ETV Bharat / city

వాల్తేరు క్లబ్‌, దసపల్లా భూములపై సర్కారు దృష్టి

author img

By

Published : Jan 29, 2020, 6:32 AM IST

state governement enquiry about  waltair and dasapalla lands
state governement enquiry about waltair and dasapalla landsstate governement enquiry about waltair and dasapalla lands

విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన వాల్తేరు క్లబ్‌, దసపల్లా భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నందున న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఎలా స్వాధీనం చేసుకోవాలని పరిశీలిస్తోంది.

వాల్తేరు క్లబ్‌, దసపల్లా భూములపై మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి సమీక్షించినట్లు సమాచారం. అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌, హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది (జీపీ- రెవెన్యూ అంశాలు) సుభాష్‌, జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

వాల్తేరు క్లబ్‌ భూ వ్యవహారంపై...
వాల్తేరు రోడ్డులోని సర్వేనెంబర్లు 1012, 1016, 1018, 1021లలో 31 ఎకరాల్లో వాల్తేరు క్లబ్‌ ఉంది. క్లబ్‌ భూములను న్యాయపరంగా స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు దస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ క్లబ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో అధికార, అనధికార వర్గాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది.

ఇదీ వివాదం: 1896లో పేర్ల నారాయణశెట్టి అనే వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని ఆంగ్లేయులు క్లబ్‌ ఏర్పాటు చేశారు. 1956లో ఎస్టేట్‌ రద్దు చట్టం వచ్చాక భూమిని వాల్తేరు క్లబ్‌కు దఖలుపరుస్తూ పట్టా జారీ అయింది. ఇది నిబంధనలకు విరుద్ధమని 1962లో నాటి తహసీల్దారు సెటిల్‌మెంట్‌ కోర్టులో సవాలు చేశారు. పట్టా జారీ చేసిన నిబంధన తప్పుగా ఉందని, మళ్లీ దరఖాస్తు చేసుకుని పొందాలని వాల్తేరు క్లబ్‌ యాజమాన్యాన్ని సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఆదేశించారు. ఆ తరువాత ఈ అంశం మళ్లీ తెరపైకి రాలేదు. యాజమాన్య పట్టాను తీసుకోనూలేదు. దీనిపై పలుమార్లు జిల్లా రెవెన్యూ అధికారులు తాఖీదులిచ్చినా స్పందన కనిపించ లేదు. 1983-85 మధ్య ఇందులోని తొమ్మిదెకరాలను నాటి వుడా సేకరించి క్లబ్‌ యాజమాన్యానికి పరిహారం చెల్లించింది. చట్టప్రకారం పట్టా పొందనందున ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని 2013 మార్చిలో నాటి కలెక్టర్‌ మెమో ఇచ్చారు. దీనిపై క్లబ్‌ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించి యథాపూర్వక స్థితికి ఉత్తర్వులు తెచ్చుకుంది. భూములు క్లబ్‌ యాజమాన్యానివి కాకుంటే వుడా పరిహారాన్ని ఎలా ఇస్తుందని న్యాయస్థానంలో వాదించింది. దీంతో వుడా చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు యంత్రాంగం ఆర్‌ఆర్‌ చట్టాన్ని ప్రయోగించింది. ఈ కేసు న్యాయస్థానంలో నడుస్తోంది.

దసపల్లా భూములపై...
విశాఖలో గవర్నర్‌ బంగ్లాకు సమీపంలో ఖాళీగా ఉన్న ఐదెకరాల విలువైన దసపల్లా భూములపైనా విజయసాయిరెడ్డి అధికారులతో చర్చించారు. ఇప్పటికే ఈ భూములపై ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సిట్‌కు ఫిర్యాదు చేశారు. వీటిని కొందరు ప్రముఖులు అడ్డగోలుగా ఆక్రమించారని, ఇవన్నీ ప్రభుత్వ భూములని గతంలో పలుమార్లు వైకాపా నేతలు ఆరోపించారు. 30ఏళ్లుగా ఈ భూ వ్యవహారం నలుగుతోంది. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వాదోపవాదాలు సాగాయి. అన్నిచోట్లా దసపల్లా రాణి కమలాదేవికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఈ పరిణామాలన్నింటిపైనా సమీక్షించినట్లు తెలిసింది.

జగన్‌కు ఈఏఎస్‌ శర్మ మరో లేఖ
భూసమీకరణ ముసుగులో రైతుల హక్కులను కాలరాయొద్దని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ సీఎం జగన్‌కు సూచిస్తూ మరోసారి లేఖ రాశారు.

ఇదీ చదవండి: ఇకపై ఇంటి వద్దకే పింఛన్.. ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.