'మగవారూ.. శృంగార భాగస్వాములను తగ్గించుకోండి'

author img

By

Published : Jul 28, 2022, 9:28 AM IST

monkeypox

MONKEYPOX WHO: మంకీపాక్స్​ నివారణకు పురుషులు శృంగార భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సూచించారు. ఇప్పటివరకు గుర్తించిన మొత్తం కేసుల్లో 98 శాతం.. స్వలింగ సంపర్కులు, స్తీ- పురుషులిద్దరితోనూ శృంగారంలో పాల్గొనే మగవారిలోనే వెలుగుచూశాయని ఆయన అన్నారు.

MONKEYPOX WHO: మంకీపాక్స్‌ వ్యాధి బారిన పడే ముప్పును తగ్గించుకునేందుకుగాను ముఖ్యంగా పురుషులు శృంగార భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సూచించారు. ఈ ఏడాది మేలో మంకీపాక్స్‌ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఇప్పటివరకు గుర్తించిన మొత్తం కేసుల్లో 98 శాతం.. స్వలింగ సంపర్క పురుషులు, స్త్రీ-పురుషులిద్దరితోనూ శృంగారంలో పాల్గొనే మగవారిలోనే వెలుగుచూశాయని ఆయన తెలిపారు.

ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం వల్లే ప్రధానంగా ఇది వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యక్తి శరీరం, నోరు, ముఖాన్ని తాకడంతోపాటు నోటి తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. ప్రధానంగా ఇది స్వలింగ సంపర్కుల్లోనే తొలుత బయటపడినప్పటికీ.. తల్లి నుంచి పిల్లలకు, కుటుంబ సభ్యుల్లో వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాప్తిచెందే ఆస్కారం ఉందన్నారు. ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. జాతీయ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఈ వివరాలు వెల్లడించారు.

ఏమిటీ మంకీపాక్స్‌.. వైరల్‌ జూనోసిస్‌ కారణంగా మంకీపాక్స్‌ ఉత్పన్నమైంది. అంటే.. జంతువుల నుంచి మానవుల్లోకి వచ్చిందన్న మాట. ఇది పాక్సీవైరిడే వైరస్‌ కుటుంబంలోని ఆర్థోపోక్స్‌వైరస్‌ శ్రేణికి చెందింది. ఇందులో రెండు పోగుల డీఎన్‌ఏ ఉంటుంది. దీని జన్యుక్రమం పెద్దదే. ఫ్లూ, కరోనా వంటి చిన్నపాటి ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ల కన్నా ఇందులో సంక్లిష్టత ఎక్కువ.

మంకీపాక్స్‌ వైరస్‌లో రెండు జన్యు సమూహాలు ఉన్నాయి.

1. మధ్యఆఫ్రికన్‌ (కాంగో బేసిన్‌) తరగతి

2. పశ్చిమ ఆఫ్రికన్‌ తరగతి

కాంగో బేసిన్‌ తరగతి వైరస్‌లు తీవ్రమైన వ్యాధి కలిగిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. దాని సాంక్రమిక శక్తి కూడా ఎక్కువే.

మొదట ఎక్కడ.. మానవుల్లో మంకీపాక్స్‌ మొదట 1970లో వెలుగు చూసింది. నాడు ఆఫ్రికాలోని డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో 9 నెలల చిన్నారికి ఈ వ్యాధి సోకింది. కాంగో బేసిన్‌లోని గ్రామీణ, వర్షాధార అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందింది. అనంతరం మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో విస్తరించింది.

2003లో తొలిసారిగా ఇది ఆఫ్రికా వెలుపలికి పాకింది. అమెరికాకు చేరింది. ఆ ఏడాది అక్కడ 70 మందికి ఈ వ్యాధి సోకింది. తర్వాత పలు ఇతర దేశాలకూ విస్తరించింది.

వ్యాప్తి ఇలా.. మంకీపాక్స్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రోగికి అత్యంత సమీపంగా ఉండి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే అతి పెద్ద తుంపర్లను పీల్చడం ద్వారా; తాకడం, ముద్దు పెట్టుకోవడం, కరచాలనాలు; చెమట, కన్నీళ్లు, తదితర శరీర స్రావాలు; లైంగిక సంపర్కం, బాధితులు వాడిన దుస్తులు వంటి వాటిని వాడడం, వారు పడుకున్న చోట పడుకోవడం, కూర్చున్న చోట కూర్చోవడం వంటి వాటి ద్వారానూ ఇతరులకు సోకుతుంది. ముఖ్యంగా పురుష స్వలింగ సంపర్కుల్లో మంకీపాక్స్‌ ఎక్కువగా విస్తరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. తల్లి నుంచి గర్భస్థ పిండానికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అయితే ఇది కరోనా వైరస్‌ అంత ఉద్ధృతంగా వ్యాప్తి చెందదు.

