ETV Bharat / opinion

నవతరానికి నాణ్యమైన విద్య అందేనా?

author img

By

Published : Aug 7, 2021, 8:01 AM IST

ఏడు దశాబ్దాలు గడిచినా దేశంలోని పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో కునారిల్లుతున్నాయి. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యావ్యవస్థతోనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని విద్యావేత్తలు ఎంత మొత్తుకున్నా ఈ రంగంపై ఇప్పటికీ అరకొర నిధులే ఖర్చుచేయడం ఆందోళనకరం.

Quality Education
విద్యా ప్రమాణాలు

ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యావ్యవస్థతోనే దేశం సమున్నతంగా ఎదుగుతుందన్నది ప్రథమ ప్రధాని నెహ్రూ అభిప్రాయం. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర ప్రస్థానంలో ఆ ప్రమాణాలను ఇండియా ఏ మేరకు సాధించగలిగిందన్నది ముంజేతి కంకణం! కనీస మౌలిక వసతులకు సైతం నోచుకోని సర్కారీ బడుల్లో బాలల విద్యాహక్కు కొల్లబోతోంది. సమగ్ర శిక్షా అభియాన్‌తో ఈ దుస్థితి తొలగి, నవతరానికి నాణ్యమైన విద్య అందుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. సర్వశిక్షా అభియాన్‌, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌, ఉపాధ్యాయ విద్యలను సమ్మిళితం చేసి మూడేళ్ల క్రితం కేంద్రం ఈ 'సమగ్ర' పథకాన్ని తీర్చిదిద్దింది. పాఠశాల విద్యలో గుణాత్మక మార్పుల సాధనే లక్ష్యంగా దీన్ని మరో అయిదేళ్ల పాటు కొనసాగించాలని మోదీ మంత్రిమండలి తాజాగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 11.6 లక్షల పాఠశాలలు, 15.6 కోట్లకు పైగా విద్యార్థులు, 57 లక్షల ఉపాధ్యాయులకు ఈ పథకం అక్కరకొస్తుందన్నది అంచనా! ప్రతిపాదిత వ్యయం రూ.2.94 లక్షల కోట్లలో రూ.1.85 లక్షల కోట్లను కేంద్రం తనవంతుగా రాష్ట్రాలకు అందించనుందంటున్నారు.

ఇప్పటికీ అరకొర నిధులే..

విద్యారంగాన్ని పైమెట్టున నిలబెట్టాలంటే జీడీపీలో ఆరు శాతం నిధులను ప్రత్యేకించాలని 1968 జాతీయ విద్యావిధానం సూచించింది. అదింకా ఆచరణ రూపంలోకి రానేలేదు! తత్ఫలితంగా అరకొర వసతులతో ప్రభుత్వ విద్యాలయాలు కునారిల్లుతున్నాయి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం నిరుడు వెల్లడించిన అధ్యయన ఫలితాలు వాటి దుస్థితిని కళ్లకు కట్టాయి. 12 రాష్ట్రాల్లోని 22శాతం బడులు పాత, శిథిల భవనాల్లో కొనసాగుతున్నాయి. 31శాతం పాఠశాల భవంతులు పగుళ్లు తేలాయి. విద్యాప్రమాణాల పరంగానూ పరిస్థితి ఆందోళనకరమేనని 'అసర్‌' నివేదికలు ఏటా తేటతెల్లం చేస్తూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు మొదలు విద్యార్థుల నైపుణ్యాల వరకు అన్నింట్లోనూ అభివృద్ధిపై గురిపెట్టిన సమగ్ర శిక్షా అభియాన్‌ సంపూర్ణంగా విజయవంతమైతేనే సర్కారీ విద్య శోభిల్లుతుంది!

ఉపాధ్యాయులకు శిక్షణ..

దేశీయంగా చదువుల నాణ్యత ఇనుమడించాలంటే ఉపాధ్యాయుల శక్తిసామర్థ్యాలు ద్విగుణీకృతం కావాలని 2018 బడ్జెట్‌ ప్రసంగంలో నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆకాంక్షించారు. ఆ మేరకు బోధన సిబ్బందికి సానపడతామని ప్రకటించారు. వాస్తవంలో 2014-20 మధ్య ఉపాధ్యాయుల శిక్షణపై కేంద్ర వ్యయం 87శాతం మేరకు కోసుకుపోయిందని సెంటర్‌ ఫర్‌ బడ్జెట్‌ అండ్‌ పాలసీ స్టడీస్‌(బెంగళూరు) పరిశోధకులు నిగ్గుతేల్చారు. దేశవ్యాప్తంగా ప్రతి ఆరుగురు ప్రాథమిక ఉపాధ్యాయుల్లో ఒకరు వృత్తిగత శిక్షణ పొందనివారేనని గతంలోనే వెలుగుచూసింది. కొవిడ్‌ కాలంలో అత్యవసరమైన ఆన్‌లైన్‌ తరగతుల బోధనలోనూ పాతికశాతం గురువులకు ఎటువంటి శిక్షణా లేదని ఇటీవలే వెల్లడైంది.

కొత్త పుంతలు తొక్కించాలి..

సింగపూర్‌, ఫిన్‌లాండ్‌, స్విట్జర్లాండ్‌, నార్వే, దక్షిణకొరియా వంటి దేశాలు పటుతర వ్యూహాలతో విద్యారంగాన్ని ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. మార్కులే పరమావధిగా సాగుతున్న చదువులతో భారతదేశంలో మాత్రం చిన్నారుల సృజనశక్తులు నీరుగారిపోతున్నాయి. నవ్య సంస్కరణలతో పాఠ్యపుస్తకాలను పదునుతేల్చిన చైనా- ఆధునిక సమాజ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా తన విద్యార్థులకు తర్ఫీదునిస్తోంది. 2022-23 విద్యాసంవత్సరం నాటికి అమలులోకి వచ్చేలా కొత్త పాఠ్యప్రణాళికపై కేంద్రం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. 21వ శతాబ్ది పోటీ వాతావరణంలో మన పిల్లలు నెగ్గుకురావాలంటే- బడిలోనే గట్టి పునాది పడాలి. బట్టీయం పద్ధతికి చెల్లుచీటీ రాసేలా నూతన పాఠ్యప్రణాళికల్ని తీర్చిదిద్దాలి. బోధన సిబ్బందికి నిరంతర శిక్షణ అందిస్తూ- నైతిక, క్రీడావిద్యకు ప్రాధాన్యమిస్తూ భావిభారతాన్ని నవపథం వైపు నడిపించాలి. ఈ సత్సంకల్ప దీక్షలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధే- చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి మేలు బాటలు పరుస్తుంది!

ఇదీ చూడండి: మౌలిక వసతుల్లో తడ'బడి'.. సంక్షోభంలో విద్యావ్యవస్థ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.