సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు కన్నుమూత
Published: Mar 9, 2023, 8:22 AM


సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటుడు కన్నుమూత
Published: Mar 9, 2023, 8:22 AM
బాలీవుడ్ నటుడు సతీశ్ కౌశిక్ తుది శ్వాస విడిచారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుకు గురై కన్నుమాశారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
హిందీ సినీ పరిశ్రమలో విషాధం చేసుకుంది. నటుడు, రచయిత,దర్శకుడైన సతీశ్ కౌశిక్ గురువారం కన్నుమూశారు. తన 66వ ఏట గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ వార్తను సతీశ్ కౌశిక్‌కు అత్యంత సన్నిహితుడైన అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
"మరణం అనేది ఈ ప్రపంచంలోని అంతిమ సత్యం అని నాకు తెలుసు, కానీ నేను బతికున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదు. 45 ఏళ్ల స్నేహానికి ఇంత హఠాత్తుగా ఫుల్ స్టాప్!! నువ్వు లేకుండా జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు సతీశ్! ఓం శాంతి!" అంటూ అనుపమ్ ఖేర్ భావోద్వేగానికి లోనయ్యారు. దిల్లీలోని ఓ స్నేహితుని ఇంట్లో ఉన్నప్పుడు తనకు నలతగా ఉందని తెలిపిన ఆయన ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మరణించారని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఆయన మృతి పట్ల అభిమానులు, ప్రముఖలు సంతాపం తెలుపుతున్నారు.
-
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
సతీశ్ కౌశిక్ ఏప్రిల్ 13, 1956న హరియాణాలో జన్మించారు. 'మిస్టర్ ఇండియా' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించారు. 'రూప్ కీ రాణి చోరోన్ కా రాజా'తో దర్శకునిగా మారి మెగాఫోన్ పట్టారు. 'తేరే నామ్', 'హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై' లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా, హాస్య నటుడిగా బాలీవుడ్లో సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. 'రామ్ లఖన్', 'సాజన్ చలే ససురాల్' సినిమాలకు గాను ఆయన ఉత్తమ హాస్యనటుడిగా ఫిల్మ్ ఫేర్‌ను అందుకున్నారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థి అయిన కౌశిక్ 'జానే భీ దో యారోన్', 'మిస్టర్ ఇండియా', 'దీవానా మస్తానా' 'ఉడ్తా పంజాబ్' లాంటి చిత్రాల్లోని తన పాత్రలతో బాగా పేరొందారు. ఓ హాస్యనటుడిగా.. దర్శకుడిగా బాలీవుడ్లో తనదంటూ ఓ ముద్ర వేశారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్.. సతీశ్ కౌశిక్‌కు అత్యంత సన్నిహితులు. వీరిద్దరూ కలిసి కరోల్ బాఘ్ అనే ఓ ప్రొడక్షన్ హౌస్‌ను కూడా స్టార్ట్ చేశారు. దాని ద్వారా అనుపమ్ నిర్మాతగా.. సతీశ్ దర్శకత్వంలో పలు సినిమాలు రూపొందాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా 'తేరే సంగ్'.
