'కోబ్రా'కు కత్తిరింపులు.. ఓటీటీలోకి 'విక్రాంత్‌ రోణ'

author img

By

Published : Sep 1, 2022, 9:22 PM IST

Movie Updates

ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్​ నటించిన చిత్రం 'కోబ్రా' ఇటీవల విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్​ టాక్​ వచ్చినా.. ఎడిటింగ్​ మీద విమర్శలు వచ్చాయి. దీంతో చిత్ర బృందం సినిమాను 20 నిమిషాల మేర కత్తిరించింది. తమిళ నటుడు శివకార్తికేయన్, తెలుగు దర్శకుడు అనుదీప్​ కేవీ కాంబోలో వస్తున్న మూవీ 'ప్రిన్స్'. ఈ సినిమా మొదటి గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌. ఆతడు నటించిన పాన్​ ఇండియా చిత్రం 'విక్రాంత్‌ రోణ' ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

Chiyaan Vikram Cobra Latest News : ప్రముఖ నటుడు విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ 'కోబ్రా'. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఈ సినిమా విడుదలైంది. అయితే, కోబ్రా కథ బాగున్నప్పటికీ.. ఎడిటింగ్‌ సరిగ్గా జరగలేదని పలువురు సినీ ప్రియులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విక్రమ్‌ అభిమానులు, సినీ ప్రియుల నుంచి వస్తోన్న సూచనను చిత్రబృందం స్వీకరించింది. ఈ మేరకు 'కోబ్రా'లో 20 నిమిషాల ఫుటేజీని తొలగించింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం నుంచి అన్ని ప్రాంతాల్లో ఈ రీఎడిటెడ్‌ వెర్షన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. విక్రమ్‌ ఈ సినిమాలో సుమారు 10 గెటప్పుల్లో కనిపించారు. శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి కథానాయికలు.

'ప్రిన్స్‌' నుంచి మొదటి గీతం..: తమిళ నటుడు శివ కార్తికేయన్‌ హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు అనుదీప్‌ కె. వి. తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం 'ప్రిన్స్‌'. ఉక్రెయిన్‌ నటి మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా తొలి పాటని విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన 'బింబిలికి' అనే ఈ హుషారైన గీతాన్ని రామ్‌ మిర్యాల, రమ్య బెహర, సాహితి చాగంటి ఆలపించారు. తమన్‌ స్వరాలందించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలక పాత్రధారి. డబ్బింగ్‌ చిత్రాలు 'రెమో' 'డాక్టర్‌', 'కాలేజ్‌ డాన్‌'లతో శివ కార్తికేయన్‌ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే.

ఓటీటీలోకి 'విక్రాంత్‌ రోణ': కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్‌ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జులైలో థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల, కన్నడ వెర్షన్‌కు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ ఖరారవగా.. తాజాగా తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటన వెలువడింది. 'జీ5' వేదికగా ఈ నెల 2 నుంచి కన్నడ భాషలో స్ట్రీమింగ్‌ కానున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌ 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ఈ నెల 16 నుంచి అందుబాటులోకి రానుంది. అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వెలిన్‌, రవిశంకర్‌ గౌడ తదితరులు నటించి మెప్పించారు.

ఈ సినిమా కథేంటంటే?: కొమ‌ర‌ట్టు అనే ఊరిలో జ‌రిగే కథ ఇది. ఆ ఊరిలోని ఓ పాడుబ‌డ్డ ఇంట్లో ఓ బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడన్నది అక్కడి ప్రజ‌ల న‌మ్మకం. ఆ ఇంటి ఆవరణలో ఉన్న బావిలో ఓరోజు ఆ ఊరి ఇన్‌స్పెక్టర్‌ శవం దొరుకుతుంది. ఆ హత్య కేసు ఛేదించి, నేరస్థులను పట్టుకోవడం కోసం విక్రాంత్‌ రోణ (సుదీప్‌) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో అప్పటికే ప‌దుల సంఖ్యలో పిల్లలు హ‌త్యకు గురైన‌ట్లు తెలుసుకుంటాడు. మ‌రి వాళ్ల మ‌ర‌ణాల‌కు.. పోలీస్ హ‌త్యకు ఉన్న సంబంధమేమిటి? ఈ కేసుకు విక్రాంత్ వ్యక్తిగ‌త జీవితానికి ఉన్న లింకేంటి? అస‌లు ఆ ఊరిలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడు ఎవ‌రు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇవీ చదవండి: లైగర్​ ఫలితంతో పునరాలోచనలో పూరీ- విజయ్​.. ఈ సారి పక్కా స్కెచ్​తో..

నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు.. రెమ్యునరేషన్​ తగ్గించుకోకుండానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.