ETV Bharat / entertainment

ఓటీటీలో సినిమాల రిలీజ్​పై నిర్మాతల ఏకాభిప్రాయం, త్వరలోనే షూటింగ్స్ షురూ

author img

By

Published : Aug 18, 2022, 7:10 PM IST

సినిమాలు ఓటీటీల్లో విడుదల చేసే విషయమై నిర్మాతలంతా ఓ నిర్ణయానికి వచ్చారని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్​రాజు తెలిపారు. ఇక నుంచి విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే షూటింగ్స్‌ మొదలు పెడదామని భావిస్తున్నామన్నారు.

cinema ott release dates
cinema ott release dates

ఓటీటీల్లో సినిమా విడుదల చేసే విషయమై నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి వచ్చామని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. గురువారం ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఇక నుంచి విడుదలయ్యే ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలో రావాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకూ అగ్రిమెంట్‌ పూర్తయిన వాటిని కూడా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న, చిత్రీకరణ జరుపుకొంటున్న సినిమాలన్నీ థియేటర్‌లో విడుదలైన 8 వారాల తర్వాతే, అంటే 50 నుంచి 60 రోజుల తర్వాతే ఓటీటీలో వస్తాయి. ఈ విషయంలో నిర్మాతలందరం ఏకాభిప్రాయానికి వచ్చాం. అలాగే థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధరలు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరాం. అందుకు వారు అంగీకరించారు. వీపీఎఫ్‌ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం ఎగ్జిబిటర్స్‌తో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటాం" అని దిల్‌రాజు తెలిపారు.

"ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ఒక్కోదాన్ని పరిష్కరించుకుంటూ త్వరలోనే షూటింగ్స్‌ మొదలు పెడదామని భావిస్తున్నాం. అలాగే నిర్మాణ వ్యయం తగ్గించేందుకు ఎలా వ్యవహరించాలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) తో ఒక అగ్రిమెంట్‌ చేసుకున్నాం. ఇదొక మంచి విజయం. నిర్మాతలు అడిగిన పాయింట్లకు 'మా' సానుకూలంగా స్పందించింది. దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులతోనూ చర్చలు కొనసాగుతున్నాయి. వృథా ఖర్చును ఎలా తగ్గించుకోవాలో వాళ్లతో చర్చిస్తున్నాం. మరో రెండు, మూడు రోజుల్లో అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఫెడరేషన్‌తో కూడా చర్చలు పూర్తయ్యాయి. ఒకట్రెండు సమస్యలున్నాయి. వాళ్లు అడుగుతున్న వేతనాలకు నిర్మాతలు కూడా దగ్గరగా వచ్చేశారు. తుది సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఈలోగా షూటింగ్స్‌ మొదలవుతాయన్న వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఎప్పుడు షూటింగ్స్‌ ప్రారంభమవుతాయో మళ్లీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెబుతాం. అన్నీ విషయాలను స్వయంగా మీడియాకు వెల్లడిస్తాం" అని దిల్​రాజు వివరించారు.

'బాలీవుడ్‌ గమనిస్తోంది'
"ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ తీసుకున్న నిర్ణయాలపై అనేక చర్చలు జరిగాయి. హిందీ చిత్ర పరిశ్రమ కూడా మనల్ని గమనిస్తోంది. షూటింగ్స్‌ నిలిపి ఏం చేస్తున్నారా? అన్నది వాళ్లు పరిశీలిస్తున్నారు. నిర్మాతలందరూ కలిసి ఏయే నిర్ణయాలు తీసుకున్నారని రోజూ అక్కడి నుంచి ఫోన్‌ చేసి మమ్మల్ని అడుగుతున్నారు. దక్షిణాదిలోని మిగతా పరిశ్రమలన్నీ మనం తీసుకున్న నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నాయి" అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.