ETV Bharat / sports

2024 ప్రపంచకప్​లోకి యంగ్​ స్టార్స్​- రేసులోకి వచ్చేదెవరో?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 7:46 AM IST

2024 World Cup Team India Squad : వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టు కూర్పుపై ఎన్నో సందేహాలు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇక భారత్‌ ఆడేది ఆరు టీ20లే. ఇవి కాకుండా ఐపీఎల్‌. జట్టులో చోటు కోసం గట్టి పోటీ ఉంది. మరి రేసులో దూసుకెళ్లేదెవరు? టీ20 మెగా టోర్నీ ఆడాలనే లక్ష్యంతో ఉన్న కుర్రాళ్లకు దక్షిణాఫ్రికాతో సిరీస్‌ రూపంలో సవాలు ఎదురవనుంది. ఆదివారమే సిరీస్‌ ఆరంభం. మరి మెరిసేదెవరు? సెలక్టర్లను మెప్పించేదెవరు?

2024 World Cup Team India Squad
2024 World Cup Team India Squad

2024 World Cup Team India Squad : వన్డే ప్రపంచకప్​ పండుగ ముగిసింది. హోరా హోరీగా జరిగిన ఈ టోర్నీలో ఎంతో అద్భుతమైన ఫామ్​ను చూపించినప్పటికీ టీమ్‌ఇండియాకు నిరాశ తప్పలేదు.దీంతో వచ్చే ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో తమ సత్తా చాటాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ టోర్నీలో విజయం కోసం ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో ముగిసిన అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పొట్టి కప్పు దిశగా జట్టు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.

అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన రింకు సింగ్‌, యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రవి బిష్ణోయ్‌ లాంటి యువ ఆటగాళ్లు ప్రపంచకప్‌లో ఆడతారా? లేదా అన్న విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వన్డేల్లో జట్టు కూర్పు కుదిరింది. ఇందులో ప్రతీ ఆటగాడికి ఒక్కో పాత్ర ఉంది. అయితే టీ20ల్లో మాత్రం తుది జట్టు తరచూ మారుతోంది. దీంతో అత్యుత్తమ కూర్పు కోసం జట్టు మేనేజ్‌మెంట్‌ తీవ్ర ప్రయోగాలు చేస్తోంది. కానీ ఐపీఎల్‌ కాకుండా ప్రపంచకప్‌కు ముందు అలాగే ఇప్పుడు దక్షిణాఫ్రికాతో, వచ్చే ఏడాది అఫ్గానిస్థాన్‌తో మూడేసి టీ20లు మాత్రమే టీమ్​ఇండియా ఆడనుంది.

ఇక ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో జట్టు సారథ్య బాధ్యతలు అందుకోవాలని బీసీసీఐ కోరిన నేపథ్యంలో ఈ టోర్నీ పగ్గాలను కూడా రోహిత్​కు ఇవ్వడం దాదాపుగా ఖాయం. ఇక బుమ్రా, శ్రేయస్‌, హార్దిక్‌, సూర్యకుమార్‌, జడేజా కూడా ఈ టోర్నీలో ఆడతారు. దీంతో మిగిలిన స్థానాల కోసం పోటీ ఉంది. ముందుగా ఫినిషర్‌గా రింకుకు జట్టులో కచ్చితంగా ప్లేస్​ ఉందనే చెప్పాలి. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో అదరగొట్టిన అతను.. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇదే ఫామ్​తో నిలకడ కొనసాగిస్తే అతని స్థానానికి ఎటువంటి ఢోకా ఉండదు.

ఇక రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు శుభ్‌మన్‌, రుతురాజ్‌, యశస్వి పోటీపడుతున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​లో కంగారూ జట్టుపై రుతురాజ్‌ సెంచరీ చేయగా.. యశస్వి కూడా ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో అలరించాడు. అయితే మరో ఓపెనర్‌గా ఆడే అవకాశాలు శుభ్‌మన్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో రిజర్వ్‌ ఓపెనర్‌గా యశస్వి ఉండే ఛాన్స్​లు కనిపిస్తున్నాయి. అది కాకుండా వచ్చే సిరీస్‌ల్లో, ఐపీఎల్‌లో శుభ్‌మన్‌ కంటే గొప్పగా యశస్వి రాణిస్తే ఆ అంచనాలు తప్పొచ్చు.

మరోవైపు మూడో స్థానం కోసం ఇషాన్‌ కిషన్‌ను జట్టు మేనేజ్‌మెంట్‌ సిద్ధం చేస్తోంది. దీంతో వికెట్‌ కీపర్‌గా ఎవరాడతారన్నది అన్నది మరో కఠిన సవాలుగా మారింది. అయితే అప్పటికల్లా కోలుకుని, మ్యాచ్‌లాడి తన సత్తాచాటితే రిషబ్​ పంత్‌ రేసులోకి రావొచ్చు. లేకుంటే కేఎల్‌ రాహుల్‌, జితేశ్‌ శర్మ మధ్య పోటీ తప్పదు. ప్రస్తుతం మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తూ వికెట్‌ కీపింగ్‌ చేసే ఆటగాడి కోసం జట్టు చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఐపీఎల్‌లో లఖ్‌నవూ తరఫున కేఎల్​ రాహుల్‌ ఓపెనర్‌గా ఆడాడు. మరి టీ20 ప్రపంచకప్​లో అతడు మిడిలార్డర్‌కు వెళ్తాడా? చూడాలి. అయితే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు అతణ్ని ఎంపిక చేయలేదు. దీంతో జట్టు ప్రణాళికల్లో అతను లేడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల్లో జితేశ్‌ శర్మను పరీక్షించి చూడగా అతడు ఫర్వాలేదనిపించాడు. దీంతో సఫారీ గడ్డపైనా అతణ్ని వికెట్‌కీపర్‌గా మైదానంలోకి దించే అవకాశాలున్నాయి. శ్రేయస్‌ కూడా నిలకడగా రాణిస్తుండటం వల్ల హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మకు జట్టులో చోటు లేకుండా పోతోంది. అయితే జట్టులో చోటివ్వక తప్పని పరిస్థితి కల్పించాలంటే అవకాశం వస్తే తిలక్‌ అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది. ఇక రెండో స్పిన్నర్‌ స్థానం కోసం కుల్‌దీప్‌ యాదవ్‌తో రవి బిష్ణోయ్‌ తలపడుతున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో నిలకడగా వికెట్లు తీసిన బిష్ణోయ్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గానూ నిలిచాడు. కానీ కుల్‌దీప్‌ మళ్లీ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్‌ బిష్ణోయ్‌కు కఠిన సవాలే. మరోవైపు అర్ష్‌దీప్‌, ముకేశ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.