ETV Bharat / international

'అరుణాచల్ ​ప్రదేశ్​ మాదే.. అందుకే కొత్త పేర్లు'.. చైనా కవ్వింపు

author img

By

Published : Apr 5, 2023, 11:36 AM IST

Updated : Apr 5, 2023, 12:02 PM IST

భారత్​పై మరోసారి చైనా అక్కసు వెళ్లగక్కింది. అరుణాచల్ ​ప్రదేశ్​.. తమ దేశంలోని భూభాగమేనని పేర్కొంది. అందుకే 11 అరుణాచల్​లోని 11 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి తెలిపారు.

china renames 11 places in arunachal pradesh
china renames 11 places in arunachal pradesh

అరుణాచల్ ​ప్రదేశ్​పై చైనా మరోసారి తన దుర్నీతిని బయటపెట్టింది. అరుణాచల్ ​ప్రదేశ్​.. చైనాలో అంతర్భాగమని పేర్కొంది. తమ భూభాగంలోనే అరుణాచల్​ ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. అందుకే అరుణాచల్​లోని 11 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు పెట్టిందని ఆమె చెప్పారు.
'జాంగ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్) చైనా భూభాగంలో ఉంది. జాంగ్నాన్​పై సార్వభౌమాధికారం చైనాదే. స్టేట్ కౌన్సిల్ భౌగోళిక నిబంధనల ప్రకారమే అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టాం.' అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. భారత్​లోని అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రదేశాలకు చైనా పేర్లు మార్చడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు శ్వేతసౌధం స్పష్టం చేసింది. అరుణాచల్ ​ప్రదేశ్​లో భారత్​లో అంతర్భాగమని అమెరికా​ గుర్తించిందని వెల్లడించింది.

అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్..
అరుణాచల్​ప్రదేశ్​లోని 11 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు పెట్టడంపై మంగళవారం.. భారత్​ తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెట్టినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులేమీ మారవని స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడటం చైనాకు కొత్త కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేసింది.

'చైనా ఇలా పేర్లు మార్చడం మొదటి సారి కాదు.. ఇలాంటి చర్యలను తిరస్కరిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారత్​లో అంతర్భాగం. దేశంతో అరుణాచల్​ ప్రదేశ్​కు విడదీయరాని బంధం ఉంది. తమ భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెట్టినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితులేమీ మారవు' అని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు.

కాంగ్రెస్ విమర్శలు..
చైనా పేర్ల మార్పు వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం ఫలితమే ఇదంతా అంటూ విమర్శించింది. చైనా చర్యలపై ప్రధాని మోదీ మౌనం, గల్వాన్ ఘర్షణపై ఆ దేశానికి క్లీన్ చిట్ ఇవ్వడం తగదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అరుణాచల్​ ప్రదేశ్ ఎప్పటికీ​ భారత్​లో అంతర్భాగమే అని ఖర్గే తెలిపారు.

ముచ్చటగా మూడోసారి..
2017లో జరిగిన ఢోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా తొలిసారి అరుణాచల్‌ప్రదేశ్‌లోని 6 ప్రాంతాలకు నామకరణం చేసింది. ఆ తర్వాత 2021లో ఏకంగా 15 ప్రాంతాలకు తమ పేర్లు పెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ 11 ప్రాంతాలకు చైనా పౌరవ్యవహారాల శాఖ పేర్లు పెట్టింది.

Last Updated : Apr 5, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.