సంక్షోభాలతో.. సంపన్న దేశాలకూ ఆహార కొరత!

author img

By

Published : Sep 23, 2021, 8:00 AM IST

food crisis in developed countries

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్లు, సామాజిక-ఆర్థిక సంక్షోభాలకు వాతావరణ మార్పులు తోడై వివిధ దేశాలు ఆహార కొరతను(Food Shortage) ఎదుర్కొంటున్నాయి. భారత్‌, చైనాలతోపాటు పలు ఐరోపా దేశాలు ఆహారం విషయంలో స్వయం సమృద్ధంగా ఉన్నా.. మన పొరుగునే ఉన్న శ్రీలంక మాత్రం ఆర్థిక ఆత్యయిక స్థితిని ప్రకటించాల్సి వచ్చింది. సంపన్న అమెరికా, బ్రిటన్‌లు సైతం కొవిడ్‌ వల్ల ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి.

కొవిడ్‌ లాక్‌డౌన్లకు వాతావరణ మార్పులు, సామాజిక-ఆర్థిక సంక్షోభాలు తోడై పలు దేశాలు ఆహార కొరతను(Food Shortage) ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు ఆకలి కేకలకు దారితీస్తుంటే, తనకు తానుగా ఏకాకిగా ఉన్న ఉత్తర కొరియా(Food Shortage In North Korea) తీవ్ర ఆహార సంక్షోభంలోకి జారిపోతోంది. భారత్‌, చైనాలతోపాటు పలు ఐరోపా దేశాలు ఆహారం విషయంలో(Food Shortage) స్వయం సమృద్ధంగా ఉన్నా, మన పొరుగునే ఉన్న శ్రీలంక మాత్రం ఆర్థిక ఆత్యయిక స్థితిని ప్రకటించాల్సి వచ్చింది. ఆ దేశ జీడీపీకి పది శాతానికిపైగా సమకూర్చే పర్యాటక రంగం కొవిడ్‌ వల్ల కుదేలు కావడంతో విదేశ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోయాయి. ఆహారం, మందులు, ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడే శ్రీలంక(Food Crisis In Sri Lanka) ఈ మూడు నిత్యావసరాల దిగుమతులకు డబ్బు చెల్లించలేని దుస్థితిలోకి జారిపోయింది.

మానవ వనరులకు కటకట

కొవిడ్‌కు ముందే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న శ్రీలంక(Food Crisis In Sri Lanka) కొత్త అప్పుల కోసం ఐఎంఎఫ్‌ వద్దకు పరుగులుతీయక తప్పలేదు. ఫలితంగా ఆ దేశ కరెన్సీ విలువ పడిపోయి ఆహార దిగుమతులకు ఇదివరకటికన్నా ఎక్కువ విదేశీ ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. దాంతో ఇతర దేశాల నుంచి అధిక ధరలకు ఆహారం దిగుమతి చేసుకునే స్థోమత లంకకు లేకుండా పోయింది. పేద, మధ్యతరగతివారు నల్ల బజారులో అధిక ధరలకు ఆహారం కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించి వర్తకులు, దిగుమతిదారుల వద్ద ఉన్న ఆహార నిల్వలను స్వాధీనం చేసుకొంటోంది. వాటిని ప్రజలకు సరసమైన ధరలకు విక్రయించే బాధ్యతనూ సైన్యానికి అప్పగించింది. ఈ క్రమంలో చిన్న దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిజానికి ఆహార కొరత శ్రీలంక ప్రభుత్వ స్వయంకృతమే. రైతులంతా రసాయన ఎరువులను విడనాడి ఆర్గానిక్‌ సేద్యానికి మారాలని హుకుం జారీ చేసిన ప్రభుత్వం, ఆర్గానిక్‌ ఎరువులను సరిపడా సరఫరా చేయలేకపోయింది. దీంతో పంట దిగుబడులు సగానికి సగం పడిపోయి, ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారు.

కొవిడ్‌ వల్ల ఆహార కొరత..

మరోవైపు దేశంలో కొవిడ్‌ కేసులు విజృంభిస్తున్నా- రోగుల చికిత్సకు మందులు, వైద్య సామగ్రి లేక ఆస్పత్రులు చతికిలపడుతున్నాయి. కావాల్సినవి దిగుమతి చేసుకునే అవకాశమూ లేదు. సంపన్న అమెరికా, బ్రిటన్‌లు సైతం కొవిడ్‌ వల్ల ఆహార కొరతను(Food Shortage) ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో ఆహారం, పాడి ఉత్పత్తి పడిపోవడం వల్ల కొరత ఏర్పడిందా అంటే.. కానే కాదు. బ్రెగ్జిట్‌ వల్ల బ్రిటన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాల వల్ల అమెరికా- పొరుగు దేశాల నుంచి వ్యవసాయ కూలీలను రప్పించుకోలేకపోతున్నాయి. పొలాల్లో పండ్లు, కూరగాయలు, ధాన్యం కోతలకు కూలీలు లేరు. పొలం నుంచి సూపర్‌ మార్కెట్‌కు ఆహారోత్పత్తులను రవాణా చేయడానికి డ్రైవర్లూ లేరు. ఫలితంగా పలు సూపర్‌ మార్కెట్ల అరలు సరకులు లేక ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. కోడిమాంసం, కూరగాయలు, చీజ్‌ సరఫరాలు పడిపోవడంతో రెస్టారెంట్లు తమ వంటకాల జాబితాను కుదించుకోవలసి వస్తోంది. మెక్‌ డొనాల్డ్స్‌ వంటి గొలుసుకట్టు రెస్టారెంట్లకూ ఈ దుస్థితి తప్పడం లేదు. యాప్‌ల ద్వారా ఆర్డరు పెట్టే ఖాతాదారులకు కోరిన వంటకాలు దొరకడం లేదు. ఒక్కోసారి ఉన్నా... వాటిని ఇంటికి తెచ్చి ఇచ్చే సిబ్బందీ లేరు. మరోవైపు కొవిడ్‌వల్ల ఆన్‌లైన్‌లో ఆహారం కోసం ఆర్డరు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.

