ETV Bharat / sports

నేడే లంకతో టీమ్​ఇండియా అమీతుమీ.. మన కుర్రాళ్లకు సిరీస్ దక్కేనా?

author img

By

Published : Jan 7, 2023, 6:46 AM IST

భారత్‌-శ్రీలంక టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు అయ్యేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. కానీ సిరీస్‌లో ఇప్పటిదాకా మెరుగైన ప్రదర్శన చేసిన జట్టేది అంటే లంక అనే చెప్పాలి. సొంతగడ్డపై, అనుకూల పరిస్థితుల్లో ఆడుతూ కూడా రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటుతో, బంతితో బాగా తడబడింది టీమ్‌ఇండియా. హార్దిక్‌ సారథ్యంలో మంచి అంచనాల మధ్య బరిలోకి దిగిన యువ జట్టు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. శనివారం నిర్ణయాత్మక మూడో టీ20లో అయినా భారత్‌ నిలకడగా ఆడి గెలుస్తుందేమో చూడాలి.

India vs Sri Lanka 3rd T20I
IND VS SL 3rd T20 preview

మూడు టీ20ల సిరీస్‌లో తలో మ్యాచ్‌ గెలుచుకున్న భారత్‌, శ్రీలంక.. శనివారం సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో టీ20లో తలపడబోతున్నాయి. కోహ్లి, రోహిత్‌, రాహుల్‌, షమి, భువనేశ్వర్‌ లాంటి సీనియర్లు దాదాపుగా టీ20 జట్టుకు దూరమైన స్థితిలో.. కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ నాయకత్వంలో, ఎక్కువగా కుర్రాళ్లతో నిండిన జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొనగా.. తొలి రెండు టీ20ల్లో యువ భారత్‌ ఆట ఆకట్టుకోలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక దశ తర్వాత బౌలింగ్‌ పూర్తిగా అదుపు తప్పింది. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రెండుసార్లూ చేతులెత్తేశారు. వన్డేల ముంగిట ఈ మ్యాచ్‌ నెగ్గి టీ20 సిరీస్‌ను సాధించడం ఇరు జట్లకూ చాలా అవసరం కాబట్టి విజయం కోసం గట్టిగానే పోరాడతాయనడంలో సందేహం లేదు.

అర్ష్‌దీప్‌పై ఆందోళన : రెండో టీ20లో భారత బౌలర్ల ప్రదర్శన జట్టు యాజమాన్యాన్ని కంగారు పెట్టే ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్న అర్ష్‌దీప్‌.. పూర్తిగా అదుపు తప్పడం, ఏకంగా 5 నోబాల్స్‌ వేయడం ఆందోళన రేకెత్తించేదే. కెరీర్‌ ఆరంభమయ్యాక ఆరు నెలల్లోనే టీ20ల్లో అతను 14 నోబాల్స్‌ వేయడం గమనార్హం. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ.. రనప్‌, బంతి మీద నియంత్రణ లేకుంటే కష్టం. కాబట్టి అర్ష్‌దీప్‌ను వెంటనే దారిలో పెట్టాల్సిందే.

ఆఖరి ఓవర్లలో.. : రెండో టీ20లో అర్ష్‌దీప్‌ మాత్రమే కాదు.. మిగతా బౌలర్లు చివరి ఓవర్లలో పూర్తిగా తేలిపోయారు. లంక ఏకంగా 200 పైచిలుకు స్కోరు చేయడం బౌలింగ్‌ డొల్లతనాన్ని తెలియజేసేదే. ఉమ్రాన్‌ మాలిక్‌ కొన్ని మెరుపు బంతులేస్తున్నా, వికెట్లు పడగొడుతున్నా.. ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. తొలి టీ20లో మెరిసిన మావి.. రెండో మ్యాచ్‌లో తేలిపోయాడు. సీనియర్‌ స్పిన్నర్‌ చాహల్‌ ప్రదర్శన పడిపోయింది.

చివరి టీ20లో బౌలింగ్‌ గాడిన పడకుంటే సిరీస్‌ మీద ఆశలు నిలవడం కష్టమే. ఇక బ్యాటింగ్‌లో టాప్‌ఆర్డర్‌ వైఫల్యం కొనసాగుతోంది. శుభ్‌మన్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ రెండంకెల స్కోర్లు చేయలేకపోయాడు. ఒక మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన ఇషాన్‌.. మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అరంగేట్ర ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి తన ముద్ర వేయలేకపోయాడు. హార్దిక్‌ నుంచి జట్టు ఆశించిన ఆల్‌రౌండ్‌ మెరుపులు కనిపించలేదు. అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తూ బౌలింగ్‌లోనూ రాణించడం, సూర్యకుమార్‌ రెండో టీ20లో తన ధాటిని చూపించడం సానుకూలాంశాలు.

లంక రెండింట్లోనూ.. : టీమ్‌ఇండియా నిలకడలేమితో ఇబ్బందిపడుతుంటే.. లంక బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ సత్తా చాటుతోంది. తొలి టీ20లో తేలిపోయిన టాప్‌ఆర్డర్‌ రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. బౌలర్లు చాలా వరకు మెరుగైన ప్రదర్శనే చేశారు. బ్యాటింగ్‌లో శానక, కుశాల్‌ మెండిస్‌, అసలంక మంచి ఊపుమీదున్నారు. రెండో టీ20లో విఫలమైనప్పటికీ.. హసరంగ, తీక్షణను తక్కువ అంచనా వేయలేం. పేసర్లు రజిత, మదుశంక, చమిక ఆకట్టుకుంటున్నారు.

బ్యాటింగ్‌ పిచ్‌
రాజ్‌కోట్‌ పిచ్‌ ఎప్పుడూ బ్యాటింగ్‌కే అనుకూలం. శనివారం భారీ స్కోర్లు నమోదవడం ఖాయం. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గు చూపే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.