ETV Bharat / international

US Omicron death: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

author img

By

Published : Dec 21, 2021, 8:54 AM IST

Updated : Dec 21, 2021, 9:54 AM IST

US first Omicron death: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సస్​కు చెందిన ఓ బాధితుడు మరణించినట్లు స్థానిక యంత్రాంగం వెల్లడించింది. మరోవైపు, దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్​కు సంబంధించినవే ఉన్నాయని సీడీసీ వెల్లడించింది. న్యూయార్క్​లో నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ వాటా 90 శాతంగా ఉందని పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి వారం రోజుల్లోనే ఆరు రెట్లు పెరిగిందని తెలిపింది.

US OMICRON CASES
Omicron cases in US

US first Omicron death: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సస్​కు చెందిన ఓ బాధితుడు ఒమిక్రాన్ సోకి మృతి చెందినట్లు స్థానిక యంత్రాంగం ప్రకటించింది. బాధితుడు టీకాలు తీసుకోలేదని తెలిపింది. పలు వైద్య సమస్యలు కూడా బాధితుడికి ఉన్నాయని వెల్లడించింది. మృతుడి వయసు యాభైలలో ఉందని స్థానిక కౌంటీ జడ్జి లీనా హిడాల్గో తెలిపారు.

Omicron US cases: అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం ఒమిక్రాన్ వేరియంట్​వే ఉంటున్నాయి. గడిచిన వారంలో నమోదైన కరోనా కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ బారినపడ్డవారేనని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఒమిక్రాన్ వాటా వారం రోజుల్లోనే ఆరు రెట్లు పెరిగిందని తెలిపింది. ఈ కాలంలో 6.5 లక్షల ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయని వివరించింది.

న్యూయార్క్​లో నమోదైన కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్​ వేరియంట్ కేసులే ఉన్నాయి. జూన్ తర్వాతి నుంచి అమెరికాలో డెల్టా వేరియంట్ తీవ్రంగా వ్యాపిస్తోంది. నవంబర్​ వరకు ఈ వేరియంట్ కేసులే అధికంగా ఉన్నాయి. బయటపడిన మొత్తం కేసుల్లో 99.5 శాతం డెల్టా వేరియంట్​వే ఉన్నాయని సీడీసీ డేటా వెల్లడిస్తోంది.

"అమెరికాలోనూ ఒమిక్రాన్ గణాంకాలు ఇతర దేశాల్లో మాదిరిగానే నమోదవుతున్నాయి. ఇది తీవ్రంగానే ఉన్నాయి. కానీ ఇది ఆశ్చర్యం కలిగించలేదు. బయట తిరిగే వ్యక్తుల్లో చాలా మందికి ఒమిక్రాన్ సోకే అవకాసం ఉంది. దీన్ని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం ముఖ్యం."

-డాక్టర్ అమేశ్ అడల్జా, జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ స్కాలర్

ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయని, స్వల్ప వ్యవధిలోనే ఇది జరగడం ఆందోళనకరమని అమెరికా స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్​లేషనల్ ఇన్​స్టిట్యూట్ హెడ్ డాక్టర్ ఎరిక్ టోపోల్ పేర్కొన్నారు. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టమని అన్నారు. ఆస్పత్రుల్లో చేరికలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

ఇదీ చదవండి: 'ఒమిక్రాన్ తీవ్రత.. డెల్టా కంటే తక్కువే అని చెప్పలేం!'

Last Updated : Dec 21, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.