వర్షాకాలంలో సాయంత్రపు స్నాక్స్.. ట్రై చేయండిలా

author img

By

Published : Jun 30, 2021, 12:56 PM IST

FOOD STORY
వేడి వేడి స్నాక్స్ ()

బయట చల్లచల్లగా చిటపట చినుకులు పడుతుంటే.. వేడివేడిగా ఏవైనా స్నాక్స్ లాగిస్తూ.. ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని ఎవరికి మాత్రం అనిపించదు చెప్పండి. అయితే చిరుజల్లులను ఎంజాయ్ చేసే సమయంలో తీసుకోదగిన ఆరోగ్యకరమైన స్నాక్స్ గురించి తెలుసుకుందాం రండి..

నాలుగు చినుకులు పడటం ఆలస్యం.. కప్పు టీ లేదా కాఫీతోపాటూ కాస్త కారంగా, వేడివేడిగా ఏవైనా స్నాక్స్‌ తినాలనిపించడం మామూలే. అలా చేసుకోవాలనుకునే పదార్థాల్లో వీటినీ చేర్చుకోండి.

అటుకుల కబాబ్‌

atukula kabab
అటుకుల కబాబ్‌

కావలసినవి: అటుకులు: కప్పు, బంగాళాదుంపలు: నాలుగు, ఉల్లిపాయముక్కలు: ముప్పావుకప్పు, క్యారెట్‌ తురుము: పావుకప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు: మూడు చెంచాలు, జీలకర్రపొడి: చెంచా, గరంమసాలా: చెంచా, చాట్‌మసాలా: చెంచా, ఉప్పు: తగినంత, సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా, ఇనుపచువ్వలు: కొన్ని.

తయారీవిధానం: అటుకుల్ని శుభ్రంగా కడిగి నీళ్లు గట్టిగా పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వీటిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి ముద్దలా చేసుకుని.. ఇనుపచువ్వలకు ఈ మిశ్రమాన్ని కబాబ్‌ ఆకృతిలో అద్దాలి. నాన్‌స్టిక్‌ పాన్‌ని స్టౌపైన పెట్టి ఈ కబాబ్‌లను ఉంచి... నూనె వేస్తూ అన్నివైపులా ఎర్రగా కాల్చుకుంటే అటుకుల కబాబ్‌ సిద్ధం.

ఆలూ మురుకు

aalu muruku
ఆలూ మురుకు

కావలసినవి: ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, వెల్లుల్లి ముద్ద: చెంచా, కారం: అరచెంచా, ఉప్పు: తగినంత, మొక్కజొన్నపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, గుడ్డు: ఒకటి, చీజ్‌ తురుము: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీవిధానం: ఉడికించిన బంగాళాదుంపను తురిమి ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి అన్నింటినీ కలిపి పావుగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత నూనె రాసిన మురుకుల గొట్టంలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని కాగుతోన్న నూనెలో జంతికల్లా వత్తి.. ఎర్రగా వేగాక తీసుకోవాలి. వీటిని వేడివేడిగా సాస్‌తో కలిపి తినొచ్చు.

ఎగ్‌ 65

egg  65
ఎగ్ 65

కావలసినవి: ఉడికించిన గుడ్లు: ఆరు, గుడ్డు: ఒకటి, మొక్కజొన్నపిండి: పావుకప్పు, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: పావుచెంచా, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, వెల్లుల్లి తరుగు: చెంచా, అల్లం తరుగు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి తరుగు: చెంచా, పెరుగు: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, బ్రెడ్‌పొడి: పావుకప్పు, చిల్లీసాస్‌: ఒకటిన్నర చెంచా.

తయారీవిధానం: ఉడికించిన గుడ్లను తురిమి దానిపైన మొక్కజొన్నపిండి, సగం కారం, గరంమసాలా, తగినంత ఉప్పు, అల్లంవెల్లులి ముద్ద, గుడ్డుసొన, బ్రెడ్‌పొడి వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. స్టౌమీద మరో బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేసి అల్లం, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి, పెరుగు, చిల్లీసాస్‌ కొద్దిగా ఉప్పు, మిగిలిన కారం, ముందుగా వేయించుకున్న ఉండల్ని కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.

పనీర్‌ సమోసా

paneer samosa
పనీర్‌ సమోసా

కావలసినవి: మైదా: రెండు కప్పులు, సోంపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, సన్నని పనీర్‌ ముక్కలు: కప్పు, గరంమసాలా: పావుచెంచా, అల్లంవెల్లుల్లిముద్ద: చెంచా, క్యాప్సికమ్‌ తరుగు: పావుకప్పు, ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, దనియాలపొడి: అరచెంచా, కొత్తిమీర: కట్ట, కారం: చెంచా, పచ్చిమిర్చి తరుగు: అరచెంచా, నిమ్మరసం: పావుచెంచా, జీడిపప్పు పలుకులు: రెండు చెంచాలు.

తయారీవిధానం: మైదా, సోంపు, కొద్దిగా ఉప్పు ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ చపాతీపిండిలా కలిపి పైన చెంచా నూనె వేసి మరోసారి కలిపి మూత పెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. అవి వేగాక గరంమసాలా, క్యాప్సికమ్‌ తరుగు, దనియాలపొడి, కొత్తిమీర తరుగు, కారం, తగినంత ఉప్పు పనీర్‌ముక్కలు, జీడిపప్పు పలుకులు, నిమ్మరసం వేసి ఓసారి కలిపి దింపేయాలి. నానిన మైదాపిండిని మరోసారి కలిపి చిన్న ముద్దను తీసుకుని చపాతీలా వత్తాలి. దీన్ని మధ్యకు కోసి త్రికోణాకారంలో చుట్టుకుని అందులో చెంచా పనీర్‌ మిశ్రమం వేసి అంచుల్ని తడిచేత్తో మూసేయాలి. ఇలా అన్నింటినీ చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.