ETV Bharat / international

ఇమ్రాన్ అరెస్ట్​పై పాక్ సుప్రీం ఫైర్.. వెంటనే రిలీజ్ చేయాలని ఆర్డర్

author img

By

Published : May 11, 2023, 6:48 PM IST

Updated : May 11, 2023, 8:03 PM IST

పాకిస్థాన్​​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు భారీ ఊరట లభించింది. ఆయన అరెస్టు చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

Massive Relief From Supreme Court To Imran Khan
ఇమ్రాన్ అరెస్ట్​పై పాక్ సుప్రీం ఫైర్.. వెంటనే రిలీజ్ చేయాలని ఆర్డర్

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ ప్రధాని 70 ఏళ్ల ఇమ్రాన్​ ఖాన్​కు భారీ ఊరట లభించింది. ఇమ్రాన్​ అరెస్టు తీరుపై ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అరెస్టు చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు ఇమ్రాన్‌ను గంటలో తమ ఎదుట హాజరుపరచాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB)ను ఆదేశించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇమ్రాన్​ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అనంతరం అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్​ అరెస్టును సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా న్యాయస్థానం ప్రాంగణం నుంచి ఎలా అరెస్టు చేస్తారని పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉమర్ అటా బండియాల్, జస్టిస్ ముహమ్మద్ అలీ మజార్, జస్టిస్ అథర్ మినాల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ఒక వ్యక్తి కోర్టు ఆవరణలోకి ప్రవేశించడం అంటే కోర్టుకు లొంగిపోవడమేనని.. లొంగిపోయిన తర్వాత అతణ్ని ఎలా అరెస్టు చేస్తారని సూటి ప్రశ్నను సంధించింది. అయితే కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా కోర్టు పరిసరాల నుంచి ఎవరినీ అరెస్టు చేయరాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీనిని కోర్టు ధిక్కరణ చర్యగా భావిస్తున్నామని పాక్‌ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యాలు చేసింది.

సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. త‌న‌ను అప‌హ‌రించి క‌ర్రల‌తో కొట్టార‌ని, క‌స్టడీలో తీవ్రంగా హింసించార‌ని స‌ర్వోన్నత న్యాయ‌స్థానానికి వివరించారు. కరుడుగట్టిన నేరస్థుల్ని కూడా ఇంతలా హింసించరని ఆయన వాపోయారు. నిరసనకారుల చేసిన హింసను ఖండించాలని ప్రధాన న్యాయమూర్తి అడిగినప్పుడు... తాను కస్టడీలో ఉన్నానని చెప్పారు. రక్తపాత నిరసనలకు తాను ఎలా బాధ్యత వహిస్తానని చెప్పారు. తాను హింసకు దూరంగా ఉంటానని... తానెప్పుడూ హింసకు మద్దతు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన మద్దతుదారులను కోరారు.

90 నుంచి 100 మంది ఒకేసారి..
కోర్టు ముందు ఇమ్రాన్​ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హమీద్ ఖాన్.. తన క్లయింట్ ముందస్తు బెయిల్ కోసం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. ఈ క్రమంలో ఎటువంటి అనుమతుల్లేకుండా దాదాపు 90 నుంచి 100 మంది పారామిలటరీ రేంజర్లు ఆయన్ను అరెస్టు చేశారని.. ఆ సమయంలో పిటిషనర్​ పట్ల రేంజర్లు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. కాగా, శుక్రవారం ఇమ్రాన్​ ఖాన్​ ఇస్లామాబాద్​ హైకోర్టులో హాజరుకావాలని నోటీసులు అందుకున్నట్లు పాక్​ మీడియా సంస్థలు వెల్లడించాయి.

ఈ కేసును ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం విచారిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. "హైకోర్టు ఏం తీర్పునిచ్చినా దానికి మీరు కట్టుబడి ఉండాలి" అని ఆయన స్పష్టం చేశారు. అయితే కేసు విచారణ ప్రారంభానికి ముందు చీఫ్ జస్టిస్ బండియల్ ఖాన్‌.. "మిమ్మల్ని(ఇమ్రాన్​ ఖాన్​ను) చూడటం ఆనందంగా ఉంది" అంటూ పేర్కొనడం గమనార్హం.

అధ్యక్షుడు అల్వీ స్పందన..
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ దృష్ట్యా దేశంలో నెలకొన్న అశాంతి పరిస్థితులపై ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్​ అల్వీ గురువారం స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలవంతపు అరెస్టుల కంటే ముందు రాజకీయ పరిష్కారాలను కనుగొనేలా చూడాలని ఆయన ప్రజలను కోరారు.

ఇదీ జరిగింది..
అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి ఇస్లామాబాద్ హైకోర్టు నుంచి ఇమ్రాన్​ ఖాన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను బుధవారం అకౌంటబిలిటీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతడిని ఎనిమిది రోజుల పాటు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో రిమాండ్​కు అప్పగించింది. తన అరెస్ట్ కోసం మే1 నాటి NAB వారెంట్లను పక్కన పెట్టాలని.. అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించాలనే అంశంపై ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు, ఇమ్రాన్​ను అరెస్టు చేసిన తీరుపై ఇస్లామాబాద్​ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం కేసును తోసిపుచ్చిన కొద్ది గంటల తర్వాత అతడి అరెస్టును సమర్థించింది.

Last Updated : May 11, 2023, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.