ETV Bharat / city

AP Crime News: ఏపీ క్రైం న్యూస్.. వేర్వేరు ఘటనల్లో పదకొండు మంది మృతి

author img

By

Published : Mar 6, 2022, 8:18 PM IST

Updated : Mar 6, 2022, 10:48 PM IST

AP Crime News
ఏపీ నేర వార్తల అప్​డేట్స్​

AP Crime News: రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన వివిధ ఘటనల్లో 11మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో ఇంటి పైకప్పు కూలి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. కపడలో రైలు కిందపడి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది.

TODAY CRIME NEWS in AP: రాష్ట్రంలో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 11 మంది మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు.

రైలు కిందపడి వృద్ధురాలు ఆత్మహత్య

కడప జిల్లా కృష్ణాపురం వద్ద రైలు కిందపడి 80 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కడప రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇంటి పైకప్పు కూలి ఇద్దరు పిల్లలు మృతి

ప్రకాశం జిల్లా దర్శి మండలం జముకులదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. పాత ఇల్లు మిద్దె కూలి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు స్వాతి(5) యోహాను ‍(7)గా గుర్తించారు.

అనుమానస్పదమృతి..

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కాకర్ల వెంకట నర్సయ్య(40)... కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామ శివారుల్లోని చెరువు కట్ట సమీపంలో ఇవాళ ఉదయం శవమై కనిపించాడు. శనివారం ఉదయం నర్సయ్య తన బంధువు భాగ్యలక్ష్మీకి బ్యాంకులో సాయం చేయడం కోసం దొనకొండ వెళ్లాడు. అక్కడ బ్యాంకు పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. కానీ సాయంత్రమైనా నర్సయ్య ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. దొనకొండ గ్రామ శివారులో శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పెద్దపులిపాకలో మహిళ అనుమానాస్పద మృతి

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెద్దపులిపాకలోని పొలాల్లో వణుకూరు రజిని(33) అనే మహిళ అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దుగ్గిరాలలో పాముకాటుతో మహిళ మృతి

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మహిళ పాముకాటుతో మరణించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కల్లకుంట జయమ్మ(47) అనే మహిళ ఓ దుకాణంలో పని చేస్తోంది. షాపును శుభ్రం చేస్తున్న క్రమంలో ఫ్రిజ్​ కింద నుంచి వచ్చిన పాము ఆమెను రెండుసార్లు కాటేసింది. చుట్టుపక్కలవారు గమనించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఆమె దారిలోనే ప్రాణాలు విడిచింది.

ఆటో-బోలెరో వాహనం ఢీ..

కృష్ణా జిల్లా ముదినేపల్లి వద్ద ఘోర ప్రమాదం తప్పంది. కూలీలో వెళ్తున్న ఆటోను బొలేరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఏడుగురు కూలీలకు గాయాలు కాగా..108 అంబులెన్స్​లో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్దేదేవకుంటలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ భరించలేక రైతు నర్సప్ప(34) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ద్విచక్రవాహనం- ట్రాక్టర్‌ ఢీ.. వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా మక్కువ మండలం కవిరిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం- ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మహిళకు గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రికి తరలించారు.

యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. హిరాపురం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి సూరజ్ కుమార్(32)గా గుర్తించారు. వీరంతా బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కాగా... పలాస ఉద్దానం తాగునీటి పథకం పైపులైన్ పనులు చేసేందుకు మెగా కంపెనీ ద్వారా వచ్చిన వారని తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం పని ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

విశాఖ జిల్లా ఎలమంచిలి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన సూరిబాబు, నానిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ పేలి..

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: TODAY CRIME NEWS: కర్నూలు శివారులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

Last Updated :Mar 6, 2022, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.