ETV Bharat / international

రోడ్డు మార్గానే దేశానికి.. సూడాన్​లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు ప్రభుత్వం చర్యలు!

author img

By

Published : Apr 23, 2023, 9:45 PM IST

సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరుతో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ సూడాన్‌లో భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విమానాశ్రయాలన్నీ మూతపడటం వల్ల రోడ్డు మార్గం ద్వారానే దగ్గర్లోని సురక్షిత ప్రాంతాలకు అక్కడ ఉన్న భారతీయులను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం భారత దౌత్యకార్యాలయంతో టచ్‌లో ఉండాలని అక్కడ ఉన్న భారతీయులను కోరింది.

Sudan War 2023
సూడాన్‌

Sudanese Civil War : సూడాన్‌లో భీతావహ పరిణామాలు నెలకొన్న వేళ అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విమానాశ్రయాలన్నీ మూతపడటం వల్ల రోడ్డు మార్గంలోనే దగ్గర్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ సూడాన్‌లో ఉన్న భారతీయులు భారత దౌత్యకార్యాలయంతో టచ్‌లో ఉండాలని కోరింది. సూడాన్‌పై పట్టు కోసం ఆర్మీ, పారామిలటరీ గ్రూపు రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాల మధ్య కొనసాగుతున్న భీకర పోరు నేపథ్యంలో విమానాశ్రయాలన్నింటినీ మూసివేశారు. తాజాపరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి తమ దౌత్య సిబ్బందిని స్వదేశానికి రప్పించినట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఆ దేశంలో దౌత్యకార్యకలాపాలను నిలిపి వేస్తున్నట్లు తెలిపింది.

2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్‌లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్‌ఎస్‌ఎఫ్‌తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. ర్యాపిడ్ సపోర్ట్‌ ఫోర్సెస్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు సూడాన్‌ ఆర్మీ రూపొందించిన ప్రతిపాదన ఆర్మీ- పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్‌ ఫతా అల్‌ బుర్హాన్‌, పారా మిలటరీ కమాండర్‌ మహ్మద్‌ హందాన్‌ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న వేళ పౌరుల సురక్షిత తరలింపు కోసం ఇరువర్గాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.

ఆర్మీ, పారామిలటరీ వర్గాల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన 150 మంది ఒక రోజు ముందుగానే సౌదీ అరేబియాకు చేరుకున్నారు. సౌదీలు కాకుండా భారత్‌తో సహా 12 దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నారు. ఇందులోని ముగ్గురు భారతీయులను సౌదీ ఎయిర్‌లైన్స్‌ ద్వారా తరలించారు. ఆ ముగ్గురూ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నవారే. వీరితోపాటు ఇంకెవరైనా భారతీయులు ఉన్నారా? అనే అంశంపై అధికారులు ఆరాతీస్తున్నారు. సూడాన్‌లో జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 420 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 3,700 మంది గాయాలపాలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాస్తవానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.