధించగలననే నమ్మకం కలిగింది" అని గిల్​ అన్నాడు.

గతేడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో ఇషాన్‌ ద్విశతకం బాది 24.. ఈ మార్క్​ను అందుకున్న పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. అప్పుడ అతడికి 24 ఏళ్ల 145 రోజులు. అయితే, ఇప్పుడు ఇషాన్‌ కన్నా చిన్న వయస్సులోనే గిల్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. దీనిపైనా అతడు స్పందించాడు. "నా అత్యుత్తమ సహచరుల్లో ఇషాన్‌ ఒకడు. అయితే ఇలాంటి ఫీట్‌ సాధించడం బాగుంది. డబుల్‌ సెంచరీ చేయడం ఆనందంగానే ఉన్నప్పటికీ.. ఇదో అద్భుతం అని మాత్రం అనుకోవడం లేదు. కానీ, ఇలా బ్యాట్‌ నుంచి బంతి అనుకొన్న విధంగా వెళ్తే మాత్రం ఎంతో సంతృప్తిగా ఉంటుంది" అని గిల్‌ తెలిపాడు.

ఇదీ చూడండి: ఇషాన్​ కిషన్​-శుభమన్​ గిల్​కు రోజూ గొడవేనట!

Last Updated :Jan 19, 2023, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.