ETV Bharat / international

అమెరికా చట్టసభలోకి భారత సంతతి యువతి.. 23 ఏళ్లకే గెలిచి రికార్డు!

author img

By

Published : Nov 11, 2022, 7:07 AM IST

Updated : Nov 11, 2022, 8:49 AM IST

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓ భారతీయ అమెరికన్​కు అరుదైన గౌరవం దక్కింది. 23 ఏళ్లకే ఇల్లినాయి రాష్ట్ర చట్ట సభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆమె రిపబ్లిక్‌ పార్టీకి చెందిన వ్యక్తిపై గెలుపొందారు.

indian-american-nabeela-syed
నబీలా సయ్యద్‌

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నబీలా సయ్యద్‌ చరిత్ర సృష్టించారు. 23 ఏళ్లకే ఇల్లినాయిస్‌ రాష్ట్ర చట్ట సభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇల్లినాయిస్‌ 51వ డిస్ట్రిక్‌ నుంచి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీకి చెందిన క్రిస్‌ బోస్‌పై ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నబీలాకు 52.3శాతం ఓట్లు వచ్చాయి. ఈ మేరకు తన ఆనందాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

'నా పేరు నబీలా సయ్యద్‌. నాకు 23 ఏళ్లు. ఇండో-అమెరికన్‌ ముస్లిం మహిళని. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించాను. ఇల్లినాయిస్‌ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తుల్లో నేనే పిన్నవయస్కురాలని' అని పోస్టు చేశారు.

డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నానని తెలిసిన తర్వాత ప్రజలతో మాట్లాడేందుకే ఎక్కువ సమయం కేటాయించానని నబీలా సయీద్‌ తెలిపారు. ఈ పోటీలో ఎందుకు పాల్గొంటున్నానో వివరించానని తెలిపారు. మెరుగైన నాయకత్వం కోసం సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవ్వడం వల్లే విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. తనకు వెన్నంటి ఉంటూ మద్దతిచ్చిన ప్రతిఒక్కరికి సామాజిక మాధ్యమాల వేదికగా నబీలా సయ్యద్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరి తలుపు తట్టినట్లు చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల మరొకసారి వారిని కలుస్తానని తెలిపారు.

Last Updated :Nov 11, 2022, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.