ETV Bharat / sitara

Movie Review: 'వివాహ భోజనంబు' సినిమా రివ్యూ

author img

By

Published : Aug 27, 2021, 7:56 AM IST

లాక్​డౌన్ నేపథ్య కథతో తీసిన 'వివాహ భోజనంబు' సినిమా.. ఓటీటీలో విడుదలైంది. అయితే చిత్రం ఎలా ఉంది? ఏయే అంశాలు ప్రేక్షకుల్ని నవ్వించాయి? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

vivaha bhojanambu movie telugu review
'వివాహ భోజనంబు' సినిమా రివ్యూ

చిత్రం: వివాహ భోజనంబు; నటీనటులు: సత్య, సందీప్‌ కిషన్‌, ఆర్జవి, సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు; సంగీతం: అన్వీ; నిర్మాత: కె.ఎస్‌.శినిష్‌, సందీప్‌ కిషన్‌; దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు; విడుదల: సోనీ లివ్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది హాస్యనటులు మరో ఇండస్ట్రీలో లేరనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఇప్పటికీ హాస్యనటులకు కొదవలేదు. ఇక హాస్య ప్రధానమైన చిత్రాలకు బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ రేటు ఎక్కువే. చక్కని హాస్యంతో, పంచ్‌లతో సినిమా సాగుతుంటే కాలక్షేపం కోసం రెండు, మూడు సార్లు చూసేవాళ్లూ ఉన్నారు. అలాంటి కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచే నటుల్లో సత్య ఒకరు. ఆయన కీలక పాత్రలో రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వివాహ భోజనంబు'. కరోనా కారణంగా సోనీ లివ్‌ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? లాక్‌డౌన్‌ కష్టాలతో సాగే ఈ కథలో సత్య అండ్‌ కో ఎలా మెప్పించారు?

vivaha bhojanambu movie
'వివాహ భోజనంబు' సినిమా

కథేంటంటే:

మహేశ్‌ (సత్య) ఎల్‌ఐసీ ఏజెంట్‌. మహా పిసినారి. ప్రతి రూపాయినీ ఒకటికి రెండు సార్లు లెక్కపెట్టుకుంటాడు. డబ్బులు పొదుపు చేయడానికి ఏమైనా చేస్తాడు. అనుకోకుండా అనిత(ఆర్జవి)అనే అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇదే విషయాన్ని అనిత తన కుటుంబ సభ్యులకు చెబుతుంది. అయితే, మహేశ్‌ వాలకం చూసిన అనిత కుటుంబం అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకొంటుంది. సరిగ్గా మహేశ్‌ పెళ్లైన రోజు నుంచే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తారు. దీంతో పెళ్లికి వచ్చిన అనిత కుటుంబ సభ్యులందరూ మహేశ్‌ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన మహేశ్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బంధువులను పోషించడానికి అతడు పడిన తిప్పలు ఏంటి? చివరకు వాళ్లను ఊరికి పంపాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

vivaha bhojanambu movie
'వివాహ భోజనంబు' సినిమా

ఎలా ఉందంటే:

లాక్‌డౌన్‌ కారణంగా ఎంతోమంది ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుపోయి సొంతూళ్లకు వెళ్లలేక అవస్థలు పడిన వారు కొందరైతే.. చుట్టం చూపుగానో, శుభకార్యానికో వచ్చి బంధువుల ఇంట్లో ఇరుక్కుపోయిన వారు ఇంకొందరు. ఇలా బంధువుల ఇంట్లో అదీ ఒక పిసినారి ఇంట్లో పది, పదిహేను మంది ఉంటే, వారి పోషించడానికి అతడు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఇలా గతేడాది కొన్ని కుటుంబాల్లో ఎదురైన ఇలాంటి వాస్తవ పరిస్థితులను కథగా రాసుకున్నాడు భాను భోగవరపు. దానికి తనదైన టైమింగ్‌తో నవ్వులు పంచేలా 'వివాహ భోజనంబు'ను తెరకెక్కించడంలో రామ్‌ అబ్బరాజు విజయం సాధించారు. అనవసర సన్నివేశాలకు జోలికి పోకుండా మహేశ్‌-అనితల ప్రేమ వ్యవహారాన్ని, పెళ్లిని అమ్మాయి ఇంట్లో చెప్పడం ద్వారా నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ తర్వాత మహేశ్‌ నిశ్చితార్థం, పెళ్లి ఇలా ఒక్కో సన్నివేశాన్ని నవ్వించేలా తీర్చిదిద్దారు.

