ETV Bharat / entertainment

'ఛత్రపతి' ప్రభాస్​ తమ్ముడికి అరుదైన గౌరవం.. ఏకంగా కేన్స్​ ఫిల్మ్​లో బెస్ట్ యాక్టర్​గా..

author img

By

Published : Feb 23, 2023, 3:26 PM IST

ఖడ్గం, వర్షం, ఛత్రపతి వంటి సూపర్​ హిట్​ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు షఫీ.. ఆ తర్వాత పలు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన అడపా దడపా చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. తాజాగా ఆయనకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా కేన్స్ ఫిల్మ్​ ఫెస్టివల్​ అవార్డ్స్​కు బెస్ట్ యాక్టర్​గా నామినేషన్​ దక్కించుకున్నారు.

Actor Shafi Canes Film festival
నటుడు షఫీకి అరుదైన గౌరవం.. ఏకంగా కేన్స్​ ఫిల్మ్​కే..

ఖడ్గం, వర్షం, ఛత్రపతి వంటి సూపర్​ హిట్​ చిత్రాల్లో నటించి ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు షఫీ. కామెడీ విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఆడియెన్స్​కు చేరువైన ఈయన.. తన 20 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 50కుపైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో గుర్తిండిపోయే పాత్రలు చేసినప్పటికీ ఆయనకు ఇప్పటివరకు సరైనా బ్రేక్​ రాలేదనే చెప్పాలి. ఇప్పటికీ అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే ఆయన ఈ షార్ట్​ ఫిల్మ్​లో నటించి తన సత్తా ఏంటో నిరూపించారు.

తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్​గా నామినేషన్ అందుకున్నారు. '3.15 AM' అనే షార్ట్ ఫిల్మ్‌లో మధ్య వయస్కుడి పాత్ర పోషించిన ఆయనకు బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేషన్ దక్కింది. ఈ గౌరవం తనకు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

"ఇటువంటి అరుదైన గౌరవం నేను పొందడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ అమిత్ నన్ను సంప్రదించినప్పుడు చేయడానికి వెంటనే అంగీకరించారు. షార్ట్ ఫిల్మ్ అయినా సరే... ఇది మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్. అయితే ఈ ప్రయత్నాన్ని కేన్స్ గుర్తిస్తుందని అస్సలు ఊహించలేదు" అని షఫీ పేర్కొన్నారు.

సాధారణంగా ఇటువంటి అవార్డు కార్యక్రమాల్లో పెద్ద పెద్ద స్టార్స్​ మాత్రమే బెస్ట్ యాక్టర్​ విభాగంలో పోటీ పడటం చూస్తుంటాం. కానీ ఈ సారి నటుడు షఫీకి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేన్స్ ఫిల్మ్​ ఫెస్టివల్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వేడుకలో అర్హులైన, ప్రతిభావంతులైన నటులకు అవార్డులను ప్రదానం చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోనే నటుడు షఫీ నామినేషన్ అందుకోవడం విశేషం. దీంతో సినీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్​మీడియాలోనూ ఆయన్ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రఖ్యాత కేన్స్ ఫిలిమ్​ ఫెస్టివల్‌లో ఆయన ప్రతిభకు గుర్తింపు లభించిన నేపథ్యంలో ఆయనకు మరిన్ని సూపర్​ ఆఫర్స్ వస్తాయని ఆశిస్తున్నారు. ఇకపోతే ఈ '3.15 AM' షార్ట్ ఫిల్మ్ లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లోనూ పురస్కారాన్ని దక్కించుకుంది. మార్చి 16 నుంచి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ వేదికగా అట్టహాసంగా జరగనుంది.

ఇదీ చూడండి: Veera Simha Reddy : ఇవాళ సాయంత్రం రచ్చ ఆరంభం.. 25న అరాచకమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.