ETV Bharat / international

అమెరికా డ్రోన్​ను ఢీకొట్టిన రష్యా జెట్​.. వీడియో రిలీజ్​ చేసిన పెంటగాన్​.. యమా స్పీడ్​లో..

author img

By

Published : Mar 16, 2023, 4:56 PM IST

నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేస్తున్న దృశ్యాలను విడుదల చేసింది పెంటగాన్. అమెరికాకు చెందిన MQరీపర్‌- 9 డ్రోన్‌ వైపు రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు దూసుకొస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది.

US releases video of Russian jet dumping fuel on its drone
US releases video of Russian jet dumping fuel on its drone

అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేసిన ఘటనపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేస్తున్న దృశ్యాలను పెంటగాన్‌ విడుదల చేసింది. అమెరికాకు చెందిన MQరీపర్‌- 9 డ్రోన్‌ వైపు రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు దూసుకొస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. డ్రోన్‌పై రష్యా విమానాలు వెళ్లినప్పుడు వీడియో ప్రసారానికి అంతరాయం కలిగింది. ఎస్​యూ-27 యుద్ధ విమానం.. డ్రోన్‌పై ఇంధనాన్ని విడుదల చేయడం వల్ల డ్రోన్‌ దెబ్బతిందని పెంటగాన్ వివరించింది.

అయితే ప్రొపెల్లర్ ధ్వంసం కావడం వల్ల డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో కూల్చివేయాల్సి వచ్చిందని అమెరికా.. ఘటన జరిగాక వెల్లడించింది. రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌-27 యుద్ధ విమానాలు.. తమ MQ-9 డ్రోన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయని అమెరికా తెలిపింది. అందులోని ఒక ఫైటర్ జెట్‌.. డ్రోన్ ప్రొపెల్లర్‌ను ఢీకొట్టిందని పేర్కొంది. అంతకుముందు ఫైటర్ జెట్లు డ్రోన్‌పై ఇంధనాన్ని కుమ్మరించాయని అమెరికా తెలిపింది. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఘటనపై స్పందించిన రష్యా.. తమ యుద్ధ విమానాలు డ్రోన్‌ను ఢీకొట్టడం గానీ, కాల్పులు జరపడం గానీ చేయలేదని పేర్కొంది. తమ సరిహద్దులకు సమీపంలో ఎగిరిన డ్రోన్‌.. రష్యాలోకి చొచ్చుకొచ్చిందని తెలిపింది. రష్యా యుద్ధ విమానాలను అడ్డగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి నీటిలో కూలిపోయిందని వెల్లడించింది.

కోల్డ్ వార్ తర్వాత తొలిసారి..
అమెరికా డ్రోన్​ను రష్యా జెట్​ ఢీకొట్టిన ఘటన మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రకు దిగిన తర్వాత ఇరు దేశాలు ఇలా నేరుగా ఘర్షణ పడటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు చెందిన ఓ ఎయిర్​క్రాఫ్ట్ / డ్రోన్​ను రష్యా యుద్ధ విమానం కూల్చివేయడం.. ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) తర్వాత ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ వివరాలు వెల్లడించినట్లు శ్వేతసౌధ ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ శాఖ అధికారులు రష్యా అధికారులతో నేరుగా మాట్లాడతారని చెప్పారు. ఈ ఘటనను నిరసిస్తూ రష్యా రాయబారికి సమన్లు పంపినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. రష్యాలోని అమెరికా రాయబారి సైతం అక్కడ నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యాపై పోరాటం సాగించేందుకు ఉక్రెయిన్​కు పశ్చిమ దేశాలు సాయం చేస్తున్నాయి. సోవియట్ హయాంలో తయారైన మిగ్-29 విమానాలను ఉక్రెయిన్​కు ఇచ్చేందుకు పోలండ్ సిద్ధమైంది. వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల్లో ఈ యుద్ధ విమానాలను ఉక్రెయిన్​కు ఇస్తామని పోలండ్ ప్రధానమంత్రి మాటెజ్ మొరావికీ తెలిపారు. స్లొవేకియా సైతం ఉక్రెయిన్​కు మిగ్-29 విమానాలను అందించనున్నట్లు తెలిపింది. ఇతర నాటో దేశాలు కూడా యుద్ధ విమానాలు పంపించాలని పోలండ్, స్లొవేకియా దేశాలు పిలుపునిచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.