ETV Bharat / crime

కలవరపెడుతున్న "బాస్​ స్కామ్"​.. అసలు దీని కథేంటి..?

author img

By

Published : Jan 6, 2023, 12:12 PM IST

Boss Scam Cyber Fraud: సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసి సులువుగా దోచేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తపంథాలో బురిడీ కొట్టిస్తున్నారు. నిరక్షరాస్యుల నుంచి విద్యావంతుల వరకు వీరి మాయలో పడి తేలికగా మోసపోతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. మోసాలు చేసేందుకు సైబర్​ నేరస్థులు ఎంత మాత్రం జంకడం లేదు. తాజాగా ఆన్‌లైన్‌ మోసాల్లో ‘బాస్‌ స్కామ్‌’ అనే కొత్త తరహా మోసం అందరినీ కలవరపెడుతోంది. అసలు ఈ బాస్ స్కామ్ అంటే ఏంటి..?

Boss Scam Cyber Fraud
Boss Scam Cyber Fraud

Boss Scam Cyber Fraud: తమిళనాడులో జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాల్లో ‘బాస్‌ స్కామ్‌’ అనే కొత్త తరహా మోసం అందరినీ కలవరపెడుతోంది. తెలంగాణలో సామాజిక మాధ్యమాల ద్వారా ఇటీవలి కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. చెన్నైలో 2021లో సైబర్‌ నేరాలకు సంబంధించి 748 ఫిర్యాదులు వచ్చాయి. 2022లో 13,077కు పెరిగాయి. సైబర్‌ నేరాలు గత మూడేళ్లలో 300 శాతం అధికమయ్యాయి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల నేతలు, స్థానిక ప్రతినిధులు తదితర ముఖ్య ప్రముఖులను ‘బాస్‌ స్కామ్‌’ అనే కొత్త తరహా సైబర్‌ మోసం కంగారు పెడుతోంది. ఉన్నతాధికారుల పేరుతో జరుగుతున్నందున దీనికి ఆ పేరు పెట్టారు.

ఉదాహరణకు ఒక కార్యాలయంలో పని చేసే ఉద్యోగికి వారి ఉన్నతాధికారుల నుంచి ఫోన్‌ వస్తుంది. అందులో మాట్లాడే అధికారి... ‘నేను మీటింగ్‌లో ఉన్నాను, వెంటనే నాకు బహుమతి కూపన్‌లు కావాలి, రూ.10 వేల విలువైన 10 కూపన్లు పంపు, తర్వాత నేను డబ్బులు ఇస్తాన’ని చెబుతారు. వెంటనే నమ్మిన ఉద్యోగి కూపన్‌ తీసేందుకు తెలియదు అని చెప్పగానే ఓ లింక్‌ను కూడా అవతలి వ్యక్తే పంపుతాడు. వెంటనే ఆ ఉద్యోగి లింక్‌పై క్లిక్‌ చేసి రూ.లక్షకు 10 కూపన్లు తీసి పంపుతాడు. అయితే తనతో మాట్లాడింది తన ఉన్నతాధికారి కాదనే విషయం అతనికి తర్వాతే తెలుస్తుంది. ఆ అధికారి సెల్‌ఫోన్‌ నెంబర్‌ లాగే మరొక నెంబర్‌ ఉపయోగించడం, వాట్సప్‌లో కూడా అతని ఫొటో ఉండటం వల్ల మొదట అనుమానం రాదు. అవతలవైపు మాట్లాడే వ్యక్తి మనకు మాట్లాడే అవకాశం ఇవ్వడు. కూపన్లు పంపేవరకు వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఉంటాడు. కూపన్లు పంపిన తర్వాత మనం నిజమనుకున్న వ్యక్తికి ఫోన్‌ చేసి అడగడంతో అసలు విషయం బయటపడుతుంది. ఈలోగా బహుమతి కూపన్‌ గడువు ముగుస్తుంది. ఇంకా కూపన్‌ ఉపయోగించి వస్తువులు తీసుకునే చిరునామా నకిలీదిగా ఉంటుంది.

మోసపోయినా చెప్పట్లేదు : ఈ మోసం కొత్తదేమీ కాదని తమిళనాడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. కొన్నేళ్ల నుంచే ఈ నేరాలు జరుగుతున్నా ప్రస్తుతం కొత్త యుక్తితో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంతవరకు 20 మంది పోలీసు అధికారులు సహా 80 మంది ప్రముఖుల పేర్లతో ఈ తరహా మోసాలు జరిగాయని, అందులో లక్షల రూపాయలు మోసం జరిగినట్లు సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు తమ పేరుతో మోసం జరిగిన విషయం బయటకు పొక్కితే అనవసర సమస్యలు ఏర్పడతాయని బయటకు చెప్పటం లేదని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కూపన్‌ సంస్థలు స్పందించాలి : ‘సైబర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షుడు, న్యాయవాది ఎన్‌.కార్తికేయన్‌ మాట్లాడుతూ... ఈ మోసానికి పాల్పడే నేరగాళ్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు, స్థానిక ప్రతినిధుల వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో పొందుతారు. వారి ఫొటోలను సంబంధిత వ్యక్తుల వాట్సప్‌ నెంబర్‌, సామాజిక మాధ్యమాల ద్వారా సేకరిస్తారు. సైబర్‌ నేరాల గురించి అవగాహన ఉంటేనే వీటి నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా బహుమతి కూపన్లు ఇచ్చే సంస్థలు.. ఒక ఉద్యోగి తన ఉన్నతాధికారి పేరుతో కూపన్‌ కొని మూడవ వ్యక్తికి పంపేటప్పుడు దాన్ని సరిచూసుకోవాలి. కూపన్‌ తీసుకునే వ్యక్తి సదరు సంస్థకు ఫోన్‌ చేసి కూపన్‌ సమాచారం అందించి సరైన వ్యక్తికి అది చేరుతుందో? లేదో? ధ్రువీకరించుకోవాలి. తద్వారా ఇలాంటి మోసాలకు లోనయ్యే అవకాశాల నుంచి తప్పించుకోవచ్చు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కూపన్‌ సంస్థలు ఆ కూపన్‌ డెలివరీని ఆపేయాలి. దాని విలువను వెంటనే రద్దు చేయాలి. దీంతో మోసాన్ని అడ్డుకోవచ్చు. ఉత్తర రాష్ట్రాల నుంచి ఈ నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నందున నేరగాళ్లను అరెస్టు చేయడం పోలీసులకు సవాలుగా మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.