ETV Bharat / entertainment

కొత్త హీరోయిన్ల లక్కీ స్టార్​ - ప్రతి పాత్ర చేయడానికి అదే కారణం!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 11:26 AM IST

Actor Chandramohan Passed Away : తెలుగుతెర చూసిన ఎంతో మంది నటుల్లో.. చంద్రమోహన్‌ది ప్రత్యేక స్థానం. పాత్రను బట్టి ఆహార్యం, ఆంగికం, వాచకం మార్చగల అతికొద్ది మంది నటుల్లో చంద్రమోహన్‌ కూడా ఒకరు. 6 దశాబ్దాల నటజీవితంలో 600కిపైగా చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా, కమెడియన్‌గా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు వేశారు. వెండితెరపై ధ్రువ తారలుగా నిలిచిన ఎంతో మంది హీరోయిన్లకు.. తొలి హీరో చంద్రమోహనే. ఒక్క అడుగు ఎత్తు ఉండి ఉంటే చిత్రసీమను ఎలేవారన్న పొగడ్తలు తప్ప రావాల్సినంత గుర్తింపు రాకున్నా. ఎనాడూ నిరుత్సాహ పడని చంద్రమోహన్‌ చివరి వరకూ కళామతల్లినే నమ్ముకొని బతికారు. వెళ్తూ వెళ్తూ నవరసనటనా జ్ఞాపకాలనువెండితెరపై మనకొదిలి ఆయన మౌనంగా దివికేగారు.

Actor Chandramohan Passed Away
Actor Chandramohan Passed Away

Actor Chandramohan Passed Away : నిజాయతీగా కళను మాత్రమే నమ్ముకుని సినిమా పరిశ్రమకు సేవ చేసిన వారిలో ఆయన ఒకరు.. గుర్తింపు కోసం పాకులాడకుండ నటనే ప్రాణంగా ప్రేక్షకాభిమానమే ధ్యేయంగా ముందుకు సాగారు. తొలి సినిమా తోనే బ్రేక్‌ సంపాదించుకుని కొత్తవాళ్లకు పరిచయం చేయడం అనే ట్రెండ్‌కు నాందిగా నిలిచి ఆరు దశాబ్దాలు తెలుగు సినీ తెరపై తనకు ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్న నటుడు చంద్రమోహన్‌ (82) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.

తన నటనతో తెలుగు తెరకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చుకున్న చంద్రమోహన్‌ కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1942 మే 23న వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు మళ్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి కొంత కాలం ఏలూరులో పనిచేసినా సినిమాల్లో నటించాలనే ఉత్సాహం కాలు నిలువనీయలేదు.

అలా మద్రాసు రైలెక్కిన చంద్రమోహన్‌ ఓ విధంగా అదృష్టవంతుడైతే మరో విధంగా అదృష్టానికి కష్టాన్ని ప్రతిఫలంగా ఇచ్చిన నటుడు 1966లో వచ్చిన 'రంగుల రాట్నం' చిత్రంతో ఆయన సినిమా దిగ్విజయ యాత్ర ప్రారంభమయ్యింది. మొదటి సినిమాకే పొట్టివాడైనా చాలా గట్టివాడని దర్శకుడు బీఎన్​ రెడ్డి ప్రశంసలందుకున్నారు. ఆ సినిమా బంగారు నంది, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకోవడం చంద్రమోహన్‌కు కలిసొచ్చింది.

ఆ తర్వాత వచ్చిన 'సుఖ దుఃఖాలు' చంద్రమోహన్‌కి మరో బ్రేక్‌ను ఇచ్చింది. ఇందులో వాణిశ్రీ అన్నగా చంద్రమోహన్‌లోని మరో కోణం వెండితెరపై ఆవిష్కృతమైంది. ఆ వెంటనే 'బంగారు పిచ్చుక' సినిమాతో కథానాయకుడిగా మారిన చంద్రమోహన్‌ 'ఆత్మీయులు', 'తల్లిదండ్రులు', 'బొమ్మా బొరుసా', 'రామాలయం', 'కాలంమారింది', 'జీవనతరంగాలు' ఇలా వరుస చిత్రాలు చేశారు.

1974లో వచ్చిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రం చంద్రమోహన్‌ జీవితంలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఆవేశం, దేశ భక్తి సమ్మిళితమైన పాత్రలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ నటన తర్వాత చంద్రమోహన్‌ నటన ప్రతి ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది.

Actor Chandramohan Movies : 1978 ఏడాది చంద్రమోహన్‌ జీవితంలో కీలకమలుపు చోటుచేసుకుంది. చంద్రమోహన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'సిరిసిరిమువ్వ', 'సీతామాలక్ష్మి', 'పదహారేళ్ల వయసు' చిత్రాలు మూడు ఆ ఏడాదే విడుదలయ్యాయి. ఈ మూడు కొత్త కథానాయికల సినిమాలే. 'సిరిసిరిమువ్వ'లో నటించిన జయప్రద, 'పదహారేళ్ల వయసు'లో నటించిన శ్రీదేవి ఎంత పెద్ద కథానాయికలు అయ్యారో మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత చంద్రమోహన్‌ సరసన మొదటి సినిమా చేయడమంటే ప్రతికథానాయిక అదృష్టంగా భావించేవారు.

