అసోం ఒప్పందం అమలుపై మరో ఉపసంఘం!

author img

By

Published : Oct 4, 2021, 6:54 AM IST

assam accord

చరిత్రాత్మక అసోం ఒప్పందం అమలుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఉపసంఘాన్ని నియమించింది. ముగ్గురు మంత్రులు, అయిదుగురు 'ఆసు' విద్యార్థి నేతలను అందులో సభ్యులుగా చేర్చిన హిమంత బిశ్వ సర్కారు- నివేదిక సమర్పణకు మూడు నెలల గడువు విధించింది. అసోం ఒప్పందం అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ లోగడ ఉద్ఘాటించారు. అది సంపూర్ణంగా సాకారమయ్యే సుదినం కోసమే మూడున్నర దశాబ్దాలుగా అస్సామీయులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు!

చరిత్రాత్మక అసోం ఒప్పందం అమలుపై సంఘాలు, సమావేశాలు, చర్చోపచర్చలతోనే దశాబ్దాలు దొర్లిపోతున్నాయి. ఆ ఒడంబడికలోని ప్రధానాంశాలను పట్టాలెక్కించే ప్రణాళిక రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఉపసంఘాన్ని నియమించింది. ముగ్గురు మంత్రులు, అయిదుగురు 'ఆసు' విద్యార్థి నేతలను అందులో సభ్యులుగా చేర్చిన హిమంత బిశ్వ సర్కారు- నివేదిక సమర్పణకు మూడు నెలల గడువు విధించింది. రాష్ట్రంలోకి పోటెత్తుతున్న అక్రమ వలసదారులను కట్టడి చేయాలంటూ నాలుగు దశాబ్దాల క్రితం అసోంలో ప్రజాందోళన ఉవ్వెత్తున ఎగసింది. 'ఆసు' ఆధ్వర్యంలో ఆరేళ్ల పాటు మహోద్ధృతంగా సాగిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తత్ఫలితంగా అస్సామీయుల భాషా సాంస్కృతిక, సామాజిక అస్తిత్వం, చారిత్రక వారసత్వాల పరిరక్షణ దిశగా కీలక ఒడంబడిక మొగ్గతొడిగింది.

19లక్షల మంది పేర్లు గల్లంతు..

1985 ఆగస్టు 15న ఉద్యమకారులతో ఆనాటి రాజీవ్‌ గాంధీ సర్కారు కుదుర్చుకున్న ఆ ఒప్పందం మేరకు 1971 మార్చి 24వ తేదీ తరవాత అసోంలోకి అడుగుపెట్టిన ప్రవాసులందరినీ విదేశీయులుగా పరిగణించాలి. దానికనుగుణంగా సుప్రీంకోర్టు దిశానిర్దేశాలతో నాలుగేళ్ల కసరత్తు దరిమిలా 2019లో జాతీయ పౌర పట్టిక వెలుగుచూసింది. అందులో 19 లక్షల మంది పేర్లు గల్లంతు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా గగ్గోలు రేగింది. జాబితాను తప్పులతడకగా అభివర్ణిస్తున్న ప్రభుత్వం- దాన్ని పునస్సమీక్షించాలని కోరుతోంది. అస్సామీయుల ప్రయోజనాలకు గొడుగుపట్టడానికి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన, పరిపాలనాపరమైన రక్షణలు కల్పించాలంటున్న ఒప్పందంలోని ఆరో నిబంధన అమలూ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది! అసోం ఒప్పందం అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ లోగడ ఉద్ఘాటించారు. అది సంపూర్ణంగా సాకారమయ్యే సుదినం కోసమే మూడున్నర దశాబ్దాలుగా అస్సామీయులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు!

ఆనాడు అమలు చేయలేమని..

విభిన్న రంగాల్లో క్రియాశీల కృషి ద్వారా ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి ప్రభుత్వాలు ఇతోధికంగా దోహదపడాలని అసోం ఒప్పందం స్పష్టీకరిస్తోంది. ఆ మేరకు విద్య, సాంస్కృతిక, పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సాధించినట్లు పాలకులు పేర్కొంటున్నా- ఆరో నిబంధనకు అనుగుణంగా మూలవాసుల హక్కుల పరిరక్షణలో అలవిమాలిన జాప్యాన్ని స్థానికులు ఎత్తిచూపుతున్నారు. ఆ నిబంధనపై జస్టిస్‌ బిప్లబ్‌ కుమార్‌ శర్మ నేతృత్వంలో కేంద్రం ఏర్పరిచిన ఉన్నత స్థాయి సంఘం నిరుడే తన నివేదికను రాష్ట్ర సర్కారుకు సమర్పించింది. చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో అస్సామీయులకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాష్ట్రంలోకి ఇతరుల ప్రవేశాన్ని గట్టిగా నియంత్రించాలని అది సూచించింది. వాస్తవదూరమైన ఆ సిఫార్సులను అమలు చేయలేమని ఎనిమిది నెలల క్రితం రాష్ట్ర మంత్రిగా హిమంత తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయనే ఆ సంఘం నివేదికను కూలంకషంగా పరిశీలించడానికి అంటూ ఉపసంఘాన్ని కొలువుతీర్చారు!

రాజీపడబోమని..

ఆరో నిబంధన అమలుపై రాజీపడబోమని 'ఆసు' నేతలు మరోవైపు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లోంచి ఆక్రమణల తొలగింపు సైతం తరచూ వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలో పాతిక లక్షల ఎకరాలకు పైగా సర్కారీ స్థలాలు కబ్జాదారుల చెరలో చిక్కినట్లు లోగడ అధ్యయనాలు వెల్లడించాయి. భూహక్కుల విషయంలో వలసదారులు, స్థానికుల మధ్య వైషమ్యాలు పోనుపోను పెచ్చరిల్లుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతంగా పరిణమించకుండా సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించడంపై సర్కారు సత్వరం దృష్టిసారించాల్సి ఉంది. విదేశీయుల గుర్తింపు వంటి ముఖ్య విషయాల్లో నాయకులు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను పౌరసమాజం తప్పుపడుతోంది. అసోం ఒప్పందం స్ఫూర్తికి పట్టంకట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో యత్నిస్తేనే- ఈశాన్యభారతంలోని కీలక రాష్ట్రంలో శాంతి, సామరస్యాలు వర్ధిల్లుతాయి!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.