ETV Bharat / entertainment

భక్త కన్నప్పగా ప్రేక్షకుల జేజేలు.. మేనమామగా పల్నాటి పౌరుషం.. 'కృష్ణంరాజు'కే సొంతం

author img

By

Published : Sep 11, 2022, 6:48 AM IST

Updated : Sep 11, 2022, 9:07 AM IST

కృష్ణంరాజు..! తెలుగు తెర చూసిన ఏకైక రెబల్ స్టార్‌. మేనమామగా పల్నాటి పౌరుషం చూపాలన్నా బొబ్బిలి బ్రహ్మన్నగా రౌద్ర రసం ప్రదర్శించాలన్నా మొగల్తూరు రాజుగారికే చెల్లు. కెరీర్ ఆరంభంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలేసిన కృష్ణంరాజు తెలుగునాట భక్త కన్నప్పగా ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు. ఎన్టీఆర్​, ఏఎన్నార్​తో పాటు తన తరం హీరోల సినిమాల్లో విలన్‌గా, సైడ్ హీరోగా నటించిన కృష్ణంరాజు యువ కథనాయకులతోనూ కలిసి నటించారు. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించి నటించారు. రాజకీయాల్లోనూ.. తనదైన ముద్రవేసిన శ్రీ ఉప్పలపాటి కృష్ణంరాజు ఇకలేరన్న వార్త.. సినీ,రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

actor krishnam raju dead
actor krishnam raju dead

Actor Krishnam Raju Passed Away : తెలుగు సినీరంగంలో ఆయనో రెబెల్‌ స్టార్‌.... హీరోగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ తర్వాత కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలతో అలరించారు. వరసగా విలన్‌ చిత్రాలు చేసిన ఆయన కొద్ది కాలంలోనే మళ్లీ హీరోగా పుంజుకున్నారు. ఆయనే శ్రీ ఉప్పలపాటి చినవెంకట కృష్ణంరాజు.. ఇంటిపేరులోని శ్రీని పేరులోని చినవెంకట పదాలను తొలగించుకొని కృష్ణంరాజుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నత కుటుంబంలో పుట్టారు. చదువు పూర్తి కాగానే జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు.

సినీరంగంలో ఐదు దశాబ్దాలు..
ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో హైదరాబాదులో రాయల్‌ స్టూడియో మొదలుపెట్టారు. ఆ తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు చేరుకున్నారు. ప్రముక దర్శకుడు ప్రత్యగాత్మ చేయూతనందించగా ఐదు దశాబ్దాలు సినీరంగంలో ప్రయాణించారు. తెలుగు సినీరంగంలో ఎన్టీఆర్​, అక్కినేని తర్వాత రెండో తరం వచ్చిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. శోభన్‌బాబు, కృష్ణ వెండితెరకు పరిచయం అయినా కొన్నాళ్లకే 1966లో వచ్చిన చిలకా గోరింకా చిత్రంతో కృష్ణంరాజు.. వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలిచిత్రం ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో చాలా నిరాశ పడ్డారు. ఫ్లాప్‌తో ఆయనకు ఏమీ సంబంధం లేదని మిత్రులు, దర్శక నిర్మాతలు సర్దిచెప్పినా ఆయన సమాధాన పడలేదు. నటనను మెరుగుపరచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు. నటనలో రాటు దేలేందుకు ప్రముఖులు రాసిన పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు సీహెచ్​ నారాయణరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవరకు ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. ఇది ఆయనలోని నిబద్ధతను పరిశ్రమకు చాటింది. తర్వాత డొండీ నిర్మాణ సారథ్యంలో.. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా అలరించారు. ఆ చిత్రంలో విలన్‌ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుకున్నారు. అప్పటికే ప్రఖ్యాత విలన్‌ ఆర్‌ నాగేశ్వరరావు చనిపోవడంతో అంతా ఆయన్ను మరో ఆర్‌ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారన్నారు.

actor krishnam raju dead
కృష్ణంరాజు

'అవే కళ్లు' చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు..
'అవే కళ్లు' చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు.. తర్వాత వరుసగా 30 సినిమాల్లో విలన్‌ వేషాలే వేశారు. అయితే విలనిజంలో కూడా ప్రత్యేకత ఉంటేనే చేస్తానని కరాఖండిగా చేప్పేవారు. ఎన్టీఆర్​, ఏఎన్నార్​, శోభన్‌బాబు, కృష్ణ చిత్రాల్లో విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలు పోషించి యంగ్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. విలన్‌ వేషాల తర్వాత పలు చిత్రాల్లో హీరో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా లభించాయి ఆయనకు ఎన్టీఆర్​తో 'భలేమాస్టార్‌', 'బడిపంతులు', 'వాడేవీడు', 'పల్లెటూరి చిన్నోడు', 'మనుషుల్లో దేవుడు', 'మంచికి మరోపేరు', 'సతీసావిత్రి' చిత్రాల్లో నటించారు.

