ETV Bharat / opinion

మహమ్మారికి జోడీ... మధుమేహం!

author img

By

Published : Oct 19, 2021, 5:57 AM IST

diabetic
diabetic

ప్రపంచంలోని ప్రతి ఆరుగురు మధుమేహ రోగుల్లో ఒకరు భారత్‌లోనే ఉన్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. మన దేశంలో సుమారు 7.7కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. కొవిడ్‌ వల్ల ఆరోగ్యవంతుల్లోనూ మధుమేహం తలెత్తవచ్చని బ్రిటన్‌లోని కింగ్స్‌ కళాశాల శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. దీనితో దేశంలోనూ కరోనా తర్వాత ఈ సంఖ్య పెరుగడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మధుమేహం రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో కొవిడ్‌కు ముందే భారత్‌లో మధుమేహం కేసులు పెరుగుతూ వచ్చాయి. ప్రపంచంలోని ప్రతి ఆరుగురు మధుమేహ రోగుల్లో ఒకరు భారత్‌లోనే ఉన్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. మన దేశంలో సుమారు 7.7కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. చైనాలో ఆ సంఖ్య 11.6 కోట్లు. ఇటీవలి కాలంలో రక్తపోటు, మధుమేహం వంటి అసాంక్రామిక జబ్బులు పెరిగిపోతున్నాయి. వీటి బాధితుల సంఖ్య దేశ సగటు కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే అధికంగా ఉన్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి. కరోనా సోకి కోలుకున్న చాలామందిలో మధుమేహం లక్షణాలు బయటపడుతుండటం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది.

diabetic
కరోనా తర్వాత తలెత్తే ఆరోగ్య సమస్యలు

అధికారిక గణాంకాల ప్రకారం, మన దేశంలో ఇప్పటిదాకా సుమారు 3.4కోట్ల మంది కరోనా బారినపడ్డారు. ఈ వ్యాధి సోకినవారికి చికిత్సలో భాగంగా వైద్యులు స్టెరాయిడ్లను ఇస్తుంటారు. అవి ఊపిరితిత్తుల్లో చేరిన వైరస్‌తో పోరాడతాయి. అదే సమయంలో రక్తంలో చక్కెర(గ్లూకోజ్‌) స్థాయులను పెంచేస్తాయి. వీటిని శరీర కణజాలం త్వరగా గ్రహించుకోలేక పోవడంతో దాదాపు ఆరు నెలల పాటు రక్తంలో గ్లూకోజ్‌ అధికంగా ఉంటున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. కొత్తగా మధుమేహం బారినపడి తమ ఆస్పత్రికి వస్తున్న ప్రతి పదిమందిలో ఏడుగురు కొవిడ్‌ చికిత్స పొందినవారేనని దిల్లీకి చెందిన అనూప్‌ మిశ్ర అనే వైద్య నిపుణులు వెల్లడించారు. కరోనాతో ఆస్పత్రిలో చేరినవారిలో అయిదు శాతం కొత్తగా మధుమేహం బారిన పడుతున్నారని ఆయన అంటున్నారు. ఈ లక్షణాలు శరీరంలో ఎంతకాలం ఉంటాయన్నదానిపై అధ్యయనాలు సాగుతున్నాయి. కొవిడ్‌ వల్ల ఆరోగ్యవంతుల్లోనూ మధుమేహం తలెత్తవచ్చని బ్రిటన్‌లోని కింగ్స్‌ కళాశాల శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఒకవైపు అప్పటికే మధుమేహం ఉన్న వారిలో కరోనా తీవ్రత పెరిగి మరణాల ముప్పు అధికమైందని, మరోవైపు కొవిడ్‌ వల్ల కొత్తగా మధుమేహం తలెత్తడం లేదా దానికి సంబంధించిన ముందస్తు లక్షణాలను గమనిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించే ఏసీఈ-2 ప్రొటీన్లు ఊపిరితిత్తులతోపాటు జీర్ణక్రియలతో ముడివడిన క్లోమం, కాలేయం, చిన్నపేగు, మూత్రపిండాల్లో ఉన్నాయని పలు అధ్యయనాలు తేల్చాయి. ఈ కణజాలాల్లోకి, ముఖ్యంగా క్లోమం(పాంక్రియాస్‌)లోకి కరోనా వైరస్‌ ప్రవేశించి, అందులోని బీటా కణాలపై దాడి చేస్తోంది. ఫలితంగా ఇన్సులిన్‌ తక్కువగా విడుదలై టైప్‌-1 మధుమేహానికి దారితీస్తోంది.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో చాలామంది బరువు పెరిగారని, ఫలితంగా టైప్‌-2 మధుమేహం ముప్పు ఎక్కువైందని బ్రిటన్‌కు చెందిన 'ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ' పత్రిక పేర్కొంది. అందరూ ఇంటికే పరిమితం కావడం, అధికంగా పిండి పదార్థాలు, నూనెలు ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో సగటున రెండు నుంచి 3.6 కిలోల బరువు పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా ఒక కిలో బరువు పెరిగితే శరీరంలోని కణజాలం రక్తంలోని గ్లూకోజ్‌ను శోషించుకోలేక మధుమేహం ముప్పు ఎనిమిది శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొవిడ్‌ కారణంగా మధుమేహం వస్తుందా, రాదా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ నుంచి కోలుకున్న వారిపై ఇటీవల కొందరు వైద్యులు చేపట్టిన అధ్యయనంలో కరోనాకు, మధుమేహానికి సంబంధం ఉన్నట్లు తేలింది. ప్రతి 127 మంది కొవిడ్‌ వైరస్‌ బాధితుల్లో 13 మందికి కొత్తగా మధుమేహం సోకినట్లు ఆ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది.

మధుమేహం బారినపడినవారి సగటు వయసు 40 ఏళ్లలోపే. ఆ పదమూడు మందిలో ఏడుగురికి చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు వాడలేదని, అయినా వారి రక్తంలో చక్కెర స్థాయులు పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. దిల్లీ, చెన్నైలోని రెండు ఆస్పత్రుల్లో 555 మంది రోగులపై జరిపిన పరిశీలనలోనూ కొవిడ్‌ సోకిన తరవాత కొందరు మధుమేహం బారిన పడినట్లు గుర్తించారు. వీటన్నింటిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో మధుమేహ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అర్థమవుతోంది. ఈ తరుణంలో రోజూ వ్యాయాయం చేయడం, బలవర్ధక ఆహారం తీసుకోవడం, మంచి జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను కొవిడ్‌ తరవాతి పరిణామాలు చాటుతున్నాయి.

- రంజిత్‌ కుమార్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.