లాక్‌డౌన్‌ కారణంగా అందరూ మహేశ్‌ ఇంట్లో ఉండిపోవడం, అక్కడ మహేశ్‌ పడే ఇబ్బందుల ద్వారా ప్రేక్షకుడికి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కరోనా కాలంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతీ విషయం ద్వారా నవ్వు పుట్టించారు. ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, పసుపు నీళ్లతో స్నానాలు చేయడం ఇలా దేన్నీ వదల్లేదు. అన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. 'పోరాడాల్సింది రోగితో కాదు.. వ్యాధితో' అంటూ వచ్చే స్లోగన్‌ను కూడా కామెడీ కోసం వాడిన విధానం నవ్వులు పంచుతుంది. ఇలా ప్రథమార్ధమంతా నవ్వులతో సాగిపోతుంది. ఇక అనిత కుటుంబాన్ని ఇంటికి తరలిస్తాడా? అన్న విషయాన్ని ద్వితీయార్ధంలో చూపించే ప్రయత్నం చేశారు. అయితే అందుకు అంబులెన్స్‌ డ్రైవర్‌ (సందీప్‌ కిషన్‌)తో ఒప్పందం చేసుకోవడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా సందీప్‌ కిషన్‌ను తాగుబోతుగా, 'భ్రమ'లో బతికే వాడిగా చూపించిన విధానం ద్వారా హాస్యం పుట్టించాలనుకున్నాడు దర్శకుడు. అది నవ్వులు పంచకపోగా ఆయా సన్నివేశాలన్నీ అతికించినట్లు అనిపిస్తాయి. ఆ స్థానంలో సప్తగిరి, తాగుబోతు రమేశ్‌లాంటి నటులను ఎంచుకుంటే సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌ అయ్యేది. పతాక సన్నివేశాలు భావోద్వేగంగా సాగినా అవన్నీ రొటీన్‌గా చాలా సినిమాల్లో చూసినవే. ఓవరాల్‌గా ఓ మంచి కామెడీ మూవీ చూసిన ఫీల్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది.

vivaha bhojanambu movie
'వివాహ భోజనంబు' సినిమా

ఎవరెలా చేశారంటే:

పిసినారి మహేశ్‌ పాత్రలో సత్య నటన చాలా బాగుంది. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టి పిండి. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచారు. అతని స్నేహితుడిగా నటించిన సుదర్శన్‌, మామగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌లు సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా శ్రీకాంత్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. శివన్నారాయణ, హర్ష, సుబ్బరాయశర్మ ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు నటించారు. ప్రధాన ఆకర్షణ అనుకున్న సందీప్‌ కిషన్‌ పాత్ర సోసోగా ఉంది. సాంకేతికంగా సినిమా బాగుంది. అన్వీ సంగీతం, మణికందన్‌ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఓకే. చిన్న బడ్జెట్‌ మూవీ. ఒకట్రెండు ప్రదేశాల్లోనే సినిమా మొత్తం సాగుతుంది. కరోనా కారణంగా గతేడాది ప్రజలు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితులకు హాస్యం జోడించి, భాను భోగవరపు రాసుకున్న కథ చాలా బాగుంది. అయితే, ఇంకొన్ని మెరుపులు జోడించి ఉంటే బాగుండేది. భాను కథను రామ్‌ అబ్బరాజు చక్కగా తీశారు. ప్రతి సన్నివేశాన్ని నవ్వులు పంచేలా తీర్చిదిద్దారు.

బలాలు

+ సత్య, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సుదర్శన్‌ల నటన

+ కథ, హాస్య సన్నివేశాలు

+ ప్రథమార్ధం

బలహీనతలు

- సందీప్‌ కిషన్‌ ఎపిసోడ్‌

చివరిగా: 'వివాహ భోజనంబు' రుచిగా ఉంది. ఒకట్రెండు కూరలు కాస్త చప్పగా ఉన్నాయంతే!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.