మశూచితో పోలికలు.. 1980లో ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించిన మశూచి (స్మాల్‌ పాక్స్‌) లక్షణాలు మంకీపాక్స్‌ రోగుల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే మశూచితో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువే.

వ్యాప్తిచేసే జంతువులు.. మశూచి.. మానవులపైనే ప్రభావం చూపింది. మంకీపాక్స్‌ మాత్రం కొన్ని రకాల ఉడతలు, ఎలుకలు, వానరాలకూ సోకుతోంది. వాటి నుంచి మానవులకు వ్యాధి వ్యాప్తి చెందవచ్చు. జంతువులు కరవడం, రక్కడం చేసినప్పుడు, వాటి మాంసాన్ని సరిగా వండకుండా తినడం వల్ల మానవులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు.

వారం గడిచాకే లక్షణాలు బహిర్గతం.. బాధితుడి శరీరంలోకి మంకీపాక్స్‌ వైరస్‌ ప్రవేశించాక 6-13 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. సరాసరిన ఎనిమిదిన్నర రోజుల తర్వాత ఇవి బయటపడుతున్నాయి.

శరీరంపై దద్దుర్లు, పొక్కులు ఈ వ్యాధి ప్రధాన లక్షణం. దీంతో పాటు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చంకల్లో, గజ్జల్లో బిళ్ల కట్టడం, లింఫు గ్రంధుల్లో వాపు, నీరసం, చలి, చెమట పట్టడం, గొంతునొప్పి వంటివి కనిపిస్తాయి.

వ్యాధి లక్షణాలు 5-21 రోజుల పాటు కొనసాగవచ్చు. చాలావరకూ నిర్దిష్ట చికిత్స లేకుండానే దానంతట అదే ఈ ఇన్‌ఫెక్షన్‌ తగ్గిపోతుంది. తీవ్రస్థాయి కేసుల్లో చికిత్స అవసరమవుతుంది. సాధారణంగా పిల్లల్లో ఇలాంటి పరిస్థితి రావొచ్చు. రోగనిరోధక శక్తిలో లోపాలున్నవారికీ ఇబ్బందులు తలెత్తవచ్చు.

మంకీపాక్స్‌తో బ్రాంకోనిమోనియా, సెప్సిస్‌, ఎన్‌సెఫలైటిస్‌, కార్నియాలో ఇన్‌ఫెక్షన్‌, దృష్టి లోపం వంటి ఇతర సమస్యలూ రావొచ్చు.

టీకాలు, చికిత్సలు ఉన్నాయి.. మశూచి టీకాలు మంకీపాక్స్‌కూ పనిచేస్తాయి. గతంలో ఆ వ్యాక్సిన్‌ పొందినవారికి మంకీపాక్స్‌ నుంచి 85 శాతం మేర రక్షణ లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మశూచి అంతం కావడం వల్ల 40 ఏళ్లుగా ఈ టీకాను ఎక్కడా వేయడంలేదు. దీనికితోడు నాటి వ్యాక్సిన్‌ ప్రభావం క్రమంగా తగ్గడం వల్ల మంకీపాక్స్‌ విజృంభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రజలందరికీ ఈ టీకా అవసరంలేదని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకినవారికి చేరువగా వెళ్లినవారికి, ముప్పు ఎక్కువగా ఉన్న హెల్త్‌ వర్కర్లు, ల్యాబ్‌ సిబ్బంది వంటివారికి వ్యాక్సిన్లు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

మశూచి కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సీనియా ఇమ్యూన్‌ గ్లోబులిన్‌, యాంటీవైరల్స్‌ వంటి మందులు మంకీపాక్స్‌పై పనిచేస్తాయి.

విడిగా ఉంచాలి.. పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) పరీక్ష ద్వారా మంకీపాక్స్‌ను నిర్దిష్టంగా గుర్తించొచ్చు. ఈ వ్యాధి నిర్ధారణ అయిన వారిని విడి గదిలో ఉంచాలి. వారితో సన్నిహితంగా మెలగకూడదు. వ్యాధిగ్రస్తులకు దగ్గరగా వెళ్లిన వారందరినీ గుర్తించి పరీక్షలు జరపాలి.

తగ్గిన మరణాలు.. ఒకప్పుడు మంకీపాక్స్‌ బాధితుల్లో మరణాలు 11 శాతం వరకూ ఉండేవి. ఇటీవల అది 3-6 శాతానికి తగ్గింది.

ఇవీ చదవండి: అర్ధంతరంగా ముగిసిన రిషి, ట్రస్ టీవీ డిబేట్​.. కారణం ఇదే..

పుతిన్​కు తీవ్ర అస్వస్థత.. వైద్యుల్లో టెన్షన్​ టెన్షన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.