ETV Bharat / opinion

గుజరాత్ అసెంబ్లీ బరిలో మజ్లిస్.. భారీగా ఓట్ల చీలిక.. లాభం ఎవరికి?

author img

By

Published : Nov 26, 2022, 1:38 PM IST

gujarat election 2022
గుజరాత్ ఎన్నికలు 2022

Gujarat Election 2022 : గుజరాత్​లో మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఈ సారి ఆప్, మజ్లిస్ రంగంలోకి దిగాయి. ముస్లిం ఓట్లు చీల్చే పార్టీగా పేరున్న ఏఐఎంఐఎం పోటీలో ఉండడం వల్ల భాజపాకు మేలు చేకూరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Gujarat Election 2022 : గుజరాత్ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉండగా.. ఈసారి ఇతర పార్టీలు సైతం రంగంలోకి దిగాయి. దీంతో ఏ పార్టీ ఓట్లు ఎవరు చీలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆమ్ ఆద్మీ, ఆల్ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీలు తొలిసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాయి. ముస్లిం జనాభా అధికంగా ఉన్న సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టింది మజ్లిస్ పార్టీ. మొత్తం 14 సీట్లలో పోటీ చేస్తోంది. ఇందులో 12 నియోజకవర్గాల్లో ముస్లింలకే సీట్లు కేటాయించింది. అయితే, ఈ పరిణామం అధికార భాజపాకే లాభం చేకూర్చేలా కనిపిస్తోంది.

భాజపాకు రాష్ట్రంలో బలమైన ఓటుబ్యాంకు ఉంది. వీరంతా భాజపాకే నమ్మకంగా ఉంటున్నారు. కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు భాజపాయేతర ఓటర్లనే ప్రధానంగా తమవైపు తిప్పుకునే పనిలో ఉన్నాయి. గుజరాత్​లోని ముస్లింలను భాజపా వ్యతిరేక ఓటర్లుగా పరిగణిస్తుంటారు. రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ వైపే ఇన్నాళ్లూ వీరంతా మొగ్గుచూపారు. ఇప్పుడు కాంగ్రెస్​కు పోటీగా ఆమ్ ఆద్మీ రంగంలోకి దిగింది. మరోవైపు, ముస్లిం వర్గాల ప్రతినిధిగా చెప్పుకొనే మజ్లిస్ సైతం బరిలో నిలిచింది. దీంతో ముస్లింల ఓట్లు మూడు పార్టీల మధ్య చీలే అవకాశం కనిపిస్తోంది. ఇది పరోక్షంగా భాజపాకు లాభం చేకూర్చేదే.

మజ్లిస్ ఓట్ల చీలిక..
ఇటీవల బిహార్​లోని గోపాల్​గంజ్​ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఏఐఎంఐఎం పోటీలో ఉండడం వల్ల భాజపా లబ్ధి పొందింది. ఆర్జేడీ అభ్యర్థిపై 1,794 ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి విజయం సాధించారు. ఆ ఎన్నికలో మజ్లిస్ తరఫున పోటీ చేసిన అబ్దుల్​ సలాం​ 12,214 ఓట్లు సాధించారు. ఈయన చీల్చిన ఓట్లే.. ఆర్జేడీ ఓటమికి కారణయయ్యాయి. అచ్చం అలాంటి పరిస్థితే గుజరాత్​.. అహ్మదాబాద్​ జిల్లాలోని జమల్​పుర్ ఖడియా నియోజకవర్గంలో ఎదురుకానుంది. ఈ నియోజకవర్గంలో ఛిపా (ముస్లింలో ఓ వర్గం) ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరంతా.. మూకుమ్మడిగా అదే వర్గానికి చెందిన అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఇమ్రాన్​ ఖేదీవాలా.. మజ్లిస్​ తరపున సాబిర్ కబ్లివాలా బరిలో దిగుతున్నారు. వీరిద్దరూ ఛిపా వర్గానికి చెందినవారే. సాబిర్​.. ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు. ఇమ్రాన్​.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లు ఇరు ముస్లిం అభ్యర్థుల మధ్య చీలిపోయి.. భాజపా లాభవడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, అహ్మదాబాద్​లోని బాపునగర్​ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి షహనవాజ్ పఠాన్​ నామినేషన్​ను ఉపసంహరించుకున్నారు. ఈ నియోజకవర్గంలో 16 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి హిమ్మత్ సింగ్ గెలుపు కోసమే ఇలా చేశారా? లేదా ఎంఐఎం వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అని తెలియాల్సి ఉంది. మజ్లిస్ అభ్యర్థి రేసులో తప్పుకున్నప్పటికీ ఈ నియోజకవర్గంలో పోటీలో ఉన్న 29 మంది అభ్యర్థులో 10 మంది ముస్లిం అభ్యర్థులే ఉన్నారు. అలాగే 27 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న లింబయత్ నియోజకవర్గంలోనూ 44 మంది అభ్యర్థులు పోటీ ఉండగా.. వారిలో 36 మంది ముస్లింలు అభ్యర్థులే ఉండడం గమనార్హం. ఈ ముస్లిం అభ్యర్థులు తమ వర్గం ఓట్లను చీల్చితే.. చివరకు లాభపడేది భాజపానే!

ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి..
ఎస్సీ రిజర్వుడ్​ సీటైన డానిలిమ్డాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే శైలేశ్ పర్మార్​పై అదే వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపారు ఒవైసీ. దీంతో ముస్లింలతో పాటు దళిత ఓటర్లపై ఆయన దృష్టిసారించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానిలిమ్డా నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లతో పాటు ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజరవర్గంలో మొత్తం ఓటర్లు 2,39,999 కాగా.. వీరిలో 65,760 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా ఎవరు కైవసం చేసుకున్నా.. వారికి విజయం సాధించే అవకాశాలు ఉండేవి. అయితే, ఈసారి మజ్లిస్, కాంగ్రెస్ మధ్య ఈ ఓట్లు చీలే పరిస్థితి కనిపిస్తోంది.

గుజరాత్‌లో దాదాపు 11 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. దాదాపు 25 అసెంబ్లీ స్థానాల్లో వీరు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో గెలుపు- ఓటములపై ముస్లిం ఓటర్లు ప్రభావం ఉంటుంది. ఎంఐఎం పార్టీ.. ముస్లింలు, దళితులు అధికంగా ఉన్న నియోజకవర్గాలపైనే ఈ సారి శాసనసభ ఎన్నికల్లో దృష్టి సారించింది. వడ్గాం అసెంబ్లీ సీటులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ సామాజిక కార్యకర్త జిగ్నేశ్ మేవాణిపై మరో ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టింది. ఒకప్పుడు భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ సీటులో విజయకేతనం ఎగురవేసేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎస్సీ రిజర్వుడ్ సీటైన వద్గాం నియోజకవర్గంలో 25 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 2017 ఎన్నికల్లో మేవాణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనపై కాంగ్రెస్, ఆప్ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపలేదు.

2017 శాసనసభ ఎన్నికల్లో సౌరాష్ట్రలోని 48 స్థానాల్లో భాజపా కేవలం 18 స్థానాలనే గెలుచుకుంది. మిగతా సీట్లలో కాంగ్రెస్ పాగా వేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​కు సౌరాష్ట్ర కంచుకోటగా మారింది. అయితే గడిచిన ఐదేళ్లలో పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. సౌరాష్ట్రకు చెందిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి భాజపాలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో భాజపా 49 శాతం ఓట్లు సాధించగా.. 41 శాతం ఓట్లతో కాంగ్రెస్ 77 సీట్లను కైవసం చేసుకుంది. అయితే 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఆప్, ఏఐఎంఐఎం చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ.. సౌరాష్ట్రలో దూకుడుగా ప్రచారం చేస్తూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రచారంలో బాగా వెనకబడిపోయింది. గుజరాత్​లో డిసెంబరు 1, 5న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబరు 8న వెలువడనున్నాయి.

-బిలాల్ భట్(ఈటీవీ భారత్ నెట్​వర్క్ ఎడిటర్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.