ETV Bharat / sports

జడ్డూకు దాని గురించి ముందే తెలుసు.. అయినా..: ధోనీ

author img

By

Published : May 2, 2022, 6:56 AM IST

IPL 2022 CSK vs SRH: ఐపీఎల్​ 15వ సీజన్​లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​పై చెన్నై విజయం సాధించింది. 4 వికెట్లను దక్కించుకుని విజయంలో భాగస్వామ్యమయ్యాడు ముఖేశ్​. మ్యాచ్​ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు సహా ముఖేశ్​ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

Dhoni Comments on  IPL 2022 CSK VS SRH
జడేజా ధోనీ

IPL 2022 CSK vs SRH: సీజన్‌కు ముందు కెప్టెన్సీ వదిలేసిన ఎంఎస్ ధోనీ మళ్లీ సారథ్య బాధ్యతలను స్వీకరించి చెన్నైకి విజయం అందించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై 13 పరుగుల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 189 పరుగులకే పరిమితమైంది ఎస్​ఆర్​హెచ్. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్​ (47) రాణించినా.. మిడిలార్డర్​ విఫలమైంది. నికోలస్ పూరన్ (64*) ఒంటరి పోరాటం చేశాడు. చెన్నై బౌలర్లలో ముఖేశ్ (4 వికెట్లు) అదరగొట్టాడు. విజయం అనంతరం చెన్నై కెప్టెన్‌ ధోనీ, హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, ఉత్తమ ప్రదర్శన చేసిన ముఖేశ్‌ చౌదరి మాట్లాడారు.

ఎంఎస్ ధోనీ: డిఫెండ్‌ చేయడానికి (202) అనేది చాలా మంచి స్కోరు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మాకు మంచి ఆరంభమే దక్కింది. బౌలర్లను మంచి ప్రదేశంలో బౌలింగ్‌ చేయమని మాత్రమే సూచించా. ఆరు ఓవర్ల తర్వాత స్పిన్నర్లు చాలా బాగా వేశారు. చివర్లో మా బౌలర్లకు ఒకే విషయం చెప్పా. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టినా.. మిగతా రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వకుండా ఉంటే మ్యాచ్‌ను గెలిచినట్లేనని. అలానే బ్యాటింగ్‌లో ఓపెనర్లు అదరగొట్టారు. జడేజా, నాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. గత సీజన్‌లోనే ఈసారి కెప్టెన్‌గా జడేజాకు అవకాశం ఇస్తామని అతడికి తెలుసు. మొదటి రెండు మ్యాచుల్లో సూచనలు ఇచ్చా. అయితే ఆ తర్వాత నుంచి జడ్డూకే నిర్ణయం తీసుకునే అవకాశం వదిలేశా. ఇప్పుడు కూడానూ బౌలింగ్‌, బ్యాటింగ్‌ సహా అన్నింటిని తనే చూసుకుంటాడు. సీజన్ ముగిసే సమయానికి కెప్టెన్సీని మరొకరు చేశారని భావించకూడదు. నిజంగా కెప్టెన్‌కు స్పూన్‌ ఫీడింగ్‌ అక్కరకు రాదు. మైదానంలో కీలక నిర్ణయాలను వారే తీసుకోవాలి. వాటికి వారే బాధ్యత వహించాలి.

కేన్‌ విలియమ్సన్‌: ఏ జట్టుకైనా 200కిపైగా లక్ష్యమంటే సవాల్‌తో కూడుకున్నదే. అయితే మా బ్యాటర్లు చాలా బాగా ఆడారు. అయితే చెన్నై బౌలర్లు మాపై ఒత్తిడి పెంచారు. పోరాడినప్పటికీ దురదృష్టవశాత్తూ మాకు కలిసి రాలేదు. పిచ్‌ కాస్త నెమ్మదిగా స్పందించింది. వాషింగ్టన్‌ సుందర్‌ వంటి బౌలర్‌ సేవలను మిస్‌ చేసుకున్నాం. మా వరకైతే తీవ్రంగా ప్రయత్నించాం. ఇందులోనూ చాలా పాజిటివ్‌ అంశాలు ఉన్నాయి. వచ్చే మ్యాచుల్లో నాణ్యమైన స్పిన్నర్లతో బరిలోకి దిగుతాం. తొలి అర్ధ భాగంలో వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచాం. ఇప్పుడ మళ్లీ రెండు మ్యాచ్‌లను ఓడాం. మళ్లీ విజయాల బాట పడతామనే నమ్మకం ఉంది.

ముకేశ్‌ చౌదరి (4/46): పవర్‌ ప్లే ముగిస్తుందనగా వరుసగా రెండు వికెట్లను తీయడం చాలా ఆనందంగా ఉంది. అప్పటికే నేనొక క్యాచ్‌ను మిస్‌ చేశాను. అందుకే వికెట్ తీయాలని భావించా. అదృష్టవశాత్తూ వికెట్‌ దక్కింది. బ్రావో లేని లోటును తీర్చడానికి మరింత బాధ్యతగా బౌలింగ్‌ చేశా. పవర్‌ప్లే ఓవర్లు, మిడిల్‌ ఓవర్లలో బ్రావో చాలా చక్కగా బౌలింగ్‌ చేస్తాడు. ఎంతో అనుభవజ్ఞుడు. మరింత బాధ్యతగా వ్యవహరించాలని మ్యాచ్‌కు ముందు కూడా బ్రావో చెప్పాడు. జట్టులో వాతావరణం చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. చివరి ఓవర్‌ సందర్భంగా ప్రత్యేకంగా ధోనీ ఏమీ చెప్పలేదు. వికెట్‌ టు వికెట్‌కు బౌలింగ్‌ చేయాలని మాత్రమే సూచన చేశాడు.

ఇదీ చూడండి: IPL 2022: పూరన్​ పోరాడినా చెన్నైదే గెలుపు.. మెరిసిన ముఖేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.