ETV Bharat / science-and-technology

వాట్సాప్​, ఇన్​స్టా, ఫేస్​బుక్​ సేవలు పునరుద్ధరణ

author img

By

Published : Oct 4, 2021, 9:37 PM IST

Updated : Oct 5, 2021, 6:35 AM IST

.
.

21:31 October 04

7 గంటల తర్వాత సేవలు పునరుద్ధరణ

సోమవారం రాత్రి 9 గంటల తర్వాత.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల.. కొన్ని గంటల పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దాదాపు 7 గంటల తర్వాత వాట్సప్‌ సేవలు పునరుద్ధరించారు. 

కాసేపు వాట్సప్‌ చూడకపోతే ఏదో కోల్పోయినట్లు అనేక మంది అల్లాడిపోతారు. ఫేస్‌బుక్‌లోని పోస్టులు, లైక్‌ల గురించి తెలుసుకునేందుకు నిరంతరం తపనపడుతుంటారు. ఫొటోల్ని పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రాం వైపు చూస్తారు. అంతగా అలవాటైపోయిన ఈ సామాజిక మాధ్యమాలు స్తంభించిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఈ సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కొన్ని కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక.. గంటల తరబడి నానా హైరానా పడ్డారు. తమ ఒక్కరికే ఈ పరిస్థితి వచ్చిందా, అందరికీ ఉందా అని తెలుసుకోవడానికి ట్విటర్లో సందేశాలు పెట్టారు. ఇంకొందరు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాల వైపు దృష్టిసారించారు. దాంతో వాటికి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ఈ హఠాత్‌ పరిణామంపై ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ప్రకటించింది. అంతరాయంపై క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది.

సర్వర్‌లో సమస్యే కారణమా!

సర్వర్లలో సమస్య కారణంగానే ఫేస్‌బుక్‌ తదితరాల సేవలు ఆగిపోయాయని భావిస్తున్నారు. భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులున్నారు.  వాట్సప్‌ను రమారమి 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైమాటే. వీటి సేవలు స్తంభించిపోవడంతో ట్విటర్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ వంటి ఇతర మాధ్యమాలకు తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయంపై ట్విటర్లో పలువురు విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజా పరిణామాన్ని ట్విటర్‌, గూగుల్‌ కూడా తప్పుపట్టాయి. ఈ ఏడాది మార్చి, జులై నెలల్లోనూ చాలాచోట్ల ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయం కలిగింది. వెబ్‌సైట్లు, యాప్‌లకు అప్పుడప్పుడుసమస్యలు రావడంసహజమే అయినా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి సేవలు స్తంభించిపోవడం అరుదు. 

అయితే దీనికి సైబర్‌ దాడి కారణం కాకపోవచ్చని సైబర్‌ భద్రత నిపుణులు భావిస్తున్నారు. నాస్‌డాక్‌లో ఫేస్‌బుక్‌ షేరు విలువ 5.5% మేర పతనమయింది. దాదాపు ఏడాది కాలంలో ఇంత మార్పు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. ఫేస్‌బుక్‌లో ఉంటున్న సమాచారం విద్వేషాగ్నికి ఆజ్యం పోస్తోందని, పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తోందని డేటా శాస్త్రవేత్త, ప్రజా వేగు ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న ఒకరోజు వ్యవధిలోనే ఫేస్‌బుక్‌కు ఇబ్బందులు రావడం ప్రస్తావనార్హం. తాజా పరిణామంపై ఈమె ఇంటర్వ్యూ ప్రభావం ఏ మేరకు ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఫేస్‌బుక్‌తో పాటు గూగుల్‌, పింట్రెస్ట్‌ వంటి కంపెనీల్లో ఆమె పనిచేశారు. తాను చూసిన కంపెనీల్లో అథమమైనది ఫేస్‌బుక్‌ అని వ్యాఖ్యానించారు. 

ప్రజల భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ముఖ్యమని విమర్శించారు. ద్వేషాన్ని రెచ్చగొట్టే తప్పుడు సమాచారాన్ని ఎంతగా వ్యాప్తి చెందిస్తున్నదీ కంపెనీ సొంత పరిశోధన కూడా చెబుతోందంటూ తన పేరు వెల్లడించకుండా ఇదివరకు ఫిర్యాదులు చేసిన వ్యక్తి ఆమేనని చెబుతారు. తప్పుడు సమాచార వ్యాప్తిని నిలువరించడానికి ఉన్న రక్షణ కవచాలను ఫేస్‌బుక్‌ తొలగించడం వల్లనే అమెరికా క్యాపిటల్‌ భవంతిపై ఈ ఏడాది జనవరి 6న పెద్దదాడి జరిగిందని ఫ్రాన్సెస్‌ ఆరోపిస్తున్నారు. ఫేస్‌బుక్‌ అంతర్గత విషయాలపై వేల పేజీల సమాచారాన్ని ఆమె సేకరించి ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు అందించారు. మంగళవారం సెనేట్‌ ఉప సంఘం ఎదుట ఆమె హాజరుకానున్నారు.

ట్విట్టర్​లో ట్రెండింగ్​..

భారత్​ సహా పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తింది. 3 అప్లికేషన్లకు ఫేస్‌బుక్ మాతృసంస్థ కావడం, అన్నీ ఒకేసారి ఆగిపోవడం వల్ల యూజర్లు గందరగోళానికి గురయ్యారు. తమ ఇబ్బందుల్ని.. ట్విట్టర్​లో పోస్ట్​లు చేస్తూ #ఇన్​స్టాగ్రామ్​డౌన్​, #ఫేస్​బుక్​డౌన్​ హ్యాష్​ట్యాగ్​లను ట్రెండింగ్​ చేశారు.

Last Updated :Oct 5, 2021, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.