ETV Bharat / international

ఉక్రెయిన్​కు అమెరికా ఆయుధాలు.. రష్యా స్ట్రాంగ్​ వార్నింగ్​

author img

By

Published : Apr 17, 2022, 7:35 AM IST

Russia Ukraine News: అమెరికాను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది రష్యా. ఉక్రెయిన్​కు ఆయుధాల సరఫరాను ఆపని పక్షంలో తీవ్ర పర్యవసానాలు ఉంటాయని పేర్కొంది. కీవ్‌పై మరోసారి ముప్పేట దాడి చేసిన రష్యా ఆ దేశ ఆయుధ కర్మాగారాలను ధ్వంసం చేసింది.

russia ukraine news
russia ukraine news

Russia Ukraine News: ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను అమెరికా ఆపని పక్షంలో 'తీవ్ర పర్యవసానాలు' ఉంటాయని రష్యా గట్టి హెచ్చరిక చేసింది. ఉక్రెయిన్‌కు భారీగా జావెలిన్‌ వంటి క్షిపణుల్ని సరఫరా చేయడమే కాకుండా మరో 80 కోట్ల డాలర్ల విలువైన అధునాతన ఆయుధాలు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవలే ప్రకటించారు. దీంతో రష్యా మండిపడింది. ఆయుధాలు పంపడాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని దౌత్య వర్గాల ద్వారా ఒక నోట్‌ను బైడెన్‌ ప్రభుత్వానికి పంపింది. "బాధ్యతారహితంగా ఉక్రెయిన్‌ సైన్యానికి పశ్చిమదేశాలు సహకారాన్ని అందిస్తున్నాయి" అని ఆక్షేపించింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పైనా, కేబినెట్‌ మంత్రులు- రిషి సునాక్‌, లిజ్‌ ట్రుస్‌, ప్రీతి పటేల్‌, మాజీ ప్రధాని థెరిసా మే సహా ఆ దేశానికి చెందిన 13 మంది ఉన్నతస్థాయి వ్యక్తులపైనా నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.

క్షిపణులతో రష్యా విధ్వంసం: మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా తన దాడుల్ని తీవ్రతరం చేసింది. కీవ్‌ నగరం లక్ష్యంగా విరుచుకుపడింది. ఆ నగరంలో సాయుధ వాహనాలు తయారు చేసే కర్మాగారం భవనాలను, మైకొలైవ్‌లో సైనిక వాహనాల మరమ్మతుల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. దీని కోసం అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించింది. కీవ్‌తో పాటు లివివ్‌ నగరంపై వాయుసేన విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఖర్కివ్‌, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ సహా తూర్పు ప్రాంతాలపై ఫిరంగుల మోత మోగింది. తమ యుద్ధనౌకకు నష్టం కలిగినందుకు మరింత ప్రతీకారంతో దాడుల స్థాయి పెంచింది. బెలారస్‌ నుంచి బయల్దేరిన రష్యా యుద్ధ విమానాలు క్రూయిజ్‌ క్షిపణుల్ని ప్రయోగించగా వాటిలో నాలుగింటిని తాము కూల్చివేశామని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. మేరియుపొల్‌లో పలుచోట్ల హోరాహోరీ పోరు కొనసాగింది. పెద్దఎత్తున మృతదేహాలను పూడ్చివేసిన దృశ్యాలు కనిపించాయి. ఖర్కివ్‌లో ఒక భవనంపై జరిగిన దాడిలో ఏడు నెలల పసి పాపాయి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

అణ్వాయుధాలు వాడతారేమో: జెలెన్‌స్కీ తమపై రష్యా అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందని, ప్రపంచ దేశాలన్నీ దీనికి సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌ ప్రజల ప్రాణాలంటే పుతిన్‌కు లెక్కలేదనీ, అందుకే రసాయన ఆయుధాలనైనా తమపై ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. ఉక్రెయిన్‌ను సులభంగా చేజిక్కించుకోవచ్చనే తప్పుడు అంచనాల్లో శత్రువులు ఉన్నారని వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. తమ దేశం ఎప్పటికీ రష్యా చేతికి చిక్కదని తేల్చిచెప్పారు. రష్యాపై మరింతగా కొరడా ఝళిపించి, అక్కడి నుంచి ఇంధన దిగుమతుల్ని పూర్తిగా నిషేధించాలని ప్రపంచాన్ని కోరారు. వచ్చేవారం జరగనున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు సమావేశాలకు ఉక్రెయిన్‌ తన ప్రతినిధి బృందాన్ని పంపించనుంది.

ఇదీ చదవండి: బ్రిటన్ ప్రధాని, భారత సంతతి మంత్రులపై రష్యా నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.