ETV Bharat / international

'రష్యా నుంచి డీజిల్ దిగుమతులపై నిషేధం.. భారత్​ను ఒత్తిడి చేయబోం'

author img

By

Published : Feb 6, 2023, 6:41 AM IST

RUSSIA UKRAINE DIESEL
RUSSIA UKRAINE DIESEL

రష్యా నుంచి డీజిల్ దిగుమతులపై ఐరోపా దేశాలు నిషేధం విధించాయి. ముడిచమురు దిగుమతుల నిషేధంతో రష్యా ఆదాయానికి గండి కొట్టాలని భావిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో భారత్​పై ఒత్తిడి చేయకూడదని నిర్ణయించాయి.

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి డీజిల్‌ దిగుమతులపై ఐరోపా దేశాలు నిషేధం విధించాయి. గతేడాది జూన్‌లోనే ఈ మేరకు ప్రకటించగా.. ఆ నిర్ణయం ఇప్పుడు అమల్లోకి రానుంది. శిలాజ ఇంధన అమ్మకాలతో క్రెమ్లిన్‌ భారీ లాభాలు అర్జించి... ఆ డబ్బును ఉక్రెయిన్‌ యుద్ధంలో ఖర్చు చేస్తున్నట్లు ఐరోపా దేశాలు ఆరోపించాయి. డీజిల్‌ ఇతర శుద్ధిచేసిన ముడిచమురు దిగుమతుల నిషేధంతో రష్యా ఆదాయానికి గండికొట్టాలని భావిస్తున్నాయి. జీ7 దేశాలు విధించిన ధరల పరిమితితోపాటు నిషేధం అమల్లోకి రానుందని ఐరోపా దేశాలు స్పష్టం చేశాయి. రష్యా డీజిల్‌ను దిగుమతి చేసుకోవద్దని భారత్‌, చైనాలను ఒత్తిడి చేస్తే.. అంతర్జాతీయ విపణిలో ధరలు పెరుగుతాయనీ అందుకే ఆ పని చేయట్లేదని ఐరోపా సమాఖ్య తెలిపింది.

జెలెన్​స్కీ హత్యకు ప్లాన్.. నిజమెంత?
మరోవైపు, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మాస్కోతో పోరాడేందుకు ఉక్రెయిన్​కు పశ్చిమ దేశాలు భారీగా సాయం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని హతమార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయనే వార్తలపై ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ తాజాగా స్పందించారు. ఆ పనికి ఒడిగట్టనని రష్యా అధినేత పుతిన్‌ తనకు మాట ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదట్లో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు బెన్నెట్‌ సైతం కొంతకాలం మధ్యవర్తిత్వం వహించారు. అయితే, అది పెద్దగా ఫలితం ఇవ్వలేదు.

'గతేడాది మార్చిలో మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్‌తో సమావేశమయ్యా. ఈ క్రమంలోనే.. జెలెన్‌స్కీని చంపాలనుకుంటున్నారా? అని ఆయన్ను అడిగా. 'లేదు' అని పుతిన్‌ సమాధానం ఇచ్చారు. దీన్నొక వాగ్దానంగా భావిస్తున్నట్లు ఆయనతో చెప్పా. 'జెలెన్‌స్కీని చంపబోన'ని పుతిన్‌ పునరుద్ఘాటించారు. అనంతరం ఇదే విషయాన్ని జెలెన్‌స్కీకి చెప్పా. 'నేను పుతిన్‌తో సమావేశమై బయటకు వచ్చా. ఆయన నిన్ను హత్య చేయడు' అని తెలిపా. దానికి జెలెన్‌స్కీ 'కచ్చితమేనా?' అని అడిగారు. వంద శాతం అని బదులిచ్చా' అని బెన్నెట్‌ అప్పటి పరిణామాలను గుర్తుచేసుకున్నారు.

తాను మధ్యవర్తిత్వం వహించిన సమయంలో ఉక్రెయిన్‌ నిరాయుధీకరణ ప్రతిజ్ఞను పుతిన్‌ విరమించుకున్నట్లు బెన్నెట్‌ తెలిపారు. అదేవిధంగా నాటోలో చేరబోనని జెలెన్‌స్కీ సైతం వాగ్దానం చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. నఫ్తాలీ బెన్నెట్‌ జూన్‌ 2021 నుంచి జూన్‌ 2022 వరకు ఇజ్రాయెల్‌ ప్రధానిగా పనిచేశారు. మరోవైపు.. ఇరాన్‌తో వివాదం నేపథ్యంలో రష్యాతో ఇజ్రాయెల్ మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌ విషయంలో అది పాశ్చాత్య దేశాలతో జట్టుకట్టింది. కీవ్‌కు అండగా నిలవాలంటూ పిలుపునిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.