అక్కినేని కాంబినేషన్‌లో బుద్ధిమంతుడు, జైజవాన్‌, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఏఎన్నార్​ హీరోగా తెరకెక్కిన 'ఎస్పీ భయంకర్‌' చిత్రంలో సపోర్టింగ్‌ హీరోగా నటించారు. హీరో కృష్ణ కాంబినేషన్‌లో 17 చిత్రాల్లో హీరోగా నటించారు కృష్ణంరాజు. శోభన్‌బాబుతో బంగారు తల్లి, మానవుడు దానవుడు, జీవనతరంగాలు చిత్రాల్లో విలన్‌గా నటించారు. ఇద్దరు ఇద్దరే, కురుక్షేత్రం, రామబాణం, జీవితం చిత్రాల్లో సపోర్టింగ్‌గా నటించారు.

actor krishnam raju dead
కృష్ణంరాజు

ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇంటిదొంగలు చిత్రంతో కృష్ణంరాజు..మళ్లీ హీరోగా మారారు. అయితే ఆ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ అయినప్పటికీ ప్రత్యగాత్మతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకున్నారు. విలన్‌గా వెలుగొందుతున్న రోజుల్లోనే గోపికృష్ణా మూవీస్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మించారు. స్వంత బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం కృష్ణవేణి.. పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ చిత్రంతో ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా బయటి నిర్మాణ సంస్థల నుంచి హీరోగా అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయారు.

రికార్డులు బద్దలు కొట్టిన భక్త కన్నప్ప..
సొంత బ్యానర్‌ గోపికృష్ణా మూవీస్‌లో కృష్ణంరాజు నటించిన రెండో చిత్రం భక్తకన్నప్ప.. అప్పట్లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఆయన కేరీర్‌లోనే గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. చిత్రం విడుదల అయిన అన్నీ కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. క్లైమాక్స్‌లో భక్తకన్నప్ప కన్ను పెకిలించి శివునికి అర్పించే సన్నివేశానికి థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది. భక్తకన్నప్పగా కృష్ణంరాజు ప్రదర్శించిన నటన. నభూతో అన్నారు.

వరుసగా బయటి నిర్మాణ సంస్థల్లో చిత్రాలు చేస్తున్న కృష్ణంరాజుకు సొంత బ్యానర్‌లో చిత్రాలు చేసేందుకు చాలా గ్యాప్‌ వచ్చింది. మూడో చిత్రం విజయం సాధించకపోవడంతో గోపికృష్ణా బ్యానర్‌ను మళ్లీ నిలబెట్టేందుకు 1984లో బొబ్బిలి బ్రహ్మణ్ణ చిత్రాన్ని చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. అఖండ విజయాన్ని సాధించింది. కృష్ణంరాజులోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.

మెప్పించిన రౌద్రరసం..
బొబ్బిలి బ్రహ్మన్న తర్వాత చారిత్రక చిత్రాన్ని చేయాలన్న తన కోరికను తాండ్రపాపరాయుడు ద్వారా తీర్చుకున్నారు. రంగూన్‌ రౌడీ, కటకటాల రుద్రయ్య చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన తాండ్రపాపారాయుడు కమర్షియల్‌గా పెద్ద హిట్‌ కానప్పటికీ పరిశ్రమలో మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. తాండ్రపాపరాయుడు పాత్రలో ఆయన ప్రదర్శించిన రౌద్రరసం సినీ విమర్శకులను మెప్పించింది.

బుల్లెట్‌ చిత్రంలో మొరటోడిగా..
బాపు దర్శకత్వంలో వచ్చిన బుల్లెట్‌ చిత్రంలో మొరటోడిగా నటించి మెప్పించారు కృష్ణంరాజు. త్రిశూలం, బెబ్బులి, పులి బెబ్బులి, పలనాటి బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు, రంగూన్‌ రౌడీ, పులిబిడ్డ, ఉగ్రనరసింహం, ధర్మాత్ముడు, ధర్మతేజ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కుర్రహీరోల చిత్రాల్లో ఎన్నో మంచి పాత్రలు చేశారు కృష్ణంరాజు. నీకు నేను నాకు నువ్వు చిత్రంలో నిబద్ధత కలిగిన తండ్రి పాత్రలో చక్కగా నటించారాయన.

బిల్లాలో పవర్​ఫుల్​ పోలీసు పాత్రలో..
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆద్యంతం చిత్రీకరించిన మా నాన్నకు పెళ్లి చిత్రంలో కృష్ణంరాజు ప్రధాన పాత్ర పోషించారు. ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. నటవారసుడు ప్రభాస్‌తో కలిసి బిల్లా చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసు పాత్ర చేసిన కృష్ణంరాజు.. రుద్రమదేవి లాంటి భారీ చిత్రంలో గణపతి దేవుని పాత్రలో తనదైన నటనతో మెప్పించారు.

actor krishnam raju dead
కృష్ణంరాజు, ప్రభాస్​

ఎన్నో అవార్డులు..
కృష్ణంరాజు విలక్షణమైన నటనా శైలి కారణంగా ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1977లో అమరదీపం చిత్రానికి, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలో ఆయన ప్రదర్శించిన నట విశ్వరూపానికి నంది అవార్డులతో సత్కరించింది. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న కృష్ణంరాజు.. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు.

Last Updated :Sep 11, 2022, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.