ఆ తర్వాత మంజుల, రాధిక, ప్రభా, విజయశాంతి, తాళ్లూరి రామేశ్వరి ఇలా ఎంతో మంది చంద్రమోహన్‌ పక్కన తొలి సినిమాలు చేసి కేరీర్‌లో నిలదొక్కుకున్నారు. కథానాయికలకు తొలి సినిమా హీరోగా పేరుతెచ్చుకున్న చంద్రమోహన్‌. ఒక్క అడుగు పొడుగు ఉండి ఉంటే ఎప్పుడో సూపర్‌స్టార్‌ అయ్యే వాడని తోటి కథానాయకులు, దర్శకులు, నిర్మాతలే కితాబిచ్చిన నటుడు.

పాత్రకు తగ్గ ఆహార్యం, వాచకంపై విస్పష్ట అవగాహన ఉన్నందునే ఎన్నో సినిమాల్లో అద్భుతమైన అభినయం చేశాడనే కితాబు అందుకున్నారు. ఎత్తు ఒక ప్రతిబంధకమైనా ఒకానొక సమయంలో తెలుగు తెరను ఊపేసిన కామెడీ, ఫ్యామిలీ చిత్రాలకు చంద్రమోహన్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి నవ్వుల పువ్వులు పూయించారు. జయమ్ము నిశ్చయంభురా, వివాహ భోజనంబు లాంటి ఎన్నో చిత్రాలు ఇందుకు ఉదాహరణ.

చంద్రమోహన్‌కు వరుస పాత్రలు వచ్చినా సంపాదన మాత్రం తక్కువే వచ్చేది. అందుకే ఆర్థికంగా నిలదొక్కుకోడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. దొరికిన ప్రతి పాత్ర చేయడానికి అదే కారణమని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ఆ క్రమంలో ఆయన క్యారెక్టర్‌ నటుడిగా మారారు. నటనలో ఈస్‌ ప్రదర్శించడం డైలాగ్స్‌లో మంచి అవగాహన చూపే ఆయన విడుదలైన ప్రతీ చిత్రంలో ఉండేవారు. అలా 'అల్లుడు గారు,' 'ఆదిత్య 369', 'కలికాలం','ఆమె', 'కూతురు', 'నిన్నేపెళ్లాడతా','మన్మధుడు', 'అతనొక్కడే', '7/G బృందావన కాలనీ', 'పౌర్ణమి', 'దూకుడు' లాంటి ఎన్నో సినిమాల్లోని పాత్రల్లో జీవించారు.

నటుడిగా 600పైగా చిత్రాల్లో నటించిన చంద్రమోహన్‌.. హీరోగా తిరుగులేని ఇమేజ్‌ సంపాదించుకున్నట్టే, కామిడీ హీరోగానూ అదే స్థాయిలో వెలుగొందారు. క్యారెక్టర్‌ నటుడిగా కూడా తనకు ప్రత్యమ్నాయం లేదని నిరూపించుకున్నారు. సినీ పరిశ్రమలో ఎన్ని మార్పులు వచ్చిన స్థిత ప్రజ్ఞతతో కాలానికి తగ్గట్టు మారుతు తనను తాను విశ్లేషించుకుంటు పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ..మంచి నటుడిగా మంచి మనిషిగా అందరివాడు గా పేరు సంపాదించుకున్నారు చంద్రమోహన్‌.

అన్ని వైవిధ్యమైన పాత్రలు చేసినా.. అద్భుత నటనను ప్రదర్శించినా పరిశ్రమలో ఆయనకు తగిన గుర్తింపు రాలేదనేది ఎంతో మంది చెప్పే మాట. 2005లో వచ్చిన 'అతనొక్కడే' చిత్రంలో ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా నంది అవార్డు సంపాదించుకున్న చంద్రమోహన్‌ తనకు ప్రేక్షకుడు ఇచ్చే గౌరవమే పెద్ద పెద్ద అవార్డులతో సమానమని ఎప్పుడూ చెప్పేవారు. కేరీర్‌ ప్రారంభించిన నాటినుంచి చివరి వరకు సినిమానే లోకంగా బతికిన చంద్రమోహన్‌ తెలుగు సినిమా ఉన్నంతకాలం ఓ నటుడిగా నిలిచే ఉంటారు.

సీనియర్ నటుడు చంద్రమోహన్​ కన్నుమూత

హీరో అయ్యుంటే ఇన్నేళ్లు కష్టమే: చంద్రమోహన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.