ETV Bharat / city

కావాలి ఉచిత ఇసుక... పోవాలి ఇసుక మాఫియా..!

author img

By

Published : Nov 13, 2019, 5:11 PM IST

Updated : Nov 13, 2019, 7:45 PM IST

కావాలి ఉచిత ఇసుక..పోవాలి ఇసుక మాఫియా!

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల మద్దతు కూడగట్టి... ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తెదేపా కార్యాచరణ రూపొందించింది. పలు డిమాండ్లతో చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు.

కావాలి ఉచిత ఇసుక... పోవాలి ఇసుక మాఫియా..!

బెజవాడ అలంకార్ సెంటర్ వద్ద... ధర్నా చౌక్​లో తెదేపా అధినేత చంద్రబాబు రేపు దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఇసుక సమస్యపై... 12గంటలపాటు నిరసన దీక్ష చేయనున్నారు. ఇప్పటికే తెదేపా శ్రేణులు రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సమస్యపై ఆందోళనలు చేశాయి. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ర్యాలీకీ తమ మద్దతు ప్రకటించారు.

భాజపా, జనసేన మద్దతు...
చంద్రబాబు ఇసుకపై దశలవారీగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ వచ్చారు. రేపటి దీక్షకు సంబంధించి... ఇప్పటికే ఆ పార్టీ నేతలు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు పార్టీలు, ప్రజా సంఘాలు చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపటంతో పాటు... 7 డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్​ను తెదేపా నేతలు స్వయంగా కలిసి మద్దతు కోరారు. భాజపా సంఘీభావం తెలపగా... జనసేన తమ ప్రతినిధుల బృందాన్ని దీక్షకు పంపాలని నిర్ణయించింది.

వారికి అండగా ఉండాలి...
దీక్ష ఏర్పాట్లపై చంద్రబాబు ఎప్పటికప్పుడు నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టార్గెట్లు పెట్టుకొని మరీ వైకాపా నేతలు ఇసుకను దోచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కార్మికుల కష్టాల్లో అందరూ అండగా ఉండాలని... వారి కుటుంబాల పట్ల సంఘీభావంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైకాపా దుర్మార్గపు పాలన అంతం చేయడానికి... కలిసిగట్టుగా పోరాడతామని తెదేపా నేతలు స్పష్టం చేశారు.

తెదేపా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు విజయవాడ ధర్నా చౌక్​లో చంద్రబాబు దీక్ష ఏర్పాట్లు పరిశీలించారు. ఇసుక కొరత కారణంగా ఇబ్బంది పడిన అన్ని వర్గాలు... ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలు దీక్షలో పాల్గొనాలని నేతలు కోరారు.

తెదేపా ప్రత్యేక గీతం...
చంద్రబాబు దీక్షకు సంబంధించి తెలుగుదేశం ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ''కావాలి ఉచిత ఇసుక... పోవాలి ఇసుక మాఫియా'' విధానంతో... తలపెట్టే దీక్షకు అన్ని వర్గాల మద్దతు కూడగట్టేలా వివిధ ప్రచారాస్త్రాలను తెలుగుదేశం సంధిస్తోంది.

ఇవీ చదవండి:

'భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకే దీక్ష',

'చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వండి'

Intro:Body:Conclusion:
Last Updated :Nov 13, 2019, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.