ETV Bharat / entertainment

షూటింగ్స్​ బంద్​!.. ఆ 8 అంశాలపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం

author img

By

Published : Jul 26, 2022, 5:35 PM IST

Updated : Jul 26, 2022, 6:33 PM IST

నిర్మాతల మండలి కీలక నిర్ణయం
Telugu Film producer council meeting

17:31 July 26

Tollywood: ఆ ఎనిమిది అంశాలపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం

తెలుగు సినీ నిర్మాతల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్‌లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. అయితే, అనూహ్యంగా నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

  • భారీ బడ్జెట్‌ చిత్రాలను 10 వారాల తర్వాతే ఓటీటీ కి ఇవ్వాలి. పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిన చిత్రాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వవచ్చు. రూ.6కోట్లలోపు బడ్జెట్‌ చిత్రాలపై ఫెడరేషన్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకోవాలి.
  • సినిమా ప్రదర్శనకు వీపీఎఫ్‌ (వర్చువల్‌ ప్రింట్ ఫీజు) ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలి.
  • సినిమా టికెట్‌ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతిపాదించింది. నగరాలు, పట్టణాల్లో సాధారణ థియేటర్లు, సి-క్లాస్‌ సెంటర్లలో టికెట్‌ ధరలు రూ.100, రూ.70(జీఎస్టీతో కలిపి)గా ఉంచాలని ప్రతిపాదించారు. ఇక మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేలా ప్రతిపాదనలు చేశారు. మీడియం బడ్జెట్‌, మీడియం హీరో సినిమాలకు టికెట్‌ ధర నగరాలు/పట్టణాల్లో రూ.100 ప్లస్‌ జీఎస్టీ ఉండాలని, అదే సి-సెంటర్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉండాలని, మల్టీప్లెక్స్‌లో అత్యధికంగా రూ.150 ప్లస్‌ జీఎస్టీతో మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.
  • పని పరిస్థితులు-ధరలు: నిర్మాతల నిర్ణయం, ఆలోచనల మేరకు ఛాంబర్‌, కౌన్సిల్‌ దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.
  • ఫైటర్స్‌ యూనియన్‌- ఫెడరేషన్‌ సమస్యలు: ఛాంబర్‌, కౌన్సిల్‌లో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
  • మేనేజర్లు పాత్ర: నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ వ్యవస్థను రద్దు చేయాలి.
  • సమస్యలు: కచ్చితమైన సమయ పాలన అమలు చేయాలి. దీని వల్ల అదనపు రోజులు కాకుండా అనుకున్న సమయానికే షూటింగ్‌లు పూర్తవుతాయి. తమ సహాయకులకు వసతి, ఇతర సౌకర్యాలు కావాలని నటులెవరూ డిమాండ్‌ చేయటానికి వీల్లేదు. వాళ్ల పారితోషికం నుంచే సహాయకులకు చెల్లింపులు చేసుకోవాలి.
  • నిర్మాణ వ్యయం: రోజు రోజుకీ నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ప్రతి నిర్మాత ఛాంబర్‌, కౌన్సిల్‌ నియమ, నిబంధనలను పాటించాలి. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలితో చర్చించాకే సినిమా నిర్మాణ వ్యయాలు పెంచుకోవాలి.

అలానే తాజాగా అన్నపూర్ణా స్టూడియోలో ప్రొడ్యూసర్స్​ గిల్డ్‌ సమావేశం జరిగింది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలందరూ ఈ సమావేశానికి హాజరై సినీ ఇండస్ట్రీలోని వివిధ సమస్యలపై చర్చించారు. నిర్మాతల మండలి నిర్ణయాలు, బడ్జెట్ నష్టాలు, ఓటీటీలో విడుదలపై గంటపాటు చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానం చేశారు.

చిత్ర పరిశ్రమను సర్వీసింగ్‌ చేయాలి.. "ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపై చర్చించేందుకు నిర్మాతలందరూ ముందుకు రావటం లేదు. అడిగితే ‘షూటింగ్స్‌ ఉన్నాయి. కుదరడం లేదు’ అంటున్నారు. అందుకే మొత్తం షూటింగ్స్‌ ఆపేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఆ తర్వాత షూటింగ్స్‌ కొనసాగించాలనేది కొందరి అభిప్రాయం. కరోనా సమయంలో కొన్ని రోజుల పాటు చిత్రీకరణలు నిలిచిపోయాయి కదా! అలాగే ఇప్పుడు కూడా కొన్ని రోజులు తాత్కాలికంగా చిత్రీకరణలు నిలపివేసి, కేవలం చర్చలకే సమయం కేటాయించాలి. ఏడాదికొకసారి కర్మాగారాలు, వాహనాలకు ఏవిధంగానైతే సర్వీసింగ్‌ చేస్తారో అలాగే, చిత్ర పరిశ్రమకూ సర్వీసింగ్‌ జరగాలి. ఇండస్ట్రీలో ఉన్న ప్రధాన సమస్యల్లో ఓటీటీ కూడా ఒకటి. సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వటం వల్ల థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్ని రోజులకు ఓటీటీకి ఇవ్వాలనే దాన్ని ఒక స్పష్టత వస్తే బాగుంటుంది. అలాగే టికెట్‌ ధరలను క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదాని మొత్తం ప్రేక్షకుల మీద పడేసి రుద్ద కూడదు. సినిమాకో ధర పెట్టడం వల్ల థియేటర్‌కు వచ్చే వాళ్లు తికమక పడుతున్నారు. వీపీఎఫ్‌ ఛార్జీలు నెలకు రూ.50కోట్లు దాటుతున్నాయి. దీనిపై కూడా నిర్మాతలందరూ కలిసి చర్చించాలి. అందుకే కొన్ని రోజులు చిత్రీకరణలు నిలిపివేసి పూర్తిస్థాయి చర్చలు జరిపితే బాగుంటుందని భావిస్తున్నాం" చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదీ చూడండి: బాలయ్య క్రేజ్​.. బామ్మా మాజాకా​​.. విజిల్స్​, డ్యాన్స్​లతో ​రోడ్డుపై రచ్చ రచ్చ

Last Updated : Jul 26, 2022, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.