ETV Bharat / international

'వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్యవివాహాలు.. అదే కారణం!'

author img

By

Published : Jul 2, 2022, 8:55 AM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి 18 ఏళ్లలోపే వివాహం జరుగుతున్నట్లు సంచలన విషయాలు వెల్లడించింటి ది లాన్సెట్​ జర్నల్​. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి బాల్య వివాహాలు జరగనున్నట్లు అంచనా వేసింది. దానికి కరోనాతో పాటు పలు అంశాలను కారణాలుగా పేర్కొంది.

child marriages
బాల్యవివాహాలు.

రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి బాల్య వివాహాలు జరగనున్నట్లు 'ది లాన్సెట్‌' జర్నల్‌ అంచనా వేసింది. కొవిడ్‌ కారణంగా విద్యావ్యవస్థలో వచ్చిన అలజడి, పెరిగిపోతున్న పేదరికమే అందుకు ప్రధాన కారణాలని తన తాజా సంపాదకీయంలో పేర్కొంది. "ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురు మహిళల్లో ఒకరికి 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది. ఇది వారి ఆరోగ్యం, బాగోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బాల్య వివాహాల వల్ల- యుక్తవయస్సులో గర్భధారణ, హెచ్‌ఐవీ బారినపడటం, భాగస్వామి చేతిలో హింసకు గురవడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి రాకతో ప్రపంచవ్యాప్తంగా చదువులు చతికిలపడ్డాయి. పేదరికం పెరిగిపోయింది. ఫలితంగా వచ్చే దశాబ్ద కాలంలో కోటి మంది బాలికలు.. బాల్యంలోనే వివాహ ఛట్రంలో ఇరుక్కుపోయే ముప్పుంది. ఏటా 1.2 కోట్ల మంది బాల్యంలోనే వివాహ వ్యవస్థలోకి అడుగుపెడుతున్నారు. నార్త్‌వెస్ట్‌ సెంట్రల్‌ ఆఫ్రికా, దక్షిణాసియా, దక్షిణ అమెరికాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి." అని సంపాదకీయంలో 'ది లాన్సెట్‌' పేర్కొంది.

  • నైగర్‌లో 76% మంది, బంగ్లాదేశ్‌లో 59% మంది, బ్రెజిల్‌లో 36% మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నాయి.
  • 2000-18 మధ్య కాలంలో అమెరికాలో దాదాపు 3 లక్షల బాల్య వివాహాలు జరిగాయి.
  • ఇలాంటి పెళ్లిళ్లను అరికట్టాలంటే.. వివాహ వయసును పెంచితే సరిపోదు. ఆడపిల్లలకు నగదో, ఇంకేదైనా ప్రోత్సాహకమో అందిస్తూ బడులకు ఆకర్షించాలి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా కార్మిక విపణిని విస్తరించాలి.
  • ఆడపిల్లలకు జీవనోపాధి పొందే నైపుణ్యాలు నేర్పాలి. చదువు, ఆర్థిక సాధికారత, నచ్చిన వ్యక్తిని ఎంచుకొనే స్వేచ్ఛ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి.

ఇదీ చూడండి: నేర విచారణకు మస్తిష్క తరంగాల విశ్లేషణ.. త్వరలోనే సరికొత్త సాంకేతికత!

‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.