ETV Bharat / international

వలసదారుల బోటు బోల్తా.. 13 మంది మృతి.. 40 మంది గల్లంతు

author img

By

Published : Jun 30, 2022, 6:56 AM IST

Senegal boat capsize: వలసదారులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన ఆఫ్రికాలోని సెనెగల్​లో జరిగింది. బోటులో మంటలు రావడం వల్లే బోల్తా పడి ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.

boat capsized
boat capsized

Senegal boat capsize: ఆఫ్రికా దేశం సెనెగల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో ఐరోపాకు వెళ్తున్న బోటు సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతిచెందినట్టు రెడ్‌ క్రాస్‌ అధికారులు వెల్లడించారు. దక్షిణ కాసామాన్స్ ప్రాంతంలోని కఫౌంటైన్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదం సమయంలో బోటులో దాదాపు 150 మందికి పైగా ఉన్నారు. వీరిలో 91 మందిని కాపాడామని, మరో 40 మందికి పైగా గల్లంతైనట్టు సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది తెలిపారు. గల్లైంతన వారి ఆచూకీ కోసం తమ అన్వేషణ కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ బోటులో మంటలు వ్యాపించడం వల్లే బోల్తా పడి ఈ దుర్ఘటన జరిగినట్టు స్థానిక వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. అసలు ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలేంటి? ఈ బోటుకు, మైగ్రేషన్‌ ఆపరేషన్‌కు ఇన్‌ఛార్జి ఎవరు? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా తీర ప్రాంతం వెంబడి ఈ ప్రమాదకరమైన సముద్ర మార్గంలో చిన్న పడవల్ని తీసుకొని ఏటా అనేకమంది ఐరోపా వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. గతేడాది ఆగస్టులో కూడా 60 మందితో వెళ్తున్న ఓ బోటు సెనెగల్‌కు ఉత్తరాన ఉన్న సెయింట్‌ లూయిస్‌ వద్ద బోల్తా పడగా.. వీరిలో అనేకమంది మునిగిపోయారు.

ఇదీ చూడండి : డిసీజ్‌ ఎక్స్‌.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.