ETV Bharat / entertainment

'అవును అతడి వల్లే డైరెక్టర్‌ అయ్యా'.. ఆ కామెంట్స్‌పై నాని సిస్టర్​ ఎమోషనల్‌ పోస్ట్

author img

By

Published : Dec 12, 2022, 9:31 PM IST

నాని సోదరి దీప్తి ఇటీవల 'మీట్‌ క్యూట్‌' అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నానిని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

nani sister
నాని సోదరి దీప్తి

Nani Sister Emotional Post : యువ కథానాయకుడు నాని సోదరి దీప్తి ఇటీవల మీట్‌ క్యూట్‌ అనే ఓ వెబ్‌సిరీస్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీనికి నానినే నిర్మాతగా వ్యవహరించారు. సోనీ లివ్‌ వేదికగా ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే దీప్తి, నానిలపై కొందరు విమర్శలు చేశారు. నానికి సోదరి కావడం వల్లే ఆమె చాలా సులభంగా దర్శకురాలు అయిందని, నానికి కూడా బంధుప్రీతి ఉందని నెపోటిజంను సపోర్ట్‌ చేస్తున్నారని కామెంట్స్ చేశారు. వీటికి సమాధానం చెబుతూ తాజాగా దీప్తి తన సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

"ఒక అమ్మగా, ఇల్లాలుగా నేను నా బాధ్యతలను నిర్వర్తిస్తూ.. సమయం కుదిరినప్పుడు కథలు రాస్తుంటాను. నాని, నేను చిన్నప్పటి నుంచి మా భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నాం. వాటి కోసం కష్టపడ్డాం. కథలు రాయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మీట్‌ క్యూట్‌ కంటే ముందు నేను షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశాను. కొవిడ్‌ సమయంలో నా మానసిక ప్రశాంతత కోసం కొన్ని కథలు రాసుకున్న అవి నానికి పంపాను. తను నాలో టాలెంట్‌ని గుర్తించి నన్ను ప్రోత్సహించాడు. తనే నన్ను డైరెక్టర్‌ అయ్యేలా ప్రోత్సహించాడు. అవును, నాని వల్లే నేను దర్శకురాలిని అయ్యాను. అసలు ఈ సిరీస్‌ ఇంత బాగా రావడానికి, ఇంత విజయం సాధించడానికి నానినే ప్రధాన కారణం. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌ విజయాన్ని నాకంటే తనే ఎక్కువ సంతోషించాడు. నా జీవితంలో నాని ఒక భాగమైనందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. నేనే కాదు నాని ఎవరి జీవితాల్లో ఉన్నా వాళ్లు లక్కీనే.." అని నానితో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ దీప్తి సుదీర్ఘ లేఖ రాసింది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది.

ఇదీ 'మీట్‌క్యూట్' కథ (లు): ఐదు కథల సమాహారంగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ఇది. దేనికదే ప్రత్యేకం. ఒకదానితో మరోదానికి సంబంధం ఉండదు. స్వాతి (వర్ష బొల్లమ్మ) తన అమ్మ చెప్పిందని పెళ్లి చూపుల్లో భాగంగా అభి (అశ్విని కుమార్‌ లక్ష్మికాంతన్‌)ని కలుస్తుంది. మాటల మధ్యలో అభి.. కావాలనే మ్యాట్రిమోనీ సైట్‌లో వివరాలు తప్పు ఇచ్చానని స్వాతితో చెబుతాడు. అభి అబద్ధం ఎందుకు చెప్పాడు? స్వాతి అతణ్ని క్షమిస్తుందా? అనేది తొలి ఎపిసోడ్‌ 'మీట్‌ ది బాయ్‌'.

సరోజ (రుహానీ శర్మ), మోహన్‌రావు (సత్యరాజ్‌) వీసా ఆఫీసులో కలుసుకుంటారు. ఆ పెద్దాయనకు సాయం చేసిన సరోజ తన కాపురంలో వచ్చిన కలహాల గురించి వివరిస్తుంది. తన అనుభవంతో మోహన్‌రావు.. సరోజ ఆలోచనను మార్చగలిగాడా? అనేది 'ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌' ఎపిసోడ్‌. భర్తకు దూరమై, ఆర్కిటెక్ట్‌గా పనిచేసే పూజ (ఆకాంక్షసింగ్‌).. సిద్ధు (దీక్షిత్‌ శెట్టి) అనే యువకుడికి దగ్గరవుతుంది. వీరి వ్యవహారం గురించి తెలుసుకున్న సిద్ధు తల్లి పద్మ (రోహిణి) ఏం చేసింది? అనేది 'ఇన్‌ లవ్‌' ఎపిసోడ్‌ కాన్సెప్ట్‌.

అమన్‌ (శివ కందుకూరి) వైద్యుడు. ఓ రాత్రి.. షాలిని (అదాశర్మ) అనే నటికి కారులో లిఫ్ట్‌ ఇచ్చి, తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆమె నటి అని తెలియని అమన్‌ తన ఇష్టాయిష్టాలు చెబుతాడు. మరి, షాలిని యాక్టర్‌ అనే విషయం అమన్‌కు తెలిసిందా, లేదా? అంటే 'స్టార్‌ స్ట్రక్‌' ఎపిసోడ్‌ చూడాల్సిందే. అజయ్‌ (గోవింద్‌ పద్మసూర్య) అనే వ్యక్తితో కిరణ్‌ (సునైన)కు బ్రేకప్‌ అవుతుంది. ఆ తర్వాత, అజయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న అంజన (సంచిత)ను కలిసి ఏం వివరించింది? అన్నది 'ఎక్స్‌ గాళ్‌ఫ్రెండ్‌'లో తెలుస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.