ETV Bharat / international

11,000 దాటిన భూకంపం మృతుల సంఖ్య.. 10ఏళ్లలో ఇదే అత్యంత భయానకం

author img

By

Published : Feb 8, 2023, 2:17 PM IST

Updated : Feb 8, 2023, 5:40 PM IST

turkey earthquake death count
తుర్కియే, సిరియాలో భూకంపం

ప్రకృతి విలయానికి విలవిల్లాడిన తుర్కియే, సిరియాలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు రెండు దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు 11,000 దాటింది. ప్రస్తుత భూకంపం.. ఈ దశాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో వేలాది మంది చిన్నపిల్లలు చనిపోయి ఉంటారని యునిసెఫ్ అంచనావేసింది. ఇప్పటివరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

తుర్కియే, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. భూకంపం సంభవించి 2 రోజులు దాటినా శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 11,000 మందికిపైగా బలయ్యారు. వేలసంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత భూకంపం.. ఈ దశాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు వెల్లడించారు. 20,000 మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ఇప్పటికే అంచనా వేసింది. ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఈ విపత్తు ధాటికి వేలాదిమంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని యునిసెఫ్ అంచనా వేసింది.

దాదాపు 8.5 కోట్ల జనాభా కలిగిన తుర్కియేలో 1.3 కోట్ల మంది భూకంపం వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యారని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. ఒక్క తుర్కియేలోనే దాదాపు 7,000 మంది మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. 37,000 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. దీంతో 10 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధించినట్లు ప్రకటించారు. తుర్కియేలో ఇప్పటివరకు 8,000 మందిని శిథిలాల నుంచి రక్షించారు. వేలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. వేల సంఖ్యలో భవనాలు కూలిపోవడం వల్ల 3.80 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు, షాపింగ్మాల్లు, మైదానాలు, ఇతర కమ్యూనిటీ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. తుర్కియేలో 60,000 మంది సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా.. ఇంకా చాలా ప్రాంతాల్లో సహాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.

turkey earthquake death count
సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్​

అటు.. సిరియాలో మొత్తం 2,500 పైగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 1,250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2,000 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న వాయవ్య ప్రాంతంలో 1,280 మందికిపైగా మరణించారని.. 2,600 మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు.

turkey earthquake death count
సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్​

భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఒక్క తుర్కియేలోనే 6,000 భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద లక్షా 80వేల మంది చిక్కుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి కోసం గత రెండు రోజులుగా 25,000 మంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా ఇంకా అనేక మందిని గుర్తించాల్సి ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారు సజీవంగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వరుస ప్రకంపనలు, గడ్డకట్టే చలి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో శిథిలాల కింద మృత్యుంజయులు కన్పించే అవకాశాలు సన్నగిల్లుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

turkey earthquake death count
సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్​

శిథిలాల కింద మృత్యుంజయులు
శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా గాలిస్తున్నారు. రాత్రిళ్లు సైతం టార్చ్​లైట్ల వెలుగులో సహాయక చర్యలు సాగిస్తూనే ఉన్నారు. చిమ్మచీకటి, ఆహారం లేక, తీవ్రమైన చలికి పెద్దవాళ్లే ప్రాణాలు కోల్పోతుండగా.. పసిపిల్లలను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీస్తున్నారు.

తుర్కియేలో భూకంపం ధాటికి భారీగా దెబ్బతిన్న కహ్రామన్మరాస్ ప్రావిన్స్​లో శిథిలాల నుంచి 3 ఏళ్ల బాలుడిని సహాయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. 43 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మూడేళ్ల ఆరిఫ్ఖాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలు కావడంతో ఆరిఫ్​ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అంతకుముందు ఆరిఫ్ తండ్రిని కూడా రెస్క్యూ సిబ్బంది బయటికితీశారు. హతాయ్ ప్రావిన్స్​లో 3 వేర్వేరు చోట్ల ముగ్గురు పిల్లల్ని రక్షించిన దృశ్యాలను ఇస్తాంబుల్ అధికారులు విడుదల చేశారు. రాత్రిపూట ఇరుకైన ప్రాంతాల్లో పిల్లలను శిథిలాల కింది నుంచి తీసినట్లు తెలిపారు. మట్టి, కాంక్రీట్ మధ్య నుంచి వారిని వెలికితీసినట్లు పేర్కొన్నారు.

turkey earthquake death count
సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్​

హతాయ్ రాష్ట్రంలో జరిగిన మరో ఘటనలో ఆరేళ్ల బాలికను గ్రీక్​ను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద చేయి ఇరుక్కుని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న బాలిక అరుపులను రెస్క్యూ సిబ్బంది విన్నారు. వెంటనే సిబ్బంది కొన్ని మీటర్ల లోతులోకి వెళ్లి ఆమెను రక్షించారు. అదే శిథిలాల కింద ఉన్న మరో ఏడేళ్ల చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు.

తుర్కియేకు మరో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం.. 'ఆపరేషన్​ దోస్త్​'గా పేరు
తుర్కియే, సిరియాకు సహాయం చేసేందుకు చేపట్టిన కార్యక్రమానికి ఆపరేషన్​ దోస్త్​గా నామకరణం చేసింది భారత్​. ఇందులో భాగంగా సహాయ సామగ్రితో కూడిన నాలుగో సీ17 విమానాన్ని పంపించింది. 54 మంది ఆర్మీ వైద్యులు సహా వైద్య సామగ్రిని తరలించామని చెప్పింది. భారత్​ ఎప్పుడూ మానవత్వం వైపే ఉంటుందని.. వసుధైవ కుటుంబం అనే విధానాన్ని మార్చుకోదన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్​. తుర్కియేకు సహాయం చేసేందుకు ఇప్పటికే రెండు ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలను పంపించినట్లు తెలిపారు ఆ సంస్థ డైరెక్టర్​ జనరల్​ అతుల్​ కర్వాల్​. ఈ రెండు బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయని పేర్కొన్నారు. మూడో బృందం కూడా బయలుదేరేందుకు సిద్ధంగా ఉందని.. తుర్కియే కోరితే మరో బృందాన్ని సైతం పంపిస్తామని చెప్పారు. జపాన్​లో 2011లో సునామీ కారణంగా 20వేల మంది చనిపోయారు. 2015లో నేపాల్​లో భూకంపానికి 8,800 మంది బలయ్యారు.

turkey earthquake death count
సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్​
turkey earthquake death count
సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్​
turkey earthquake death count
సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్​
Last Updated :Feb 8, 2023, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.