ప్రముఖ నటుడు శరత్​బాబు కన్నుమూత

author img

By

Published : May 22, 2023, 2:39 PM IST

Updated : May 22, 2023, 4:59 PM IST

Tollywood Senior actor Sarath Babu died

తెలుగులో​ ఎన్నో చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శరత్‌ బాబు(71) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

శరత్కాల చంద్రుడిలా సమ్మోహనుడు.. సగటు చిత్రాల కథానాయకుడు.. విలక్షణత, విశిష్టతల కలబోసిన నటుడు.. ఆయనే ఆముదాలవలస అందగాడు శరత్‌బాబు(71). టాలీవుడ్​ ఎన్నో చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్‌) కావడం వల్ల కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతిని ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శరత్‌బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన లేని లోటు సినీ పరిశ్రమకు, అభిమానులకు ఎప్పటికీ తీరదని అంటున్నారు.

ఫిల్మ్‌ఛాంబర్‌కు శరత్‌బాబు భౌతిక దేహం.. శరత్‌బాబు మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సంతాపం ప్రకటించింది. అభిమానుల సందర్శనార్థం ఆస్పత్రి నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఫిల్మి ఛాంబర్‌కు భౌతిక కాయాన్ని తరలించనున్నట్లు నిర్మాత మాదాల రవి పేర్కొన్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటలకు చెన్నై తరలిస్తామని అన్నారు.

అస్సలు అనుకోలేదు.. శరత్‌బాబు అనారోగ్యంగా ఉన్నారని తెలుసని చెప్పిన సీనియర్‌ నటుడు మురళీమోహన్‌.. శరత్​ ఇంత త్వరగా చనిపోతారనుకోలేదని అన్నారు. శరత్‌బాబు భౌతిక దేహాన్ని సందర్శించేందుకు ఆయన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలా సినిమాల్లోకి.. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు సుశీలాదేవిల కుమారుడే శరత్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఆయన.. అస‌లు సేరు సత్యం బాబు దీక్షితులు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు. తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ చిత్రాల్లోనూ న‌టించారాయన. మొత్తంగా కెరీర్​లో 220కు పైగా సినిమాలలో నటించారు. 1973లో న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా ఎనిమిది సార్లు నంది అవార్డులను ముద్దాడారు. 1973లో విడుదలైన 'రామరాజ్యం'తో సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'కన్నెవయసు', 'మూడుముళ్ల బంధం', 'సంసారం ఒక చదరంగం', 'సీతాకోక చిలుక', 'ఆపద్భాందవుడు', 'అన్నయ్య', 'ఇది కథ కాదు' లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. హీరోగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆడియన్స్​ను అలరించారు. తెలుగులో చివరిసారిగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటించారు. అలానే పలు టెలివిజన్ షోస్​లోనూ శరత్ బాబు కనిపించారు. సీరియల్స్‌లోనూ రాణించారు. ఈటీవీలో ప్రసారమైన 'అంతరంగాలు' ధారావాహిక ఆయన్ని బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. వాస్తవానికి సినిమాల్లో రాక ముందు శరత్​బాబు పోలీస్ ఆఫీస‌ర్(ఐపీఎస్‌) కావాల‌ని అనుకున్నారట. అయితే కంటి స‌మ‌స్య ఉండ‌టం వల్ల ఆ కోరిక నెర‌వేర‌లేదట. తండ్రి.. వ్యాపారాన్ని చూసుకోమ‌ని చెప్పినప్ప‌టికీ శరత్​బాబు సినీ రంగంపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్​ రజనీకాంత్​, యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ సహా పలువురు స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్​ చిత్రాలు కూడా చేశారు. అవి సూపర్​ హిట్​గా నిలిచాయి. ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికొస్తే.. మొదటగా 1974లో నటి రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1988లో ఆమెతో విడిపోయారు. 1990లో స్నేహా నంబియార్​ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ 2011లో ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు.

ఇదీ చూడండి: రాజ్‌-కోటి.. 200 సినిమాలకు మ్యూజిక్​.. కాలం కలిపిన స్నేహం విడిపోవడానికి కారణమిదే!

Last Updated :May 22, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.