ETV Bharat / city

ఆ ప్రతిమలు ఎవరు ఎత్తుకెళ్లినట్టు? దర్యాప్తు ప్రారంభం

author img

By

Published : Sep 17, 2020, 5:21 PM IST

Updated : Sep 17, 2020, 5:56 PM IST

మూడు సింహాల ప్రతిమలు ఎవరు ఎత్తుకెళ్లినట్టు?
మూడు సింహాల ప్రతిమలు ఎవరు ఎత్తుకెళ్లినట్టు?

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన వెండి రథానికి అమర్చిన సింహాల ప్రతిమలు చోరీకి గురైనట్లు ఆలయ అధికారులు ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై దర్యాప్తు జరిపించాల్సిందిగా విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

2019 ఏప్రిల్‌ ఆరో తేదీ నుంచి... ఈనెల 15వ తేదీ మధ్య కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాలలో మూడింటిని అపహరించారని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి రమేష్‌బాబు పోలీసులకు ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తునకు పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని వెండి ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు అపహరణకు గురైనట్లు తేలిపోయింది. అంతర్గత విచారణ, శాఖాపరమైన విచారణ కోసం కమిటీలు వేశామంటూ ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునే ఫిర్యాదు చేసేందుకు.... తటపటాయించిన ఆలయ అధికారులు.. జాప్యం జరుగుతున్న కొద్దీ విమర్శలు తీవ్రమవుతుండడంతో... పోలీసు కేసు నమోదు చేయించారు. ఆలయ ఈవో సురేష్‌బాబు ఆదేశాల మేరకు... సహాయ కార్యనిర్వహణాధికారి నాగోతి రమేష్‌బాబు లిఖిత పూర్వకంగా వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిగా తాను ప్రధాన ఆలయంతోపాటు స్టోర్స్‌ ఇన్‌ఛార్జిగా పని చేస్తున్నానని... 2020 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఉత్సవ విభాగ ఏఈవో పి.సుధారాణి సెలవుతో.. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని తన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.

అంతర్వేది ఘటన తర్వాత

అంతర్వేది ఘటన తర్వాత ఈనెల 14వ తేదీన... దేవాదాయశాఖ కమిషనర్, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్రస్తుత మహామండపం వద్ద ఉన్న షెడ్డు కింద ఉంచిన వెండి రథంపై కప్పిన పట్టాలను.... ఆలయ సహాయ స్థపతి షణ్ముఖం, ఇంజినీరింగ్‌ సిబ్బందితో తొలగించి పరిశీలించామని నాగోతి రమేష్‌బాబు తెలిపారు. రథంలోని నాలుగు స్తంభాలకు అమర్చిన నాలుగు వెండి సింహం విగ్రహాల్లో మూడు సింహం విగ్రహాలు లేకపోవడాన్ని గమనించి... ఈ విషయాన్ని ఆలయ గోల్డ్​ అప్రైజర్‌ డి.షమ్మికి ఫోన్‌లో తెలియజేశామని చెప్పారు. ఈవో అనుమతితో స్ట్రాంగ్‌ రూమ్‌ను తనిఖీ చేశామని... రథానికి సంబంధించిన మూడు వెండి సింహం విగ్రహాలు ఎక్కడా కనిపించలేదని అన్నారు.

