ETV Bharat / entertainment

స్టైలిష్​ ఏజెంట్​గా వరుణ్​తేజ్​.. దర్శకుడు ఎవరంటే?

author img

By

Published : Jul 6, 2022, 7:45 AM IST

హీరో వరుణ్​తేజ్​.. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ భిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గూఢచారి పాత్ర కోసం ఆయన ప్రస్తుతం తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు. దీంతో పాటు ఇంకా పలు సినిమా సంగతులు ఉన్నాయి. అవేంటంటే..

Varun Tej as Agent in Praveen sattaru movie
స్టైలిష్​ ఏజెంట్​గా వరుణ్​తేజ్

Varuntej Praveen sattaru movie: ఇటీవలే 'ఎఫ్‌3'తో నవ్వులు పూయించారు మెగాహీరో వరుణ్‌ తేజ్‌. ఇప్పుడు కొత్త సినిమా కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. పూర్తిగా లండన్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో వరుణ్‌ ఓ ఇంటర్నేషనల్‌ ఏజెంట్‌గా స్టైలిష్‌ అవతారంలో కనిపించనున్నారని సమాచారం. ఈ గూఢచారి పాత్ర కోసం ఆయన ప్రస్తుతం తన లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నారు. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రమిది. స్క్రిప్ట్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలో చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది.

క్రైమ్​ కామెడీ.. నరేష్‌ అగస్త్య హీరోగా వీరభద్రమ్‌ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నబీ షేక్‌, తూము నర్సింహా పటేల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా కోసం శ్వేత అవస్తిని కథానాయికగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. "విభిన్నమైన క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈనెలలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది" అని నిర్మాతలు తెలిపారు.

'కొండవీడు'లో ఏం జరిగింది?.. శ్వేతా వర్మ, ప్రతాప్‌ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్‌, నవీన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కొండవీడు'. సిద్ధార్థ్‌ శ్రీ తెరకెక్కించారు. ప్రతాప్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఈనెల 8న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటి శ్వేతా వర్మ మాట్లాడుతూ.. "కథా బలమున్న చిత్రమిది. కొవిడ్‌ టైమ్‌లో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అంది. ‘‘అటవీ నేపథ్యంలో సాగే సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించాం. ఫైట్స్‌, పాటల విషయంలో ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు" అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ.. "దర్శకుడు మంచి కథ రాశారు. శ్వేతాతో పాటు మిగిలిన నటీనటులు చక్కగా నటించారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది" అన్నారు.

కనువిప్పు కలిగించే.. 'ధర్మచక్రం'.. సంకేత్‌ తిరుమనీడి, మోనిక చౌహాన్‌ నాయికానాయకులుగా.. పద్మనారాయణ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ధర్మచక్రం'. నాగ్‌ ముంత దర్శకుడు. పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి వరుణ్‌ క్లాప్‌ కొట్టగా, రాజశేఖర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎ.శ్రీధర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్‌ ముంత మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు రోజూ చూస్తున్నాం. వీటిని అరికట్టేలా, అమ్మాయిలకు స్వీయ రక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో కథనాయిక ద్విపాత్రాభినయం చేస్తోంది. సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’ అన్నారు. నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ 'సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలే ఇందులో కథాంశం' అన్నారు. ఈ సినిమాకి సంగీతం: ప్రణయ్‌ రాజపుటి, ఛాయాగ్రాహకుడు: ఎం.ఆనంద్‌.

ఇదీ చూడండి: ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు ఇకలేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.