శ్రుతి లేని ఐక్యతారాగం.. విపక్షాల కూటమి సాధ్యమేనా?

author img

By

Published : Sep 14, 2022, 1:13 PM IST

rahul gandhi nitish kumar

విపక్షాలు ఉమ్మడిగా తలపడితే- వరసగా మూడోసారి అధికారంలోకి రాకుండా భాజపాను నిరోధించవచ్చు. భిన్న నేతల ఆకాంక్షలు, అహాల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం సులభసాధ్యమైతే కాదు.

లోక్‌సభ సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉంది. కానీ- అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుండటంతో జాతీయ రాజకీయాలు క్రమేణా వేడెక్కుతున్నాయి. 'కలిసి ఉంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం' అనే వాస్తవాన్ని గుర్తించిన విపక్షాలు హడావుడిగా కూటమి యత్నాలను మొదలుపెట్టాయి. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి కూటమి ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ఇటీవల దేశ రాజధానిలో పర్యటించారు. మిత్రపక్షమైన కమలదళాన్ని విడిచిపెట్టి రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ)తో జతకట్టడం ద్వారా విరుద్ధ సమూహాలను ఒకే వేదికపైకి తీసుకురాగలనని ఆయన ఇప్పటికే నిరూపించారు. అధికారికంగా మూడో కూటమి ఏర్పాటు కాకపోయినా- వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పార్టీల మధ్య అవగాహన ఏర్పడటం భాజపాకు నష్టదాయకమే. విపక్షాలు ఉమ్మడిగా తలపడితే- వరసగా మూడోసారి అధికారంలోకి రాకుండా భాజపాను నిరోధించవచ్చు. భిన్న నేతల ఆకాంక్షలు, అహాల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం సులభసాధ్యమైతే కాదు.

స్వప్రయోజనాలే ప్రధానం
మహారాష్ట్ర, బిహార్‌లోని ప్రస్తుత రాజకీయ సమీకరణాలు అలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో 2019 విజయాన్ని పునరావృతం చేయడం భాజపాకు కష్టమే. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి పోటీచేసి మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో 41 సీట్లను గెలుచుకున్నాయి. ఇందులో 18 స్థానాలను చేజిక్కించుకొన్న శివసేన ప్రస్తుతం ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో జతకట్టింది. అందులోని తిరుగుబాటు వర్గం భాజపాతో దోస్తీ చేయడం- ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు కారణమైంది. బిహార్‌లో 40 ఎంపీ సీట్లలో 17 స్థానాలను గెలుచుకున్న భాజపాను నాటి మిత్రపక్షం జేడీయూ విడిచిపెట్టేసింది. ఝార్ఖండ్‌లోనూ భాజపా వ్యతిరేక కూటమి అధికారంలో ఉంది. పశ్చిమ్‌ బెంగాల్‌లోనూ విపక్ష ఓట్ల సముదాయం కాషాయదళానికి తలనొప్పిగా మారే ప్రమాదముంది. ఈ పరిణామాలన్నీ కమలం పార్టీకి ప్రమాద సూచికలే.

ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న నీతీశ్‌కుమార్‌ ఇటీవల దిల్లీలో శరద్‌ పవార్‌, రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, సీతారాం ఏచూరి, ఓం ప్రకాష్‌ చౌతాలా తదితరులను కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా భాజపాకు వ్యతిరేకంగా బలంగా గళమెత్తుతున్నారు. కమలదళాన్ని గద్దె దించడానికి పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌, యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌తో చేతులు కలిపారు. తన పార్టీ నేతలపై వివిధ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నందుకు భాజపాపై విరుచుకుపడిన దీదీ- రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. భారత రాజకీయాల నుంచి సైద్ధాంతిక భావజాలాలు ఏనాడో అదృశ్యమైపోయాయి. ఇప్పుడు నేతలకు స్వప్రయోజనాలే ముఖ్యం. భాజపాను ఓడించడానికి విపక్ష నేతలు తమ వ్యక్తిగత ఆశయాలు, ప్రయోజనాలను ఎంతవరకు పక్కన పెడతారన్నది ప్రశ్నార్థకమే!

ప్రతిపక్షాల కూటమి సాధించాలనుకున్న ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ తన జనాకర్షక శక్తితో అధిగమించే అవకాశముంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలున్నా- సాధారణ ఓటర్లలో అత్యధికులు ఇప్పటికీ దేశాన్ని పాలించే సత్తా ఉన్న నాయకుడు నరేంద్రమోదీయే అని విశ్వసిస్తున్నారు. ప్రజాదరణలో ఆయనకు దరిదాపుల్లో ఏ విపక్ష నేతా లేరన్నది పలు సర్వేల్లో వెల్లడైంది. సాధారణంగా హిందీ రాష్ట్రాల్లో 70-80 స్థానాలకే పరిమితమయ్యే భాజపా, మోదీ ప్రజాకర్షక శక్తితోనే ఆ రాష్ట్రాల్లో సగానికి పైగా స్థానాలు గెలుచుకొంది. పరీక్షకు నిలిచిన నేత నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడం కమలానికి ఓ సానుకూల అంశం. ఈ విషయంలో ప్రతిపక్షాలది ఎప్పుడూ వెనకబాటే. 2004 లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయీ నాయకత్వంలోని భాజపా ఓడిపోయినప్పుడు ప్రతిపక్షాలకు ప్రధాని అభ్యర్థి లేరు. ఎన్నికల తరవాత ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) హడావుడిగా మన్మోహన్‌ సింగ్‌ను నాయకుడిగా ఎన్నుకొంది.

విస్తరించిన కమలదళం
2004తో పోలిస్తే- ప్రస్తుత రాజకీయ చిత్రం భిన్నంగా ఉంది. దేశంలో అత్యధిక ప్రాంతాలకు భాజపా విస్తరించింది. ఇప్పటి వరకూ కాషాయదళానికి దూరంగా ఉండిపోయిన వర్గాలు, కులాల మద్దతును పొందుతోంది. సమయానుకూల కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. వివిధ వర్గాలతో సదస్సులు నిర్వహిస్తూ, కొత్తగా పరిశీలకులను నియమించడం ద్వారా రానున్న ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతోంది. మరోవైపు... ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఇటీవల భారత్‌ జోడో యాత్రను ప్రారంభించింది. రాహుల్‌గాంధీని నాయకుడిగా నిలిపే ప్రయత్నం అది. దాంతో వివిధ రాష్ట్రాల్లో యాత్ర కొనసాగుతున్నప్పుడు ఆయన ప్రసంగాలపైనే అందరి దృష్టీ ఉంటుందన్నది వాస్తవం. గాంధీల వారసుడిగా రాహుల్‌ నిరూపించుకోగలరా అన్నదే ప్రధాన ప్రశ్న!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.