విగ్రహాలు అప్పటివి

దేవస్థానం నిర్వహించే ఇన్వెంటరీ రిజిస్ట్రర్​ ప్రకారం ఈ వెండి రథం 2002 ఏప్రిల్‌ 15వ తేదీన దేవస్థానం తయారు చేయించింది.. ఇన్వెంటరీ రిజిస్ట్రర్​ ప్రకారం నాలుగు సింహాల తయారీకి ఉపయోగించిన వెండి బరువు 13 కేజీల 460 గ్రాములు. ఒక్కో సింహం విగ్రహం బరువు సుమారు మూడు కేజీల 365 గ్రాములు. మొత్తం బరువు 10 కేజీల 95 గ్రాములుగా రికార్డులో నమోదైంది. 1999 సంవత్సరంలో ఇంజినీరింగ్‌ విభాగం అప్పుడు తయారు చేసిన అంచనాల ప్రకారం కేజీ వెండి ఎనిమిది వేల రూపాయల వంతున... విగ్రహాల మొత్తం విలువ 80 వేల 760 రూపాయలుగా రికార్డులో పొందుపరిచారని ఏఈఓ రమేష్‌బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 ఏప్రిల్‌ ఆరో తేదీ నుంచి ఈనెల 15వ తేదీ మధ్య కాలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల్లో మూడింటిని అపహరించారని... తన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని రమేష్‌బాబు కోరారు.

ఉపయోగించలేదు..

రథానికి మిగిలిన ఉన్న సింహం విగ్రహాన్ని ఈరోజు పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు ఇతర సిబ్బంది తీయించి- దాని బరువు తూయించారు. ఈ విగ్రహాన్ని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరచాలని ఆదేశించారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ రథాన్ని ఎప్పుడూ వినియోగించలేదని- దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. భక్తుల మనోభావాలు కాపాడేందుకు రథానికి ఉండే మొత్తం విగ్రహాలన్నింటినీ తయారు చేయించి త్వరలోనే వాటిని అమర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. భద్రతా సిబ్బంది నుంచి కూడా వివరణ తీసుకున్నామని... పెనుగంచిప్రోలు ఈవో ద్వారా దేవాదాయశాఖ కమిషనర్‌ విచారణ జరిపిస్తున్నారని చెప్పారు.

ఎన్నో వివాదాలు

ప్రస్తుత ధరల ప్రకారం చోరీకి గురైన వెండి విగ్రహాల విలువ సుమారు 15 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. 1998లో అమ్మవారి కిరీటం దొంగతనం నుంచి నేటి వెండి సింహాల చోరీ వరకు ఎన్నో వివాదాలతో ఇంద్రకీలాద్రి నిత్యం చర్చల్లోనే ఉంటోంది. గతంలో వివాదాలపై విచారణకు ఆదేశించడం.. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపొవడం సాధారణమవుతోంది. 1998లో కనకదుర్గమ్మ బంగారు కిరీటం చోరీ జరిగింది. కిరీటం రికవరీ అయింది. 2004లో అమ్మవారికి గాలిగోపురం తాపడం బంగారంతో చేశారు. ఇది రాగి కల్తీ జరిగిందన్న వివాదం చెలరేగింది. ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది.

దసరా ఉత్సవాలు దగ్గరలోనే..

అభివృద్ధి పేరిట నిర్మాణ పనుల విషయంలో వివాదాలు సర్వసాధారణమే అయ్యాయి. దుర్గగుడిలో అత్యంత వివాదస్పదమైన అంశం గర్భగుడిలో అర్ధరాత్రి పూజలు జరపడం. దీనిపై అప్పటి పోలీసు కమిషనర్‌ నివేదిక ఆధారంగా ఒక అర్చకుడిని సస్పెండ్‌ చేశారు. ఈవోను బదిలీ చేశారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన కనకదుర్గమ్మ ఆలయంలో కార్యకలాపాలు, అభివృద్ధి పనులు సాఫీగా జరగాల్సిందిపోయి అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ రాహిత్యం, వర్గవిభేదాలు ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి. కరోనా కారణంగా అమ్మవారి దేవస్థానానికి భక్తుల సంఖ్య తగ్గింది. ఆదాయం పడిపోయింది. తాత్కాలిక ఉద్యోగులను తొలగించి- శాశ్వత సిబ్బందితోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాలు సమీపిస్తోన్న వేళ- ఇప్పుడు వెండి విగ్రహాల చోరీ అంశం కలకలం రేపుతోంది.

ఇదీ చదవండి: సరిహద్దులో చైనా కొత్త నిర్మాణాలు- నేపాల్ వత్తాసు!

Last Updated :Sep 17, 2020, 5:56 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.