ETV Bharat / international

తుర్కియే, సిరియాల్లో మృత్యుకేళి.. భూకంపాలకు 6,200 మందికి పైగా బలి

author img

By

Published : Feb 7, 2023, 6:34 AM IST

Updated : Feb 7, 2023, 10:55 PM IST

వరుస భూకంపాల ధాటికి ధాటికి తుర్కియే, సిరియా వణికిపోయాయి. ఈ రెండు దేశాల్లో కలిపి 6,200 మందికి పైగా దుర్మరణం చెందారు. వేల మందికి గాయాలయ్యాయి. అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇంకా శిథిలాల కిందే వందల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు, తుర్కియేకు భారత్‌ అండగా నిలిచింది. సహాయ సామగ్రి, సిబ్బందిని ఆ దేశానికి పంపింది.

turkey syria earthquake map
syria earthquake 2023

Turkey Syria Earthquake 2023: యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ తుర్కియే, సిరియాల్లో ఘోర ప్రకృతి విలయం చోటుచేసుకుంది. ఆగ్నేయ తుర్కియే, ఉత్తర సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి తుర్కియే, సిరియా సరిహద్దుకు ఇరువైపులా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క తుర్కియేలోనే 3 వేలకు పైగా ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. సిరియాలోని అలెప్పో, హామా సహా పలు నగరాల్లోనూ నివాసగృహాలు నేలమట్టమయ్యాయి. కొన్ని క్షణాల్లోనే శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి. మొత్తంగా ఈ విలయం రెండు దేశాల్లో కలిపి ఏకంగా 6,200 మందికిపైగా ప్రాణాలను బలి తీసుకుంది. శిథిలాల కింద ఇప్పటికీ వందల మంది చిక్కుకొని ఉన్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తుర్కియేలోని గాజియాన్‌తెప్‌ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత దాదాపు 50 శక్తిమంతమైన ప్రకంపనలు రెండు దేశాలనూ వణికించాయి. ఆ ప్రకంపనల్లో ఒకదాని తీవ్రత భూకంప లేఖినిపై ఏకంగా 7.5గా నమోదైంది.

.

నిండిపోయిన ఆసుపత్రులు
రెండు దేశాల్లోనూ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు హుటాహుటిన సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించారు. కాంక్రీటు కుప్పలు, ఇనుపచువ్వల కింద నలిగిపోయినవారి కోసం అన్వేషణ సాగించారు. కొన్నిచోట్ల శిథిలాల అడుగు నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేయడం వినిపించింది. క్షతగాత్రుల చేరికలతో స్థానికంగా ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. వారి హాహాకారాలతో పరిస్థితులు దయనీయంగా కనిపించాయి. అంతకుముందు- భూకంప తీవ్రతకు భవనాలు ఊగడంతో కొన్ని నగరాల్లో జనం రోడ్లపై బిక్కుబిక్కుమంటూ గడిపారు.

.

తుర్కియేలో కల్లోలం
భూకంప తీవ్రతకు తుర్కియేవ్యాప్తంగా 10 ప్రావిన్సుల్లో 1,600 మందికిపైగా మృత్యువాతపడ్డారు. సుమారు 11,000 మంది గాయపడ్డారు. 2,470 మందిని శిథిలాల నుంచి సహాయక సిబ్బంది రక్షించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి వెళ్లిపోవడానికి జనమంతా ఒకేసారి ప్రయత్నించడంతో.. భారీఎత్తున ట్రాఫిక్‌ జామ్‌లు తలెత్తాయి. ఫలితంగా సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రయాణాలు చేయొద్దంటూ స్థానికులకు అధికారులు విన్నవించారు. దియార్బకీర్‌ నగరంలో సహాయక సిబ్బంది, పౌరులు ఓ పర్వతం వెంబడి మానవహారంగా ఏర్పడి శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. ఇళ్లు కూలిపోయి, శీతల వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ ఉన్న అనేక మంది తాత్కాలికంగా మసీదుల్లో ఆశ్రయం పొందుతున్నారు. భూకంపం కారణంగా గాజియాన్‌తెప్‌ నగరం నడిబొడ్డున కొండపై ఉన్న చారిత్రక కోట సహా అనేక పురాతన కట్టడాలు దెబ్బతిన్నాయి. గడియారపు స్తంభాలు నేలకూలాయి. గాజియాన్‌తెప్‌, కహ్రామన్మారస్‌ ప్రావిన్సుల్లోనే దాదాపు 900 భవనాలు ధ్వంసమయ్యాయి.

.

సిరియా రక్తకన్నీరు
ఏళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాకు తాజా భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దేశంలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల మంది నివసిస్తున్నారు. ఆ ప్రాంతాలనూ తాజాగా భూకంపం కుదిపేసింది. ఆయాచోట్ల ఇప్పటికే బాంబు పేలుళ్ల కారణంగా దెబ్బతిన్న భవనాలు.. తాజాగా విపత్తు ధాటికి తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భూకంప ప్రకోపానికి సిరియాలో ప్రభుత్వ పాలనలోని ప్రాంతాల్లో 539 మంది దుర్మరణం పాలయ్యారు. 1,300 మందికిపైగా గాయాలపాలయ్యారు. తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాల్లో మరో 380 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న అజ్మారిన్‌ పట్టణంలో ఓ ఆసుపత్రి వద్ద అనేక మంది చిన్నారుల మృతదేహాలు దుప్పట్లతో కప్పి ఉంచిన హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి.

.

గంటల వ్యవధిలో మరో 2 భూకంపాలు
తొలి భూకంపం వచ్చిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే.. తుర్కియే, సిరియాలను సోమవారం మరో రెండు శక్తిమంతమైన భూకంపాలు వణికించాయి. రెండో భూకంప (మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో వచ్చింది) తీవ్రత రిక్టరు స్కేలుపై 7.6గా నమోదైంది. తొలి భూకంప కేంద్రానికి సమీపంలోనే.. తుర్కియేలోని ఎకినజు పట్టణంలో రెండో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో 6.0 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. ఇంకా వందల కొద్దీ భూ ప్రకంపనలు సిరియా, తుర్కియేలను కుదిపేసే ముప్పుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యధరా సముద్రంలోని ద్వీపదేశం సైప్రస్‌ సహా లెబనాన్‌ వంటి అనేక దేశాల్లో ఇప్పటికే భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది.

.

ప్రపంచ దేశాల ఆపన్నహస్తం
తుర్కియే, సిరియాలకు ఆపన్నహస్తం అందించేందుకు దాదాపు 45 దేశాలు ముందుకొచ్చాయి. సహాయక చర్యల కోసం గాలింపు బృందాలను, వైద్య సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలో భారత్‌, అమెరికా, రష్యా, జర్మనీ, తైవాన్‌ తదితర దేశాలతో పాటు నాటో, ఐరోపా సంఘం కూడా ఉన్నాయి.

.

అండగా ఉంటామన్న మోదీ
తుర్కియే, సిరియాల్లో భూకంప బీభత్సంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు దేశాలకూ అన్ని విధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న తుర్కియేకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సహాయక బృందాలతో పాటు వైద్యబృందాలు, సహాయక సామగ్రిని భారత్‌ పంపించనుంది. ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్‌స్క్వాడ్‌లు కూడా అందులో ఉండనున్నాయి. ప్రధాని మోదీ సూచన మేరకు.. ఆయన ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

.

భూకంప కేంద్రం

.
Last Updated :Feb 7, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.