ETV Bharat / entertainment

ప్రముఖ సింగర్​ వాణీ జయరాం ఇకలేరు

author img

By

Published : Feb 4, 2023, 2:40 PM IST

Updated : Feb 4, 2023, 2:59 PM IST

Veteran singer Vani Jayaram passes away
ప్రముఖ సింగర్​ వాణీజయరాం అనుమానస్పద మృతి

14:35 February 04

ప్రముఖ సింగర్​ వాణీ జయరాం

క్లాసైనా.. క్లాసికలైనా.. జానపదమైనా.. జాజ్‌బీటైనా.. వాణీ జయరాం గళంలో పడితే ఏ పాటైనా అపురూపమైన ఆణిముత్యంలా జాలువారాల్సిందే. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని ఓలలాడిస్తున్న ఆ సంగీత తరంగిణికి.. అనంత లోకాలకు తరలివెళ్లారు. ఆమె స్వరం మూగబోయింది. ఇండస్ట్రీలో ఆమె గొంతు ఇక వినపడదు. ఎందుకంటే శనివారం ఆమె తమ నివాసంలో కన్నుమూశారు. కాగా, ఆమె తన కెరీర్​లో.. తమిళం​, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠి, బెంగాలి, భోజ్​పురి, తులు, ఒరియా భాషల్లో దాదాపు 10 వేల పాటలు పాడి సంగీత ప్రియుల్ని అలరించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మ భూషణ్‌ పురస్కారం కూడా ప్రకటించింది.

ఐదేళ్ల వయసులోనే.. 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో జన్మించారు వాణీజయరాం. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. 'మీ పాప భవిష్యత్తులో సుమర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టమ'ని సూచించారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదట. ఐదేళ్ల వయసులో కడలూరు శ్రీనివాస అయ్యంగార్‌ అనే విద్వాంసుని దగ్గర తొలిసారి సంగీతంలో ఓనమాలు దిద్దుకున్న ఆమె.. ఆ తర్వాత టి.ఆర్‌.బాలసుబ్రమణియన్‌, త్రివేండ్రం ఆర్‌.ఎస్‌.మణి లాంటి సంగీతజ్ఞుల శిక్షణలో మరింత ఆరితేరింది. పదేళ్ల వయసులో తొలిసారి ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని అందుకున్న వాణీ.. అక్కడి నుంచే మొదటిసారి తన అమృత స్వరాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించారు. ఇక అక్కణ్నుంచి రేడియోలో వరుసగా నాటకాలు వేస్తుండటం.. కవితలు చదవడం.. పాడటం.. దాదాపు పదేళ్ల పాటు నిరంతరం అదే ఆమె వ్యాపకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆ చిన్న వయసులోనే స్కూల్లో ఓ సెలబ్రిటీగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె మనసు సినిమా పాటల వైపు మళ్లింది. అయితే శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు ఆలపించడాన్ని అవమానంగా భావించేది వాణీజయరాం కుటుంబం. అందుకే రేడియోలో వచ్చే సినిమా పాటల్ని ఎవరికీ వినిపించకుండా తక్కువ సౌండ్‌ పెట్టుకొని కంఠతా పట్టేవారు వాణీ. అలా క్రమంగా సినిమాల్లో ఎలాగైనా పాటలు పాడాలని బలంగా నిర్ణయించుకున్నారామె. పెళ్లి తర్వాత భర్త జయరాం ప్రోత్సాహంతో కర్ణాటిక్‌, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె.. 1969లో బాంబేలో తొలి కచేరి ఇచ్చారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

కొత్తగా పాడాలంటే ఆమెనే..! ఆమె గళం నచ్చి ఎన్నో సంస్థలు ఆమెను కచేరీలకు ఆహ్వానించేవి. ఇలా ఓ కచేరీ చేస్తున్న సందర్భంలోనే సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్‌ కంటపడ్డారు వాణీజయరాం. ఆయనకు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్‌కు పరిచయం చేశారు. అనంతరం 1970లో 'గుడ్డీ' చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశమిచ్చారు. అందులో ఆమె పాడిన 'బోలే రే' పాట అప్పట్లో సూపర్‌ హిట్టయ్యింది. దానికి తాన్‌సేన్‌తో పాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ పాటల ప్రయాణం.. ఆ తర్వాత ఓ ప్రవాహంలా కొనసాగింది. వాణీ గళాన్ని తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఎస్‌.పి.కోదండపాణి. 'అభిమానవంతుడు' అనే చిత్రంలో 'ఎప్పటివలె కాదురా స్వామి' అనే పాటను వాణీజయరాంతో పాడించారు ఆయన. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బిజీ గాయనిగా మారిపోయారు. కె.బాలచందర్‌ తీసిన 'అపూర్వ రాగంగళ్‌' చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అందులో ఆమె పాడిన పాటలకు గానూ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో 'శంకరాభరణం' సినిమాలోని పాటలకు గానూ రెండోసారి, 'స్వాతికిరణం'లోని 'ఆనతి నియ్యరా హరా'.. పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 'తెలిమంచు కరిగింది', 'ఎన్నెన్నో జన్మల బంధం', 'ఒక బృందావనం'.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గళం నుంచి జాలువారిన ప్రతి పాటా సినీ సంగీత ప్రియుల్ని మురిపించింది. అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలన్నా.. కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణీతోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు. వాణీజయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 10వేలకు పైగా పాటలు ఆలపించారు. తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరాం అందించిన ప్రోత్సహమే కారణమంటారు వాణీ. తమకు పిల్లలు లేకున్నా.. ఆ లోటును సంగీతమే తీర్చిందని సగర్వంగా చెబుతుంటారామె. వాణీ భర్త జయరాం 2018లో కన్నుమూశారు.


ఇదీ చూడండి: టాలీవుడ్​లో మరో విషాదం.. మూడు రోజుల్లో ముగ్గురు..

Last Updated : Feb 4, 2023, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.