ఆ దేశాన్ని విడిచి స్వస్థలాలకు..

బ్రెగ్జిట్‌ వల్ల బ్రిటన్‌ మిగిలిన ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల నుంచి ఆర్థికంగా విడిపోవడం కార్మికుల కొరతకు ప్రధాన కారణం. బ్రెగ్జిట్‌కు ముందు బ్రిటన్‌లో పనిచేస్తూ ఉన్న ఈయూ కార్మికులు ఇప్పుడు ఆ దేశాన్ని విడిచి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. బ్రిటిష్‌ కోళ్ల పరిశ్రమలో ప్రతి ఆరు ఉద్యోగాల్లో ఒకటి ఖాళీగా ఉంటోంది. కోడిమాంసం, పాలు, ఇతర ఆహార సరకులను పట్టణాల్లోని మార్కెట్లకు చేరవేసే భారీ ట్రక్కులకు డ్రైవర్ల కొరత ఏర్పడింది. దీంతో బ్రిటిష్‌ పాడి పరిశ్రమ పాలను నేలపాలు చేయకతప్పడం లేదు. పశువుల నుంచి పాలు పితకడాన్ని తప్పనిసరిగా తగ్గించుకోవాల్సి వస్తోంది. నేడు బ్రిటిష్‌ భారీ ట్రక్కుల రంగంలో లక్ష డ్రైవర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2020 జూన్‌ నాటికి 14వేల మంది ఈయూ డ్రైవర్లు బ్రిటన్‌ను విడిచివెళ్ళగా, 2021 రెండో త్రైమాసికానికి వారిలో కేవలం 600 మంది మాత్రమే తిరిగివచ్చారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఆంక్షలు సడలి, గిరాకీ మరింత పెరిగితే దాన్ని తీర్చడమెలాగన్న ప్రశ్న బ్రిటిష్‌ అధికారులను వేధిస్తోంది.

ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య

పారిశ్రామిక రంగంలో కార్మికులు, వ్యవసాయ రంగంలో కూలీల కొరత బ్రిటన్‌కే పరిమితం కాదు. అనేక ఇతర దేశాలూ కూలీల కోసం కటకటలాడుతున్నాయి. వియత్నామ్‌లో వరి కోతలకు సైన్యాన్ని నియోగించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బ్రెజిల్‌లో కాఫీ తోటలకు కూలీలు లేక పంట కోతను నెల రోజులపాటు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. మలేసియాలో పామాయిల్‌ తోటలూ కూలీలు లేక సతమతమవుతున్నాయి. అమెరికాలో మాంసం ప్యాకేజింగ్‌ పరిశ్రమ శ్రామికులను ఆకర్షించడానికి ఖరీదైన ఆపిల్‌ వాచీలను, ఐప్యాడ్‌లను తాయిలాలుగా ఇవ్వజూపుతోంది. కబేళా పనివారు, గిడ్డంగి కార్మికులు, పండ్లు తెంపే కూలీలు, ట్రక్కు డ్రైవర్లు, రెస్టారెంట్‌ సర్వర్లు, వంటవాళ్లు- ఇలా ఒక్కరని ఏమిటి... పొలం నుంచి భోజనం బల్ల వరకు ఆహారాన్ని అందించే ప్రతి ఒక్కరికీ తీవ్రమైన కొరత ఏర్పడింది. దీన్ని తట్టుకోవడానికి కార్మికులకు వేతనాలు పెంచకతప్పడం లేదు. అది ఆహార ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) సూచీ ప్రకారం గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టుకల్లా ఆహార ధరలు 33శాతం మేర పెరిగాయి. అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌ వంటి దేశాల్లో రేపు కొవిడ్‌ అదుపులోకి వచ్చినా, ఆహార ధరలు మాత్రం కట్టు తప్పడం ఖాయమంటున్నారు. దాని ప్రభావం అంతర్జాతీయ ఆహార విపణి మీద పడి మొక్కజొన్న, కాఫీ, గోధుమ తదితరాల ధరలు పెరిగే సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి.

పెరుగుతున్న యంత్రాల వినియోగం

సంపన్న దేశాల్లో వ్యవసాయం, పాడి, మాంసం ప్రాసెసింగ్‌, రెస్టారెంట్‌ ఉద్యోగాలకన్నా మెరుగైనవి అందుబాటులో ఉండటంతో చాలామంది కార్మికులు పాత ఉద్యోగాల్లోకి తిరిగి రావడానికి ఇష్టపడటం లేదు. అమెరికాలో భూతాపం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాంతో కార్మికులు ఎర్రటి ఎండలో పొలాల్లో పనిచేయడానికి సుముఖంగా లేరు. అమెరికాలో కూలీల కొరతను అధిగమించడానికి వ్యవసాయంలో రోబోలు, యంత్రాల వినియోగం ఎక్కువ అవుతోంది. బ్రిటన్‌, బ్రెజిల్‌ కూడా అదే బాట పట్టాయి.

- ఆర్య

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.