ETV Bharat / entertainment

CCL 2023: తమన్​ ధనాధన్​ ఇన్నింగ్స్​.. ఫైనల్​కు తెలుగు వారియర్స్

author img

By

Published : Mar 25, 2023, 6:28 AM IST

Updated : Mar 25, 2023, 6:34 AM IST

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ ఫైనల్​కు తెలుగు వారియర్స్​ దూసుకెళ్లింది. సెమీఫైనల్​లో కర్ణాటక బుల్డోజర్స్​పై ఆరు వికెట్ల తేడాతో అఖిల్​ సేన విజయం సాధించింది. మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​.. ధనాధన్‌ ఇన్నింగ్స్​ ఆడారు.

ccl 2023 telugu warriors enters into final
ccl 2023 telugu warriors enters into final

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్‌ క్రికెట్‌ పోటీలు శుక్రవారం.. విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో హోరీహోరీగా సాగాయి. రెండో సెమీఫైనల్‌లో తెలుగు వారియర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో తెలుగు వారియర్స్​ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్​కు దూసుకెళ్లింది. తెలుగు వారియర్స్‌కు అఖిల్‌ అక్కినేని సారథ్యం వహించారు. కర్ణాటక బుల్డోజర్స్‌కు ప్రదీప్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు.

తమన్​ ధనాధన్​ ఇన్నింగ్స్​..
రెండో సెమీఫైనల్​లో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్​లో పది ఓవరల్లో.. ఆరు వికెట్ల నష్టంతో 99 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన తెలుగు వారియర్స్​.. అదే ఆరు వికెట్ల నష్టంతో 95 పరుగులే చేసింది. దీంతో మూడు నాలుగు పరుగుల ఆధిక్యంతో సుదీప్​ సేన నిలిచింది. తెలుగు వారియర్స్‌ బౌలర్‌ సామ్రాట్‌ మొదటి ఇన్సింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్‌ కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్​లో కర్ణాటక టీమ్​.. 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు కొట్టింది. తెలుగు వారియర్స్‌ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్‌ చేసి 103 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేశారు. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్​కు దూసుకెళ్లారు. రెండో ఇన్నింగ్స్‌లో తమన్‌ (25 పరుగులు) సాధించి ధనాధన్‌ ఆటతో మ్యాచ్‌ను ముగించాడు.

ఉత్కంఠగా తొలి సెమీఫైనల్​..
అంతకు ముందు భోజ్‌పురి దబాంగ్స్‌, ముంబయి హీరోస్‌ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక బంతి.. ఐదు పరుగులు చేయాల్సి దశలో భోజ్‌పురి దబాంగ్స్‌ జట్టు బ్యాటర్‌ అస్గర్‌ఖాన్‌ సిక్స్‌ కొట్టి జట్టును గెలిపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ముంబయి హీరోస్‌ 171 పరుగులు చేయగా, భోజ్‌పురి దబాంగ్స్‌ జట్టు 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​లో భోజ్​పురి దబాంగ్స్​ విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్​ మ్యాచ్​లో తెలుగు వారియర్స్​, భోజపురి దబాంగ్స్‌ జట్లు తలపడతాయి.

కొత్త ఫార్మాట్‌లో సీసీఎల్‌
కొవిడ్‌ కారణంగా మూడేళ్లు వాయిదా పడిన సీసీఎల్‌.. రీలోడెడ్‌ పేరుతో ఈ ఏడాది సందడి చేస్తోంది. తెలుగు వారియర్స్‌, ముంబయి హీరోస్‌, చెన్నై రైనోస్‌, కర్ణాటక బుల్డోజర్స్‌, కేరళ స్ట్రైకర్స్‌, బెంగాల్‌ టైగర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌, పంజాబ్‌ దే షేర్స్‌.. ఇలా ఎనిమిది టీమ్‌లతో సెలబ్రిటీ లీగ్‌ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. తాజాగా సీసీఎల్‌ స్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇందూరి.. లీగ్​ గురించి మాట్లాడారు. "సెలబ్రిటీ క్రికెట్ లీగ్ -2023కి వచ్చిన స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ఈ సీజన్‌లో ప్రతి జట్టుకు 10 ఓవర్ల చొప్పున 2 ఇన్నింగ్స్‌తో కూడిన T20 ఫార్మాట్‌ నిర్వహించాం. దాంతో వారు మరింత వినోదాన్ని అందించారు. ఫైనల్స్‌లో అంతకు మించిన ఫన్‌ ఉంటుంది" అని అన్నారు. మరి ఈసారి విజేత ఎవరో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Last Updated : Mar 25, 2023, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.