ETV Bharat / opinion

విలువలకు పాతర.. ప్రలోభాల జాతర!.. ఇదా ప్రజాస్వామ్యం?

author img

By

Published : Jul 10, 2023, 3:05 PM IST

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా దేశంలో పని చేస్తున్న రాజకీయ పార్టీల ధాటికి ఎన్నికల ప్రక్రియ ఎప్పుడో అపవిత్రం అయ్యింది. దేశంలో ఎన్నిక​లు ప్రలోభాల జాతరగా మారిపోయాయి. ఎన్నికల ​ప్రక్రియలో నిబంధనలకు విరుద్దంగా అనేక విషయాలను దాచి పోటీల్లో గెలుస్తూ.. ప్రజాస్వామ్యం అర్థం మారుస్తున్నారు.

indian democracy
ఇదా ప్రజాస్వామ్యం

అధికారమే పరమావధిగా అనైతిక అమానుష రాజకీయాలకు తెగబడుతున్న పార్టీల ధాటికి దేశీయంగా ఎన్నికల ప్రక్రియ ఏనాడో తన పవిత్రతను కోల్పోయింది. అయిదేళ్లకోసారి అంగరంగవైభోగంగా సాగే ప్రలోభాల జాతరగా అది పరువుమాస్తోంది. ఆస్తులకు సంబంధించిన వాస్తవాలను దాచేసి, ఓటర్లకు బహుమతుల ఎరవేసి గెలిచారంటూ తమిళనాడులోని తేని నియోజకవర్గ ఎంపీ రవీంద్రనాథ్‌పై ఒక వ్యాజ్యం దాఖలైంది. దాన్ని విచారించిన మద్రాస్‌ హైకోర్టు- రవీంద్ర ఎన్నిక చెల్లదంటూ తాజాగా తీర్పిచ్చింది. ఇదే పద్ధతిలో పరిశీలిస్తే- దేశవ్యాప్తంగా ఎందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు సచ్ఛీలురుగా నిగ్గుతేలతారు?

2018 రాష్ట్ర ఎన్నికల్లో జనానికి నకిలీ బీమా బాండ్లు పంచినట్లు తేలడంతో జేడీ(ఎస్‌) ఎమ్మెల్యే గౌరీశంకర్‌ స్వామిని కర్ణాటక హైకోర్టు మొన్న మార్చిలో శాసనసభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ వక్రమార్గాల్లో గెలుపొందినవారిని వెంటనే బర్తరఫ్‌ చేయాలన్నది నిర్వివాదాంశం. పదవీ కాలమంతా నిక్షేపంగా పూర్తిచేసుకున్నాక తీరిగ్గా ఆ అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? తప్పుడు వివరాలతో ప్రమాణపత్రాలను సమర్పించిన అభ్యర్థులకు రెండేళ్ల జైలుశిక్ష విధించి, ఆరేళ్ల పాటు మరే ఎన్నికల్లో పోటీపడకుండా వారిని నిరోధించాలని కేంద్ర ప్రధాన ఎలెక్షన్‌ కమిషనర్‌గా నసీమ్‌ జైదీ ఏడేళ్ల క్రితమే గళమెత్తారు.

ఓటర్లకు లంచాలిచ్చిన, వారిని అనుచితంగా ప్రభావితం చేసిన కేసుల్లో అభియోగాల నమోదు దశలోనే ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడాలన్నది నిర్వాచన్‌ సదన్‌ ప్రతిపాదన. అందుకు అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలంటూ 2017లోనే అది కేంద్రానికి లేఖ రాసింది. ఆ మేరకు వ్యవస్థ ప్రక్షాళన ఎప్పటికి సాధ్యపడుతుందన్నదే ప్రధాన ప్రశ్న!

'లోక్‌నాయక్‌' జయప్రకాశ్‌ నారాయణ్‌ అభివర్ణించినట్లు- ప్రజల సుఖసంతోషాలను ఇనుమడింపజేసేవే నిజమైన రాజకీయాలు. కలలో కూడా అటువంటి ఆలోచనకు తావివ్వని పార్టీలు- అబద్ధాలు, అక్రమాలు, అరాచకాల్లో ఆరితేరినవారినే ఎక్కువగా నాయకులుగా నిలబెడుతున్నాయి. జనాన్ని బులిపించో బెదిరించో ఓట్లు వేయించుకోగలిగిన వారికే అధికంగా అభ్యర్థిత్వాలను కట్టబెడుతున్నాయి. ప్రజాసేవాతత్పరులైన సామాన్యులు ఎవరూ చట్టసభల్లో కాలుపెట్టలేనంతగా ఎన్నికలు ఇప్పుడు ధనమయమయ్యాయి. 1999 సార్వత్రిక సమరంకోసం అన్ని పార్టీలు కలిసి పది వేల కోట్ల రూపాయల వరకు వెచ్చించినట్లు అంచనా.

2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ వ్యయం అరవై వేల కోట్ల రూపాయల వరకు ఎగబాకినట్లు సీఎంఎస్‌ సంస్థ అధ్యయనం వెల్లడించింది. అసెంబ్లీ ఎలెక్షన్లనూ కలిపితే- పార్టీలూ అభ్యర్థుల చేతుల మీదుగా పోటెత్తుతున్న మొత్తం డబ్బెంతో ఊహించడమూ కష్టమే. ఒక్క ఉపఎన్నిక కోసమే వంద నుంచి అయిదు వందల కోట్ల రూపాయల వరకు వెదజల్లిన రాజకీయపక్షాల విశృంఖలత్వం బహిరంగ రహస్యమే. ఓటుకు అయిదు వేల రూపాయల నుంచి అంతకన్నా ఎక్కువ సొమ్మునే పంచుతున్న నేతల బాగోతాలైతే రాష్ట్రాలకు అతీతంగా తరచూ వెలుగుచూస్తున్నాయి. మందు, విందులతో కిరాయి కార్యకర్తలను పోగేసి రాజకీయపక్షాలు వేస్తున్న ప్రచార వీరంగాలు- జనజీవనాన్ని తీవ్ర అవస్థల పాల్జేస్తున్నాయి.

ఎటువంటి సమాచారమైనా సరే, క్షణాల్లో లక్షల మందికి చేరిపోతున్న డిజిటల్‌ యుగంలో భారీ వ్యయప్రయాసలతో బహిరంగ సమావేశాలు నిర్వహించడంలో ఔచిత్యమేమిటి? ఆయా పార్టీల సిద్ధాంతాలు, ప్రజాసమస్యల పరిష్కార ప్రణాళికలే ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావనకు రావాలి. సమకాలీన రాజకీయ రణక్షేత్రంలో అవన్నీ పక్కకు వెళ్ళిపోతున్నాయి. హేయమైన వ్యక్తిగత విమర్శలు, కులమతాలపై విద్వేష వ్యాఖ్యలు, జనవర్గాల వారీగా తాయిలాల ప్రకటనలు పొంగిపొర్లుతున్నాయి. కట్టలుతెంచుకుంటున్న నల్లధనం పరవళ్లతో స్వేచ్ఛాయుత సక్రమ ఎన్నికల భావనకు దేశీయంగా అతివేగంగా నూకలు చెల్లిపోతున్నాయి. సమగ్ర ఎన్నికల సంస్కరణలకు మోకాలడ్డుతున్న దుర్రాజకీయాలే భారత ప్రజాస్వామ్యం ఊపిరితీస్తున్నాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.