చైనాపై పెలోసీ 'తైవాన్​ పంచ్​'.. ఆంక్షలతో డ్రాగన్​ షాక్.. అమెరికాతో చర్చలు బంద్​

author img

By

Published : Aug 5, 2022, 1:59 PM IST

Updated : Aug 5, 2022, 9:46 PM IST

pelosi visit taiwan

Pelosi Visit Taiwan: చైనా హెచ్చరికలు పట్టించుకోకుండా విజయవంతంగా తైవాన్ పర్యటన పూర్తి చేశారు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ. అమెరికా అధికారులను తైవాన్​కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదని అన్నారు పెలోసి. తైవాన్​ను ఏకాకి చేస్తానంటే తాము ఊరుకోబోమన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే.. పెలోసీపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది చైనా. దాంతో పాటు అమెరికాతో పలు అంశాలపై చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Pelosi visit Taiwan: చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదన్నారు. ఆ దేశాన్ని ఏకాకి చేస్తానంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు.

ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్న నాన్సీ పెలోసీ.. టోక్యోలో విలేకరులతో మాట్లాడారు. 'తైవాన్‌ను ఒంటరి చేయాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆ ద్వీప దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరకుండా అడ్డుకుంది. తైవాన్‌ దేశస్థులు ఎక్కడకీ వెళ్లకుండా.. ఎందులోనూ పాల్గొనకుండా వారు(డ్రాగన్‌ను ఉద్దేశిస్తూ) అడ్డుకోగలరేమో.. కానీ, మమ్మల్ని అక్కడకు వెళ్లకుండా అడ్డుకోలేరు. నా పర్యటనతో ద్వీప దేశంలో యథాతథ స్థతిని మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ, అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలన్నదే మా ప్రయత్నం' అని పెలోసీ చెప్పుకొచ్చారు.
నాన్సీ పెలోసీ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది చైనా.

చైనాది రెచ్చగొట్టే చర్యే: అమెరికా
డ్రాగన్‌ హెచ్చరికలను పట్టించుకోకుండా పెలోసీ తైవాన్‌లో పర్యటించడంతో చైనా ప్రతీకార చర్యలకు పాల్పడింది. తైవాన్‌పై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో పాటు గురువారం నుంచి ఆ ద్వీపదేశం చుట్టూ భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించింది. చైనా డ్రిల్స్‌ కారణంగా అనేక విమానాలు దారిమళ్లించుకోవాల్సి వచ్చింది. కాగా.. ఈ పరిణామాలపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాది పూర్తిగా రెచ్చగొట్టే చర్యేనని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు. కొలంబియాలో జరుగుతోన్న తూర్పు ఆసియా సదస్సుల్లో బ్లింకెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌తో పాటు దాని పొరుగుదేశాలను కూడా డ్రాగన్‌ భయపెట్టాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

ఆసియా పర్యటనలో భాగంగా నాన్సీ పెలోసీ గత మంగళవారం తన బృందంతో కలిసి తైవాన్‌ రాజధాని తైపేలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే తైవాన్‌ తమ భూభాగమే అని చెబుతూ వస్తోన్న డ్రాగన్‌.. ఈ పర్యటనపై ముందు నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, ఇందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తైవాన్‌ జలసంధిలోనే గురువారం నుంచి మిలిటరీ డ్రిల్స్‌ చేపట్టింది. అయితే చైనా చర్యలపై తైవాన్‌ కూడా దీటుగానే బదులిచ్చింది. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని.. కానీ, ఆ పరిస్థితులు ఎదురైతే తాము సిద్ధమేనని స్పష్టం చేసింది.

అమెరికాతో చైనా చర్చలు బంద్‌..
తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ తైవాన్‌లో పర్యటించడంపై గుర్రుగా ఉన్న చైనా.. తాజాగా అమెరికాతో పలు అంశాలపై చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాతావరణ మార్పుల దగ్గర్నుంచి, సైనిక సంబంధాలు, మాదకద్రవ్యాల నిరోధక ప్రయత్నాలు తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలను నిలిపివేయడం లేదా రద్దు చేస్తున్నట్లు చైనా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఏరియా కమాండర్లు, రక్షణశాఖ విభాగ అధిపతులు సమావేశం జరగాల్సి ఉండగా.. దాన్ని రద్దు చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే, మిలటరీ మారీటైమ్‌ సేఫ్టీ, అక్రమ వలసదారుల అప్పగింత వంటి అంశాలపై జరుగుతోన్న చర్చలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఇవీ చదవండి: అవమాన భారంతో చైనా.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?

నైట్​ క్లబ్​లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

Last Updated :Aug 5, 2022, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.